ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

ABN , First Publish Date - 2021-07-24T03:39:24+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం, ఇచ్చిన హామీలు అమలు పర్చడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయుల సమాఖ్య నాయకులు ఆరోపించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కావలిటౌన్‌: ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా

కావలిటౌన్‌, జూలై 3: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం, ఇచ్చిన హామీలు అమలు పర్చడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయుల సమాఖ్య నాయకులు ఆరోపించారు. ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ (ఫ్యాప్టో) ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయుల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయన్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అధికారంలోకొచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దుచేస్తామని నేటికీ కాలయాపన చేయడం విడ్డూరమన్నారు. పీఆర్సీ నివేదికను వెంటనే బహిరంగపరిచి 18 జూలై 1 నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు వెంటనే మంజూరు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తరలించరాదన్నారు. కొవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్‌ఛానల్‌ ద్వారా కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ప్యాఫ్టో నాయకులు కంచర్ల మధుసూదన్‌రావు, పువ్వాడి వెంకటేఽశ్వర్లు, చలపతిశర్మ, పీ మాధవరావు, రఘనాథ్‌రెడ్డి, కేవీఎం మోహన్‌, కొండారెడ్డి, జీ వేణుగోపాల్‌, రమణ, కే వేణుగోపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ఉదయగిరిలో...

ఉదయగిరి తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కోసం ఫ్యాప్టో సంఘం నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చంద్రశేఖరరెడ్డి, ఏడుకొండలు, ఓబులేసు, శ్రీనివాసులు, రంతుజాని తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-24T03:39:24+05:30 IST