Abn logo
Oct 23 2021 @ 00:42AM

మనోహర్‌ పంతులుకు అశ్రునయనాలతో తుదివీడ్కోలు

నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు

అంతిమయాత్రకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు

పాల్గొన్న పలువురు ప్రముఖుల


రామన్నపేట, అక్టోబరు 22: జనం నేత, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలి, మలి ఉద్యమకారుడు వేమవరపు మనోహర్‌ పంతులు అంత్యక్రియలు స్వగ్రామం జనంపల్లిలో శుక్రవారం పూర్తయ్యాయి. ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందారు. మృతదేహాన్ని జనంపల్లికి తీసుకురాగా, ఆయన మృతి వార్త తెలుసుకున్న పరిసర గ్రామ ప్రజలు శుక్రవారం వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు. పెద్ద దిక్కును కోల్పోయామని పలువురు కంటతడిపెట్టారు. ఆయన మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సేవలను కొనియాడి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంతిమయ్రాతలో పాల్గొన్నారు. ప్రజా సేవలో ముందుండే మనోహర్‌ పంతులు అంతిమయాత్ర లో కళాకారులు ముందునడుస్తూ పాటలు పాడుతూ, కోలాటం, డప్పు చప్పుళ్లతో కళానివాళులర్పించారు.


పంతులు జీవితం యువతకు స్ఫూర్తి : జానారెడ్డి

మనోహర్‌ పంతులు జీవితం నేటి యువతకు స్ఫూర్తి అని సీఎల్‌పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. పంతులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జానా మాట్లాడుతూ, పంతులు గాంధీజీ సిద్ధాంతాలను స్వయంగా పాటిస్తూ వాటిని ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధిగా జనంపల్లి గ్రామంతోపాటు రామన్నపేట మండల అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారని కొనియాడారు. ఆయన మరణం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన లేకపోవడం ఈ ప్రాంతానికేగాక యావత్‌ తెలంగాణ సమాజానికి తీరనిలోటని అన్నారు. మనోహర్‌ పంతులు ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. అదేవిధంగా మనోహర్‌ పంతులు మృతదేహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, శాసనమండలి మాజీ వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నార్మూల్‌ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్‌, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, లోడంగి శ్రవణ్‌కుమార్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, కల్లూరి మల్లేశం, మేక అశోక్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్‌, దైద రవీందర్‌, దాశరథి అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య, కృష్ణ కౌండిన్య, అభ్యదయ రచయిత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ బెల్లి యాదయ్య, సర్పంచ్‌ రేఖ యాదయ్య, ఎంపీటీసీ వేవరపు సుధీర్‌బాబు, ఎండి.రేహాన్‌, బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా వెంకటేశం, సాల్వేరు అశోక్‌, గోదాసు పృథ్వీరాజ్‌, పూస బాలనర్సయ్య, పున్న లక్ష్మినర్సు, కడమంచి సంధ్యస్వామి సందర్శించి నివాళులర్పించారు.