నిరసన తెలుపుతున్న రైతులు

ABN , First Publish Date - 2021-05-05T06:55:42+05:30 IST

పొగాకు బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతులకు నష్టం జరుగుతోందని ఏపీ రైతు సంఘం పశ్చిమప్రకాశం జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి విమర్శించారు.

నిరసన తెలుపుతున్న రైతులు
నిరసన తెలుపుతున్న రైతులు

బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులకు నష్టం

కనిగిరి, మే 4 : పొగాకు బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతులకు నష్టం జరుగుతోందని ఏపీ రైతు సంఘం పశ్చిమప్రకాశం జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి విమర్శించారు. పీసీపల్లి మండలం పెదఅలవలపాడు క్లస్టర్‌కు చెందిన పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించలేదని సోమవారం వేలం ప్రక్రియను నిలిపి వేయగా మంగళవారం కూడా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వేలం కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ అయిన 130 బేళ్లతో పాటు ప్రస్తుతం తీసుకు వచ్చిన బేళ్లను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో బోర్డు అధికారులు చర్చలకు పిలిచారు. వేలంలో కంపెనీలన్నీ పాల్గొనకపోవటం వలన గిట్టుబాటు ధర రావటం లేదని ఒంగోలు ఆర్‌ఎం వేణుగోపాల్‌ సర్దిచెప్పారు. నిన్నటి బేళ్లను వెనక్కి తీసుకు వెళ్లాలని, ఈ రోజు తీసుకు వచ్చిన వాటిని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పటంతో అధికారులు, రైతులు మధ్య చర్చలు విఫలమయ్యాయి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారంటూ రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులు అధికారులు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రైతులు వేలం కేంద్రం నుంచి వెనుదిరిగారు. 180రూపాయలు పలకాల్సిన పొగాకు ధరను 130 రూపాయలకే కొనుగోలు చేయాలని చూడటం దుర్మార్గమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆర్‌ శ్రీను, పేరయ్య,  గోవిందు, వెంకట్రావు. సీహెచ్‌శ్రీను, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-05T06:55:42+05:30 IST