రైతుల ఆశలు నిరాశే..!

ABN , First Publish Date - 2022-01-29T05:25:59+05:30 IST

లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఈ ఏడాది యాసంగిలో పుష్కలంగా నీటి సామర్థ్యం కలిగి ఉంది. కానీ, ఆయకట్టు కింద రైతాంగం పూర్తిస్థాయిలో వరి సాగును చేయలేక పోతున్నారు.

రైతుల ఆశలు నిరాశే..!
ఆయకట్టు కింద బీడు భూములుగా ఉన్న దృశ్యం

- సాగర్‌లో పుష్కలంగా నీరున్నా వరి సాగుపై అనాసక్తి

- కేవలం లక్షా 15వేల ఎకరాలకే సాగు నీరు

- నాన్‌ కమాండ్‌ ఏరియా సాగు భూములు బీడు భూములే..


నిజాంసాగర్‌, జనవరి 28: లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఈ ఏడాది యాసంగిలో పుష్కలంగా నీటి సామర్థ్యం కలిగి ఉంది. కానీ, ఆయకట్టు కింద రైతాంగం పూర్తిస్థాయిలో వరి సాగును చేయలేక పోతున్నారు. ఫలితంగా ఆయకట్టు కింద భూములు బీడు భూములుగానే దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది యాసంగిలో ఆయకట్టు కింద లక్షా 15వేల ఎకరాలకే సాగునీరు అందించేందుకు డిసెంబరు 20న మొదటి విడత, జనవరి 17 నుంచి రెండో విడత నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు సీడీ 1, సీడీ 2 ఆయకట్టు కింద దాదాపు 300 ఎకరాల సాగు భూములు బీడు భూములుగా మారాయి. ఈ ఆయకట్టు కింద రైతులు వరి నారుమళ్లు కూడా వేసుకోలేకపోయారు. యాసంగిలో నిజాంసాగర్‌ ఉభయ జిల్లాల ఆయకట్టు కింద లక్షా 15వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికీ రెండు విడతలుగా సాగునీరు విడుదల చేస్తున్నప్పటికీ ఆయకట్టు కింద రైతులు వరి సాగుపై ఆసక్తి చూపడం లేదు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పుష్కలంగా నీటి మట్టం ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వేయాలని ప్రణాళిక రూపొందించలేకపోయారు. ప్రధాన కాల్వ వెంట ఉన్న డిస్ర్టిబ్యూటర్‌ 0 నుంచి 49 వరకు నీటిని అందించనున్నారు. ప్రభుత్వం యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని ప్రకటించడంతో రైతాంగం నిరాశ చెందారు. రైతులు వరిసాగు చేయలేక బతుకు దెరువు కోసం జంట నగరాలకు వలస వెళదామనే ఆలోచనలో ఉన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ జఠిలం కావడంతో రైతాంగం గ్రామాల్లోనే ఉండిపోయారు. నిజాంసాగర్‌ ఆయకట్టు కింద వరి సాగుకే అనుకూలంగా ఉన్న సాగు భూములు ఆరుతడి పంటలు వేయలేక పోయారు. ప్రభుత్వం మొదట్లో సాగునీరు పుష్కలంగా ఉన్నా వరి సాగుకే ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రకటించినా రైతాంగం సందిగ్ధంలో పడింది. ఆయకట్టు కింద దాదాపు 60వేల నుంచి 70వేల ఎకరాల వరకు మాత్రమే వరి సాగు చేస్తున్నట్లు అధికారుల అంచనా. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 1405 అడుగులకు గాను 1402.50 అడుగుల నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం నిజాంసాగర్‌లో 14.330 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ నిజాంసాగర్‌ ప్రాజెక్టులో వచ్చే వానాకాలం నాటికి కూడా 5 నుంచి 6 టీఎంసీల నీరు నిల్వ ఉండవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్రాజెక్టు నిండుకుండలా దర్శనమిస్తున్నా, ఆయకట్టు కింద బీడు భూములుగా దర్శనమిస్తుండటంతో రైతులు నిరాశ చెందుతున్నారు. 


Updated Date - 2022-01-29T05:25:59+05:30 IST