జంతర్‌మంతర్‌లో ‘రైతుల పార్లమెంటు’

ABN , First Publish Date - 2021-07-23T07:29:06+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు వినూత్న నిరసన ప్రదర్శన ప్రారంభించారు. పార్లమెంటుకు

జంతర్‌మంతర్‌లో ‘రైతుల పార్లమెంటు’

  • 200 మంది అన్నదాతలతో ప్రారంభం


కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు వినూత్న నిరసన ప్రదర్శన ప్రారంభించారు. పార్లమెంటుకు సమీపంలోని జంతర్‌మంతర్‌లో 200 మందితో గురువారం ‘రైతుల పార్లమెంటు (కిసాన్‌ సంసద్‌)’ ను ప్రారంభించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్న అనంతరం రైతులు ఈ నిరసనను ప్రారంభించారు. ఆగస్టు 9 వరకు కిసాన్‌ సంసద్‌ను కొనసాగించనున్నారు. తమ నిరసన ఇంకా సజీవంగానే ఉందని తెలియజేయడానికే దీన్ని ప్రారంభించామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. పార్లమెంటును ఎలా నడపాలో తమకూ తెలుసనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడమే తమ ఉద్దేశమన్నారు. రైతుల పార్లమెంటులో మూడు సెషన్లు జరుగుతాయని.. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లుగా ఆరుగురిని ఎంపిక చేస్తామని రైతు సంఘాల నేత రమీందర్‌సింగ్‌ పటియాలా చెప్పారు.


మరో నేత శివకుమార్‌ కక్కా మాట్లాడుతూ.. రైతుల పార్లమెంటులో ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వారు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌కు పేర్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. భోజన, టీ విరామాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం మీడియా దృష్టంతా కొవిడ్‌పైనే పెట్టడంతో రైతు ఉద్యమం ముగిసిపోయిందని భావిస్తున్నారని, అందుకే రైతుల పార్లమెంటును ప్రారంభించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ రైతు సంఘాల నేతల ఫోన్లపైనా నిఘా పెట్టే ఉంటుందని శివకుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. రైతుల నిరసన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టారు. కాగా, రైతులు ఆందోళన బాట వీడాలని, చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ కోరారు. కొత్త సాగు చట్టాలకు దేశవ్యాప్తంగా రైతులంతా అనుకూలంగా ఉన్నారన్నారు. 


Updated Date - 2021-07-23T07:29:06+05:30 IST