రైతులతో సమగ్ర చర్చలకు సిద్ధం: కేంద్రం
ABN , First Publish Date - 2020-12-15T17:21:40+05:30 IST
సాగు చట్టాల్లోని అంశాలవారీగా రైతులతో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది.
న్యూఢిల్లీ: సాగు చట్టాల్లోని అంశాలవారీగా రైతులతో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. రైతులు కోరుతున్నట్లుగా చట్టాలను రద్దు చేసే అవకాశం లేదని పునరుద్ఘాటిస్తునే చర్చలకు సిద్ధమని తెలిపింది. చట్టాల రూపకల్పనకు ముందు రైతులను సంప్రదించకపోవడం తప్పేనని ప్రభుత్వం అంగీకరించింది. కాగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళనలు మంగళవారం నాటికి 20వ రోజుకు చేరుకుంది.
వ్యవసాయ మంత్రి తోమర్‌ను నిన్న హరియాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. రైతుల ఆందోళన ముగియకుంటే నియోజకవర్గాల్లో ఇబ్బంది తప్పదన్నారు. ఈ సమావేశం తర్వాత తోమర్ హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు. అటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా వ్యవసాయ చట్టాలను సమర్ధించారు. కాగా సాగు బిల్లుల రూప కల్పనకు ముందు రైతు నాయకులను గానీ, సంఘాలను గానీ సంప్రదించకపోవడం తప్పేనని హోంమంత్రి అమిత్ షా అంగీకరించారని రైతు నేత శివకుమార్ శర్మ కాకాజీ వెల్లడించారు. అయితే ఈ మాట షా అన్నదీ లేనిదీ హోంశాఖ వర్గాలు ధృవీకరింలేదు.