పంటల విధానంపై రైతులకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-05-19T10:06:14+05:30 IST

పంటల సాగు విధానంపై రైతులకు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు అవగాహన

పంటల విధానంపై రైతులకు అవగాహన కల్పించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ 


కరీంనగర్‌, మే 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంటల సాగు విధానంపై రైతులకు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా, మండల గ్రామస్థాయి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోముఖ్యమంత్రి మాట్లాడారు. వర్షాకాలంలో సాగుచేసే పంటలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసిందని, అందుకనుగుణంగా ఆయా జిల్లాలకు నిర్దేశించిన పంటలను మాత్రమే రైతులు సాగుచేసి లాభం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.


రాష్ట్రమంతటా వివిధ పంటల కాలనీలుగా విభజన జరగాలని అన్నారు. 2,604 క్టస్టర్లతో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుబంధు కమిటీ సభ్యులు కథానాయకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి తెలిపారు. 70 లక్షల ఎకరాల వరకు పత్తిపంట, 40 లక్షల ఎకరాల వరకు వరి వర్షాకాల సీజన్‌లో వేసుకోవచ్చునని అన్నారు. 12 లక్షల ఎకరాల్లో కంది పంట వేయాలని సూచించారు. ఇష్టం వచ్చిన విధంగా పంటలు వేస్తే రైతులు నష్టపోతారని మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే పంటలనుపండిస్తే లాభం చేకూరుతుందని అన్నారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజేసేందుకు రాబోయే 15రోజులు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధచూపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


వరి విత్తనాలను సీడ్‌ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌ ద్వారా అందుబాటులోకి తెస్తామని అన్నారు. జిల్లాల్లో రాబోయే ఆరు నెలల్లో రైతు వేదికల నిర్మించాలని ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఖాళీగాఉన్న వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను తాత్కాలిక పద్ధతిన భర్తీచేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచించిన విధివిధానాలతో ముందుకు వెళ్లడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2020-05-19T10:06:14+05:30 IST