రైతులను ఆదుకోవాలి..

ABN , First Publish Date - 2021-05-15T05:42:33+05:30 IST

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌తో కలిసి కొవిడ్‌ చికిత్సను, సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు చేశారు.

రైతులను ఆదుకోవాలి..
సూపరింటెండెంట్‌ రమేష్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న బండి సంజయ్‌

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

 రాష్ట్రంలో 35లక్షల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా లబ్ధి

 కరోనా మరణాలను, పాజిటివ్‌ కేసులను దాస్తున్న ప్రభుత్వం

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌

హుజూరాబాద్‌, మే 14: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌తో కలిసి కొవిడ్‌ చికిత్సను, సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందన్నారు. వీటిని కొనుగోలు చేయకుండా మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగిన చోటనే రైతుబంధు, పింఛన్లు మంజూరు చేస్తోందన్నారు. వ్యాక్సిన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరణాలు, పాజిటివ్‌ కేసుల సంఖ్యను ఆయా రాష్ట్రాలు కేంద్రానికి చూపకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. రాష్ట్రంలో 35లక్షల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద లబ్ధి చేకూరిందన్నారు. కరోనా సేవలో పనిచేస్తున్న ఉద్యోగులందరికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్‌ ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో బెడ్ల కొరత, ఆక్సిజన్‌ కొరత లేదని చెబుతున్న జిల్లా మంత్రికి కరోనా మరణాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. అకాల వర్షాలకు తడిసిన వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బింగి కరుణాకర్‌, ముత్యంరావు, పైళ్ల వెంటక్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌, ప్రవీణ్‌కుమార్‌, సతీష్‌, సుమన్‌, కృష్ణ, రామరాజు, దేవేందర్‌రావు పాల్గొన్నారు.


ఎంపీ ఎదుట కంటతడి పెట్టుకున్న ఏఎన్‌ఎంలు


హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిని సందర్శించడానికి వచ్చిన ఎంపీ బండి సంజయ్‌ ఎదుట స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ పనిచేసే ఏఎన్‌ఎంలు కంటతడి పెటుకున్నారు. తమకు రెండేళ్లుగా జీతాలు రావడం లేదంటూ తిరుమల, సునీల, శ్రీలతలు ఎంపీ సంజయ్‌కుమార్‌కు విన్నవించారు. దీనికి స్పందించిన ఎంపీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-05-15T05:42:33+05:30 IST