భయం భయంగా బడికి..

ABN , First Publish Date - 2021-08-17T05:10:01+05:30 IST

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజే విద్యార్థులకు పుట్టెడు కష్టాలు ఎదురయ్యాయి. కొవిడ్‌ ముప్పు నేపథ్యంలో వైరస్‌ కట్టడి నిబంధనలు గాలిలో కలిసిపోయాయి. కోర్టులు ఆదేశించినప్పటికీ పలు స్కూలు భవనాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నేటికీ నడుస్తూనే ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి ముందురోజు తరగతి గదులు, వరండాలు అంతా శానిటైజేషన్‌ చేసి, పరిశుభ్రంగా ఉంచాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. నాడు-నేడు నిర్మాణాలు కూడా కొన్ని పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్నాయి.

భయం భయంగా బడికి..
చీరాల ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో ఉన్న టెంట్లు, కూరగాయల మూటలు

పాఠశాలలు పునఃప్రారంభం 

విద్యార్థుల హాజరు నామమాత్రం

కొవిడ్‌ నిబంధనలు హుష్‌

శానిటైజేషన్‌కు నిధుల కొరత

కొన్ని చోట్ల అమలుకాని 

మధ్యాహ్న భోజనం

పలు స్కూళ్ల

ఆవరణల్లో సచివాలయాలు

అరకొరగానే తెరుచుకున్న

ప్రైవేటు స్కూళ్లు


ఒంగోలు విద్య/చీరాల, ఆగస్టు 16 :

కరోనా మూడో వేవ్‌ ముంచుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులను బడి భయం వెంటాడుతోంది. దీంతో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ హాజరు అంతంతమాత్రంగానే ఉంది. వారు కూడా భయంభయంగానే వెళ్లారు. ప్రైవేటు పాఠశాలలు అరకొరగానే తెరుచుకున్నాయి. అన్నిచోట్లా విధిగా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఆదేశించినా మెజారిటీ పాఠశాలల్లో అమలు కాలేదు. శానిటైజేషన్‌కు సంబంధించి నిఽధులు రానందున తాము చేయలేకపోయామని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. భౌతిక దూరం, నిబంధనలు కూడా అంతంతమాత్రంగానే అమలయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్నిచోట్ల వంట గదుల్లో పొయ్యి వెలగని పరిస్థితి కనిపించింది. 

 జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజే విద్యార్థులకు పుట్టెడు కష్టాలు ఎదురయ్యాయి. కొవిడ్‌ ముప్పు నేపథ్యంలో వైరస్‌ కట్టడి నిబంధనలు గాలిలో కలిసిపోయాయి. కోర్టులు ఆదేశించినప్పటికీ పలు స్కూలు భవనాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నేటికీ నడుస్తూనే ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి ముందురోజు తరగతి గదులు, వరండాలు అంతా శానిటైజేషన్‌ చేసి, పరిశుభ్రంగా ఉంచాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. నాడు-నేడు నిర్మాణాలు కూడా కొన్ని పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం రోజున అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు విద్యార్థులకు సకల సౌకర్యాలు, వసతులు కల్పించాలని సీఎం జగన్‌ మాటలు ఉత్తవని తేలిపోయాయి. 

అరకొరగానే విద్యార్థుల హాజరు

విద్యార్థులు, తల్లిదండ్రులను కరోనా భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించింది. దీంతో తొలిరోజు హాజరు అరకొరగానే ఉంది.  వలేటివారిపాలెం మండలం పోకూరు జడ్పీ హైస్కూలులో 244 మంది విద్యార్థులకు కేవలం 17 మంది మాత్రమే హాజరయ్యారు. కొమరోలు మండలం రాజుపాలెం జడ్పీహైస్కూలులో 156 మందికి కేవలం 56 మంది మాత్రమే పాఠశాలకు వచ్చారు. ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 703 మంది విద్యార్థులకు 190 మంది మాత్రమే హాజరయ్యారు. అదేవిధంగా మరికొన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థుల హాజరు బాగా తక్కువగా ఉన్నట్లు జిల్లా కేంద్రానికి నివేదికలు అందాయి. కనిగిరి మండలం తాళ్లూరు పంచాయతీ పరిధిలోని ఎనిమిరెడ్డిపల్లి మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాల తెరుచుకున్నప్పటికీ ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఇప్పటి వరకూ ఆ  పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయుడు ఈ ఏడాది  జూన్‌లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్త ఉపాధ్యాయున్ని నియమించారు. ఆయన సోమవారం పాఠశాలకు గైర్హాజరయ్యారు. ఎర్రగొండపాలెంలోని ఆదిమ గిరిజన గురుకుల బాలుర విద్యాలయంలో ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు కూడా గైర్హాజరయ్యారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. 

వంట గదుల్లో వెలగని పొయ్యిలు

పాఠశాలల పునఃప్రారంభం రోజు నుంచే మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇది అమలు కాలేదు. ఒంగోలు నగర పరిధిలోని పాఠశాలలకు గతంలో ఏక్తా శక్తి ద్వారా మధ్యాహ్న భోజనం అందించారు. ప్రస్తుతం దాన్ని తొలగించి కుకింగ్‌ ఏజెన్సీల ద్వారా పాత పద్ధతిలోనే విద్యార్థులకు అన్నం వడ్డించి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని రెండు హైస్కూళ్లు, కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టలేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

కనిపించని కొవిడ్‌ జాగ్రత్తలు

పలు పాఠశాలల్లో పిల్లల మధ్య భౌతికదూరం లేదు. వారు తెలిసీ, తెలీక పక్క,పక్కనే కూర్చుంటున్నారు. ఉపాధ్యాయులు పట్టించుకోవటం లేదు. విద్యార్థులు లేదా పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులు ముందస్తుగా చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో లేవు. పాఠశాలల్లో అవసరమైన అన్ని కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు కేటాయించలేదు. 


ఉపాధ్యాయుల నిరసన 

పాఠశాలల పునఃప్రారంభమైన రోజే ఉపాధ్యాయులు నిరసన గళం వినిపించారు. నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాలలనుంచి 3,4,5 తరగతులను విలీనం చేయడాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకించారు.


విద్యా కిట్ల పంపిణీ

జిల్లాలో ఈ ఏడాది మొత్తం 3.52 లక్షల మందికి విద్యాకానుక కిట్లు అందిస్తున్నారు. వీటి పంపిణీని సోమవారం స్థానిక బాలాజీ నగర్‌లోని నగర పాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో రాష్ట్ర విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.  నాడు-నేడు మొదటి దశ కింద 1341 పాఠశాలల్లో రూ. 287.99 కోట్లతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులన్నీ సోమవారం నుంచే విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.

 

పాఠశాలల్లో సచివాలయాలు

వేటపాలెం బాలికల హైస్కూల్‌లోని ఓ గదిలో సచివాలయం నడుస్తోంది. అదేవిధంగా నాయినిపల్లి ప్రైమరీ పాఠశాలలో కూడా సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. వాటిని ఖాళీ చేయలేదు. నాడు-నేడు కార్యక్రమాలతో పాఠశాలల దశ, దిశ మారుస్తామని చెప్పిన మాటలు కొంతమేరే అమలయ్యాయి. నిర్మాణాలు నేటికీ కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. పేరాల ఏఆర్‌ఎం హైస్కూల్లో డైనింగ్‌ రూం పూర్తికాలేదు. చీరాల ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో ఆదివారం వరకు హోల్‌సేల్‌ కూరగాయల దుకాణాలు నిర్వహించారు. వాటి తాలూకు కొందరు కూరగాయలు, టెంట్లు తొలగించలేదు. ఇలా పలు పాశాలలల్లో పరిస్థితి ఉంది. 


ఉన్నతాధికారులకు నివేదించాం

ఏకాంబరేశ్వరరావు, ఎంఈవో, వేటపాలెం

కొన్ని పాఠశాలల్లో సచివాయాలు నిర్వహిస్తున్న మాట వాస్తవమే. అందుకు సంబంధించి ఎక్కడెక్కడ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నడుస్తున్నాయో వాటి వివరాలు డీఈవోకు నివేదించాం. వాటిని ఖాళీ చేయాలని ఎంపీడీవోకు సూచించాం. శానిటైజర్లు కూడా వెంటనే ఏర్పాటు చేస్తాం. పరిశీలించి అన్ని చర్యలు, జాగ్రత్తలు చేపడతాం. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం.




Updated Date - 2021-08-17T05:10:01+05:30 IST