పోరుబాట!

ABN , First Publish Date - 2021-10-22T06:12:49+05:30 IST

రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత అంద రిపైనా ఉందని చెబుతూ మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా జిల్లా నుంచి పలువురు తరలి వెళ్లారు.

పోరుబాట!
చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాజమహేంద్రవరంలో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌ తదితరులు.

బాబు దీక్షకు వెళ్లడానికీ అడ్డంకులే

కలపర్రు వద్ద పోలీసులతో వాగ్వాదం

నేనెళతా.. ఆపండి చూస్తా : గోరంట్ల

బాబుకు మద్దతుగా జిల్లాలో దీక్షలు, ర్యాలీలు

రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి భవాని దీక్ష

బాబు వద్దకు జిల్లా నుంచి భారీగా నేతలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

 రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత అంద రిపైనా ఉందని చెబుతూ మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా జిల్లా నుంచి పలువురు తరలి వెళ్లారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్దతుగా దీక్షలు, ర్యాలీలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ వర్గాలు దాడిచేయడంతో మొదలైన తెలుగుదేశం పార్టీ ఆందోళన తీవ్రతరమవుతోంది.  బుధవారం బంద్‌కు పిలుపు ఇవ్వగా, పోలీసు లు తెలుగుదేశం నేతలను గృహనిర్బంధాలు, అరెస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు 36 గం టల దీక్ష చేపట్టారు. దీనికి మద్దతుగా రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన అనుచరులతో కలసి అమరావతికి వెళ్లే సమయంలో ఏలూరు దాటిన తర్వాత కలపర్రు చెక్‌పోస్టు వద్ద అక్కడి పోలీసులు అడ్డగించారు. అక్కడి సీఐ శ్రీనివాసరావుకు, గోరంట్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నన్ను ఎందుకు ఆపుతున్నారు. నేను ప్రజాప్రతినిధిని. ఆఫీసు పనిమీద వెళుతున్నానని చెప్పడంతో అక్కడి పోలీసు అధికారి వెళ్లడానికి కుదరదని చెప్పారు. దీంతో గోరంట్ల ఆగ్రహంతో ఊగిపోయారు. కావాలంటే అరెస్ట్‌ చేసుకోండి, నేను వెళ్లితీరతాను, పోలీసులు దౌర్జన్యమేంటని ప్రశ్నించారు. పోలీసులు కాసేపు గోరంట్ల కాన్వాయ్‌ను అక్కడే ఆపేశారు. కానీ తర్వాత ఆయన వెళ్లడానికి అనుమతించారు. అక్కడ నుంచి ఆయన చంద్రబాబు దీక్షా స్థలికి చేరుకుని మద్దతు ప్రకటించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా తన అనుచరులతో దీక్షా స్థలికి చేరుకుని మద్దతు ప్రకటించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ వైసీపీకి అనుబంధ సంఘంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. అలాగే జిల్లా నుంచి టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, సుంకర పావని తదితరులు బాబును కలిసిన వారిలో ఉన్నారు. ఇక రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణకార్యదర్శి ఆదిరెడ్డి వాసు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలసి దీక్ష చేపట్టారు. ప్రత్తిపాడులో టీడీపీ శ్రేణులు దీక్ష చేపట్టాయి. అలాగే చంద్రబాబు దీక్షకు వెళ్లకుండా జిల్లాలో పలువురు నాయకులను బుధవారం రాత్రి నుంచే హౌస్‌ అరెస్టు చేశారు. తాజా పరిణామాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.



Updated Date - 2021-10-22T06:12:49+05:30 IST