నక్సల్స్‌పై పోరు ఉధృతం

ABN , First Publish Date - 2021-04-06T08:32:24+05:30 IST

మావోయిస్టులపై పోరును ఉధృతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దేశంలో నక్సల్స్‌ సృష్టిస్తున్న అశాంతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ముగింపు దశకు తీసుకురావాలని కృత

నక్సల్స్‌పై  పోరు ఉధృతం

  • ఈ పోరాటానికి తార్కిక ముగింపు పలుకుతాం
  • ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 
  • సీఎం, ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష
  • దండకారణ్యంలో యుద్ధ వాతావరణం?
  • వేల సంఖ్యలో మోహరింపు.. కూంబింగ్‌ ఉధృతం 
  • తెలంగాణ పోలీసుల హై అలర్ట్‌.. తనిఖీలు


 

చర్ల, అమరావతి, చింతూరు, ఏప్రిల్‌ 5: మావోయిస్టులపై పోరును ఉధృతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దేశంలో నక్సల్స్‌ సృష్టిస్తున్న అశాంతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ముగింపు దశకు తీసుకురావాలని కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. ఇటీవల ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన జవాన్లకు అమిత్‌షా సోమవారం నివాళులర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లతో మాట్లాడారు. ఉదయమే జగ్దల్‌పూర్‌ చేరుకున్న ఆయన.. సీఎం భూపేశ్‌ బఘేల్‌, సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు, ఇతర అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.


అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమర జవాన్లను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా యావత్‌ దేశం నిలబడుతుందన్నారు. నక్సల్స్‌ నియంత్రణలో బలహీనపడొద్దని, వీర జవాన్ల మనోధైర్యాన్ని చెక్కుచెదరనీయకుండా తగిన రీతిలో ముందుకు తీసుకెళ్లాలలని అధికారులు తనతో చెప్పారని వివరించారు. ‘‘ఛత్తీ్‌సగఢ్‌లో నక్సల్స్‌ను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని కొనసాగిస్తూనే.. వామపక్ష తీవ్రవాదాన్ని కట్టడిచేసేందుకు కలిసి పనిచేస్తున్నాయి. నక్సల్స్‌ని నియంత్రించే చర్యల్ని మరింత ఉద్ధృతం చేస్తాం. ఈ పోరాటంలో విజయం మనదే అవుతుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.


ఆరేళ్లుగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అదే సమయంలో.. అక్కడ జవాన్ల శిబిరాలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఈ చర్యలతో మావోయిస్టులు ఒత్తిడికి గురై.. దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. ‘‘నక్సల్స్‌పై పోరు ఉధృతమవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి ఘటన వల్ల.. జవాన్లు మరో రెండు అడుగులు ముందుకువేస్తారు. పోరును తీవ్రతరం చేస్తారు. ఈ రోజు జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో.. ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించాం. ఎలా ముందుకు సాగాలో నిర్ణయించాం. ఈ పోరాటానికి తార్కిక ముగింపు పలుకుతాం’’అని పేర్కొన్నారు.



వేల సంఖ్యలో బలగాలు..

24 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోయిస్టులపై ప్రతీకారం కోసం భద్రతాబలగాలు సిద్ధమయ్యాయి. కోబ్రా, సీఆర్పీఎఫ్‌, డీఆర్‌జీ, ఇతర దళాలకు చెందిన వేల మంది సాయుధ పోలీసులు టెర్రాం అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు దాడి జరిపిన ప్రాంతం నుంచి.. వారు పారిపోయేందుకు వీలున్న మార్గాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. నక్సల్స్‌ వేట కోసం డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు.


ఆపరేషన్‌ నిర్వహణ పేలవం: రాహుల్‌

మావోయిస్టుల జాడ తెలిశాక.. పోలీసు బలగాలు ఆపరేషన్‌ను పేలవంగా నిర్వహించాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘‘నక్సల్స్‌ వైపు కూడా సమాన సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. 21వ శతాబ్దిలో కవచాలు, ఆయుధాలు లేకుండా శత్రువును ఎదుర్కోవడం అంత సులభం కాదు. ప్రతి జవానుకు వాటిని అందజేయాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.



ఆపరేషన్‌కు ముందే మావోయిస్టుల లేఖ

ఛత్తీ్‌సగఢ్‌లో కూంబింగ్‌ చేస్తున్న జవాన్లు, పోలీసులను ఉద్దేశించి మావోయిస్టు పార్టీ ‘దక్షిణ సభ జోనల్‌ బ్యూరో’పేరుతో గత నెలాఖరులో ఓ లేఖ విడుదలైంది. ‘‘ప్రియమైన పోలీసులు, జవాన్లకు మా విన్నపం. మీరంతా పేద, మధ్యతరగతి నుంచి వచ్చిన విద్యావంతులు. మా అభ్యర్థనను మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. జనాందోళనలకు మా మద్దతు ఉంటుం ది. అయితే.. మీరు సర్కారు చెప్పుచేతల్లో ఉంటూ.. ఆ ఆందోళనలను అణచివేస్తున్నారు. మీరు మీ ఉద్యోగాలను త్యజించి, వారి తరఫున పోరాడండి. ఏప్రిల్‌ 1నుంచి 25వరకు ప్రజల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. 26న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాం. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.


ప్రతి జవాన్‌ కుటుంబానికి 80 లక్షలు

మావోయిస్టులతో జరిగిన పోరులో అమరులైన తమ రాష్ట్ర పోలీసుల కుటుంబాలకు రూ.80 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఛత్తీస్‌గఢ్‌ సర్కారు ప్రకటించింది. ఆదివారం నాటి ఘటనలో అమరులైన జవాన్లలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 14 మంది ఉన్నారు. కాగా.. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలకు రూ. 30 లక్షల చొప్పున అందజేస్తామని ఏపీ సర్కారు ప్రకటించింది.


Updated Date - 2021-04-06T08:32:24+05:30 IST