ఈ-పోస్‌తో ఫైన్‌

ABN , First Publish Date - 2021-07-30T05:06:00+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థలోని ఆరోగ్య విభాగం ఉద్యోగుల చేతి వాటానికి చెక్‌ పెడుతూ కమిషనర్‌ కే దినేష్‌ కుమార్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. వివిఽధ కారణాలతో ప్రజలకు విధిస్తున్న జరిమానాలకు ఈ-పోస్‌ యంత్రాల ద్వారా రశీదులు ఇచ్చే విధంగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు. రశీదు ఇచ్చిన వెంటనే వారికి మేస్సేజ్‌ వచ్చేలా ఏర్పాటు చేశారు. పక్షం రోజుల క్రితం ప్రారంభించిన ఈ విధానాన్ని నగరంలోని 50 డివిజన్లలో శానిటేషన్‌ సెక్రటరీల ద్వారా అమలు చేస్తున్నారు.

ఈ-పోస్‌తో ఫైన్‌
ఈ-పోస్‌ యంత్రంతో జరిమానా విధిస్తున్న సిబ్బంది

చేతివాటానికి చెక్‌

శానిటేషన్‌ సెక్రటరీల ద్వారా విధింపు 

50 డివిజన్లలో అమలు 


నెల్లూరు (సిటీ), జూలై 29 : నెల్లూరు నగర పాలక సంస్థలోని ఆరోగ్య విభాగం ఉద్యోగుల చేతి వాటానికి చెక్‌ పెడుతూ కమిషనర్‌ కే దినేష్‌ కుమార్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. వివిఽధ కారణాలతో ప్రజలకు విధిస్తున్న జరిమానాలకు ఈ-పోస్‌ యంత్రాల ద్వారా రశీదులు ఇచ్చే విధంగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు. రశీదు ఇచ్చిన వెంటనే వారికి మేస్సేజ్‌ వచ్చేలా ఏర్పాటు చేశారు. పక్షం రోజుల క్రితం ప్రారంభించిన ఈ విధానాన్ని నగరంలోని 50 డివిజన్లలో శానిటేషన్‌ సెక్రటరీల ద్వారా అమలు చేస్తున్నారు. 


కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. వాటిని పాటించని వారికి జరిమానా విధించాలని కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోనందుకు, భౌతిక దూరం పాటించనందుకు జరిమానాలు విధిస్తోంది. అంతేకాదు నగరంలో పారిశుధ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా రోడ్లపై చెత్త వేసినా, దుకాణాల ముందు డస్ట్‌ బిన్లు ఏర్పాటు చేయకపోయినా ఫైన్‌ వేస్తారు. బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేసినా కూడా జరిమానా కట్టాల్సిందే!. ఇన్ని రకాలుగా విధిస్తున్న ఫైన్లను వసూలు చేసే ఉద్యోగులు సదరు మొత్తానికి రశీదు ఇస్తున్నారా?, వసూలు చేసిన మొత్తాన్ని కార్పొరేషన్‌ కార్యాలయంలో జమ చేస్తున్నారా? అన్నది ప్రశ్నార్థకం. గతంలో జరిమానాలకు సంబంధించి ఆరోగ్య విభాగంలో పనిచేసే పలువురు సిబ్బంది వేల రూపాయలను దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని పారదర్శకతకు బాటలు వేస్తున్నారు. ఈ-పోస్‌ యంత్రాల ద్వారానే ఫైన్లు వసూలు చేయాలని ఆదేశించారు. ఎన్ని రకాలుగా జరిమానా విధిస్తారో వాటి వివరాలు ఈ-పోస్‌ పరికరాల్లో ముందుగానే నిక్ష్లిప్తం చేసినందున ఎవరికైనా జరిమానా విధించాల్సి వస్తే దానిని ఎంపిక చేసుకుని ఫైన్‌ కట్టే వారి ఫోన్‌ నెంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే నగదు చెల్లించిన వారికి మెసేజ్‌ వెళుతుంది. అదే సమాచారం కార్పొరేషన్‌ కార్యాలయంలోని సాంకేతిక వ్యవస్థకు కూడా చేరుతుంది. ఏరోజుకారోజు సిబ్బంది ఎవరెవరు ఎంత జరిమానా వసూలు చేశారో తెలిసిపోతుంది. ఆ మేరకు వారు కార్పొరేషన్‌ ఖజానాలో నగదు జమ చేయాల్సి ఉంటుంది.


50 డివిజన్లలో అమలు 

ఈ-పోస్‌తో ఫైన్ల విధానాన్ని ప్రస్తుతం 50 డివిజన్లలో అమలు చేస్తున్నారు. త్వరలో మిగిలిన 4 డివిజన్లలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.  ఈ జరిమానా వసూలు బాధ్యతను శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు బదులు శానిటేషన్‌ సెక్రటరీలకు అప్పగించడం గమనార్హం. 


ఫైన్‌ రహిత నెల్లూరుకు కృషి 

- వెంకట రమణయ్య, ఎంహెచ్‌వో 

చట్టాలు, నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. ఇంకా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. ఫైన్‌ రహితంగా నెల్లూరును తయారు చేయాలన్నది మా ఉద్దేశం. నిబంధనలు ఉల్లంఘించడం అనేది లేకపోతే జరిమానా వేయాల్సిన అవసరం రాదన్న వాస్తవాన్ని గుర్తించాలి. 

Updated Date - 2021-07-30T05:06:00+05:30 IST