ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-08-05T10:29:43+05:30 IST

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లోని కోనెక్స్‌ ఫార్మా కర్మాగారం(విజయశ్రీ కంపెనీ) వద్ద మంగళవారం ఉదయం 11 ..

ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

ట్యాంకు నిండి వెలుపలికి వచ్చిన రసాయన వ్యర్థాలు

ఒక్కసారిగా రాజుకున్న అగ్ని, ఎగిసిపడిన మంటలు, పొగ

స్థానికుల భయాందోళన

తప్పిన పెనుప్రమాదం


అచ్యుతాపురం, ఆగస్టు 4: అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లోని కోనెక్స్‌ ఫార్మా కర్మాగారం(విజయశ్రీ కంపెనీ) వద్ద మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. కర్మాగారంలో రసాయన వ్యర్థాలను నిల్వచేసే ట్యాంక్‌ నిండిపోయి బయటకు వచ్చేసింది. దీనిని సిబ్బంది ఎవరూ గమనించలేదు. మెయిన్‌ గేటు పక్కనున్న కాలువలో ఒక్కసారిగా మంటలు లేచాయి. భారీఎత్తున పొగ వెలువడింది. దీంతో స్థానికులు, చుట్టుపక్కల గల కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. సెక్యూరిటీ సిబ్బంది, కంపెనీ ఉద్యోగులు అందుబాటులో వున్న ఫోమ్‌ను వినియోగించి మంటలను అదుపుచేశారు. రసాయన వ్యర్థాలు నిల్వచేసిన ట్యాంక్‌కు మంటలు చేరకుండా నిలువరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అదే ట్యాంకుకు మంటలు వ్యాపించి వుంటే పరిస్థితి మరోలా ఉండేదని కార్మికులు అంటున్నారు.


అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే రసాయన వ్యర్థాలు బయటకు వచ్చాయని, ఈ వ్యర్థాలు మరింత దూరం ప్రవహించి అగ్నిప్రమాదం జరిగి వుంటే ఊహించని నష్టం జరిగేదని వారు అభిప్రాయపడుతున్నారు. రాంబిల్లి, అచ్యుతాపురం తహసీల్దార్లు, రాంబిల్లి ఎస్‌ఐ అరుణ కిరణ్‌, ఎలమంచిలి సీఐ నారాయణరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.


ఎన్నో అనుమానాలు!

విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): 

అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లోని విజయ శ్రీ కంపెనీలో  ప్రమాదం సంభవించగా... అధికారులు దానిపై సరైన సమాచారం వెల్లడించలేదు. అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అది మందులు తయారు చేసే కంపెనీయా? వ్యర్థాలను శుద్ధి చేసే కంపెనీయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. నిల్వ చేసిన వ్యర్థాలు బయటకు వచ్చి కాలువలో కలిసిపోయాయని, అందులో ఎవరో సిగిరెట్‌ తాగి పడేస్తే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మందులు తయారు చేసే కంపెనీ అయితే వ్యర్థాలను బయటకు తరలించాలి. స్టోరేజీ ట్యాంక్‌ నిండిపోయి, బయటకు వచ్చి కాలువలో కలిసిపోయేంతవరకు దానిని యాజమాన్యం గుర్తించ లేదంటే... అది చాలా పెద్ద తప్పు. రసాయన వ్యర్థాలను అలా బయటకు వదలకూడదు. అలా కాకుండా ఆ కంపెనీ వ్యర్థాలను శుద్ధి చేసేదైతే... ఆ పని చాలా పకడ్బందీగా చేయాలి. బయటకు వాటిని విడిచిపెట్టకూడదు.


ప్రమాదం తీవ్రత తగ్గించి చూపుతున్నారు 

ప్రమాదం జరిగినప్పుడు పెద్ద పేలుడు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. మంటలు కూడా పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. ఆకాశంలోకి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. కానీ ప్రమాదం పెద్దది కాదని, రెండు ద్విచక్ర వాహనాలు కాలిపోతే... వాటిని స్థానిక అగ్నిమాపకదళం వచ్చి ఆర్పేసిందని చెబుతున్నారు. వాహనాలు కూడా పూర్తిగా దహనం కాలేదు. అంటే ప్రమాదం బయట కాకుండా లోపల జరిగిందని, అదేమిటో వెల్లడించడం లేదని అర్థమవుతున్నది. దీనిపై జిల్లా అధికారులు, పరిశ్రమల అధికారులు దృష్టి పెడితే తప్ప విషయం బయటకు వచ్చే అవకాశం లేదు.

Updated Date - 2020-08-05T10:29:43+05:30 IST