Abn logo
Jul 11 2021 @ 16:30PM

మీ మంత్రుల సంతానం వివరాలు ముందు అడగండి: యోగికి ఖుర్షీద్ కౌంటర్

న్యూఢిల్లీ: యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న జనాభా నియంత్రణ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బిల్లు తీసుకు వచ్చేముందు ఒక పని చేయాలని, తమ చట్టబద్ధ సంతానంపై మంత్రులు, ప్రభుత్వ నేతల నుంచి ముందు సమాచారం కోరాలని సూచించారు. 

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నూతన జనాభా విధానాన్ని ఆదివారం విడుదల చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ 2021-2030 జనాభా విధానాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో జనాభాను నియంత్రించేందుకు వీలుగా బిడ్డకు, బిడ్డకు మధ్య కొంత విరామం ఇవ్వాలని పిలుపునిచ్చారు. సుస్థిర అభివృద్ధి, వనరుల పంపిణీలో సమన్యాయం కోసం జనాభాను నియంత్రించి, స్థిరపరచవలసిన అవసరం ఉందని అన్నారు. దీనిపై ఖుర్షీద్ స్పందిస్తూ, చట్టబద్ధ సంతానంపై ముందు మంత్రులు, ప్రభుత్వ నేతల నుంచి వివరాలు తీసుకోవాలని, బిల్లు తేవడానికి ముందు ఆ పని చేయాలని యోగికి కౌంటర్ ఇచ్చారు. యోగి తీసుకువస్తున్న నూతన జనాభా విధానం ప్రకారం, ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు, సబ్సిడీలు పొందేందుకు అనర్హులవుతారు. తాజా బిల్లుపై ఈనెల 19 వరకూ  ప్రజల సూచనలను యూపీ సర్కార్ ఆహ్వానించింది.