కోవిడ్‌పై మొదట చర్చ... ఆ తర్వాతే ప్రెజెంటేషన్: ప్రధానికి ఖర్గే కౌంటర్

ABN , First Publish Date - 2021-07-20T20:09:21+05:30 IST

దేశంలో కోవిడ్‌ పరిస్థితిపై మోదీ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనుకోవడంపై రాజ్యసభలో ప్రతిపక్ష..

కోవిడ్‌పై మొదట చర్చ... ఆ తర్వాతే ప్రెజెంటేషన్: ప్రధానికి ఖర్గే కౌంటర్

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ పరిస్థితిపై మోదీ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనుకోవడంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మంగళవారంనాడు స్పందించారు. ముందు సభలో చర్చ జరపాలని, ఆ తర్వాతే ప్రధాని ప్రెజెంటేషన్ ఇచ్చుకోవచ్చని అన్నారు. ''ముందు సభలో చర్చ జరగాలి. ఆ తర్వాతే ఏదైనా. కోవిడ్‌పై ప్రెజెంటేషన్ ఇవ్వాలని మోదీ అనుకుంటే ప్రత్యేకంగా సెంట్రల్ హాలులో ఆయన ప్రెజెంటేషన్ ఇవ్వొచ్చు. ఎంపీలు వారివారి నియోజకవర్గాల్లో కోవిడ్ సంబంధిత అంశాలపై చర్చించుకోవచ్చు'' అని ఖర్గే పేర్కొన్నారు. పార్టీల నేతలు కొంత సమయమిస్తే కోవిడ్ పరిస్థితిపై మంగళవారం సాయంత్రం కొంత బ్రీఫింగ్ ఇవ్వగలనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఖర్గే తాజా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.


అభివృద్ధి నిరోధకులు మీరే...

కాగా, దేశ అభివృద్ధిని పట్టాలు తప్పించాలని కొందరు చూస్తున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖర్గే కొట్టివేశారు. దేశ అభివృద్ధికి ఎవరూ అడ్డుపడటం లేదని, అడుగడుగునా అడ్డుకుంటున్నది బీజేపీయేనని అన్నారు. ''సెస్‌లు విధిస్తూ, ఇంధనం ధరలు పెంచుతూ, ప్రాజెక్టుల పేరుతో డబ్బు వృథా చేస్తూ వాళ్లు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు'' అంటూ ఖర్గే ఘాటుగా విమర్శించారు.

Updated Date - 2021-07-20T20:09:21+05:30 IST