తెల్లవారజామున తొలి రైలు కూత

ABN , First Publish Date - 2020-06-02T09:09:32+05:30 IST

లాక్‌డౌన్‌ 5.0లో కొన్ని రైళ్లకు అనుమతి ఇవ్వడంతో సోమవారం ఉదయం గుంటూరు రైల్వేస్టేషన్‌

తెల్లవారజామున తొలి రైలు కూత

గుంటూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ 5.0లో కొన్ని రైళ్లకు అనుమతి ఇవ్వడంతో సోమవారం ఉదయం గుంటూరు రైల్వేస్టేషన్‌ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ రైలు కూత పెట్టుకొంటూ సికింద్రాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. 70 రోజుల తర్వాత గుంటూరు రైల్వేస్టేషన్‌ ప్రయాణికుల రాకతో కళకళలాడింది. కట్టుదిట్టమైన బందోబస్తు, వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటూ ప్రయాణికులను ఒక్కొక్కరుగా రైలు ఎక్కించారు. టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకొన్న వారు తాము ఎక్కడ ప్రయాణం మిస్‌ అవుతామోనని అర్ధరాత్రి 12 గంటల నుంచే బాపట్ల, చీరాల తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు వచ్చినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఆర్‌ మోహన్‌రాజా ఏర్పాట్లను పర్యవేక్షించారు.


ఈ సందర్భంగా ఒక్క ప్రయాణికుడికి కూడా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఏవీ కనిపించలేదు. గుంటూరు రైల్వేస్టేషన్‌ నుంచి సుమారు 550 మంది రైలులో ఎక్కారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ని పక్కాగా అమలు చేస్తోన్నామన్నారు. గుంటూరు మీదగా ప్రస్తుతానికి గోల్కొండ, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు. 


ఇతర జిల్లాలకు రైలు ప్రయాణం రద్దు

రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ప్రాంతాలకు రైలు ప్రయాణాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీ రాకేష్‌ తెలిపారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి అనుమతి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బుకింగ్‌ అయిన టిక్కెట్లను రద్దు చేసి 100 శాతం టిక్కెట్‌ చార్జీని రీఫండ్‌ చేస్తోన్నామన్నారు.

Updated Date - 2020-06-02T09:09:32+05:30 IST