జిల్లాకు ఐదు చైర్మన్‌ పదవులు?

ABN , First Publish Date - 2021-06-15T07:26:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నామినే టెడ్‌ పదవుల పందేరంలో భాగంగా జిల్లాకు ఐదు కార్పొరేషన్‌ చైర్మన్‌ సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది.

జిల్లాకు ఐదు చైర్మన్‌ పదవులు?
బ్రహ్మానందరెడ్డి, చైతన్య, వెంకయ్య, జంకె వెంకటరెడ్డి

బ్రహ్మారెడ్డి, చైతన్య, వెంకయ్యలకు దక్కనున్న అవకాశం 

పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే జంకె పేరు  

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నామినే టెడ్‌ పదవుల పందేరంలో భాగంగా జిల్లాకు ఐదు కార్పొరేషన్‌ చైర్మన్‌ సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు మరో 25కిపైగా డైరెక్టర్‌ పదవులు కూడా లభించనున్నాయి. ఇప్పటికి అందిన సమాచారం మేరకు.. వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, అద్దంకి, కొండపి వైసీపీ ఇన్‌చార్జ్‌లు బాచిన కృష్ణచైతన్య, మాదాసి వెంకయ్యలకు చైర్మన్‌ పదవులు దక్కే ఛాన్స్‌ ఉంది. పర్చూరు ఇన్‌చార్జ్‌ వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవ టంతో దాంతో సంబంధం ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది తెలియరాలేదు. అయితే మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి ఒక సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొత్తగా ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీఎం ఆదేశాలతో నిబంధనలు రూపొందించారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఎదురయ్యే ప్రొటోకాల్‌ సమస్యను అధిగమించేందుకు పార్టీ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారికి పదవులు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దాంతో పాటు గత ఎన్నికలలో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వలేకపోయిన వారికి, ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి కూడా ఇవ్వలేకపోయిన వారికి ప్రాధాన్యం ఇచ్చి పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దానికితోడు ప్రతి జిల్లాకు కొన్ని చైర్మన్‌ పదవులు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేశారు. ఈ నేపథ్యంలో  సోమవా రం మంత్రి బాలినేని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌ వేమిరెడ్డితో మాట్లాడారు. జిల్లాకు చెందిన మరోమంత్రి సురేష్‌ కూడా బాలినేనితో మాట్లాడి కొన్ని పేర్లని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-06-15T07:26:06+05:30 IST