గర్భశోకం

ABN , First Publish Date - 2022-01-20T05:58:07+05:30 IST

పుట్టిన బిడ్డ అనారోగ్యంతో చనిపోతే ఏ తల్లి అయినా కన్నీరుమున్నీరు అవుతుంది.

గర్భశోకం
సావిత్రి

పుట్టిన కొద్దిరోజులకే శిశువులను కోల్పోతున్న ఓ తల్లి

వరుసగా ఐదుగురు బిడ్డలు మృత్యువాత

కొయ్యూరు, జనవరి 19: పుట్టిన బిడ్డ అనారోగ్యంతో చనిపోతే ఏ తల్లి అయినా కన్నీరుమున్నీరు అవుతుంది. అటువంటిది ఒకరు కాదు..ఇద్దరు కాదు...వరుసగా ఐదుగురు బిడ్డలు పుట్టిన కొద్దిరోజుల్లోనే కన్నుమూస్తే ఆ మాతృమూర్తి గర్భశోకం వర్ణనాతీతం. హృదయాలను ద్రవింపజేసే ఇటువంటి సంఘటన విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ శివారు బాలరేవుల గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బాధిత కుటుంబం, వైద్య సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


జి.మాడుగుల మండలం గడుతూరుకు చెందిన పాంగి సంతోష్‌కు, కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ బాలరేవుల గ్రామానికి చెందిన రెడ్డి లక్ష్మణరావు కుమార్తె సావిత్రికి 2015లో వివాహమైంది. ఇద్దరూ గడుతూరులోనే నివాసం ఉంటున్నారు. ఆరేళ్ల క్రితం సావిత్రి మొదటి కాన్పు (ఆడ శిశువు) అయ్యింది. కొద్దిరోజుల తరువాత ఊపిరిపీల్చుకోవడం కష్టంగా మారి బిడ్డ చనిపోయింది. అనంతరం పుట్టిన ముగ్గురు బిడ్డలు (ఒకరు ఆడ, ఇద్దరు మగ శిశువులు) కూడా నెల నుంచి మూడున్నర నెలలలోపు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఐదో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. డిసెంబరు ఒకటో తేదీన మగ బిడ్డను ప్రసవించింది. శిశువుకు స్వల్ప అస్వస్థత చేయడంతో నర్సీపట్నంలో చిన్నపిల్లల వైద్య నిపుణులకు చూపించేందుకు సోమవారం మధ్యాహ్నం బాలరేవుల నుంచి బయలుదేరి కాకరపాడు సమీప బొర్రగొంది గ్రామంలో నివాసముంటున్న తన చెల్లెలు ఇంటికి వచ్చింది. కొద్దిసేపటి తరువాత శిశువు గుక్కపట్టి ఏడుస్తుండడంతో 8.30 గంటల సమయంలో రాజేంద్రపాలెం పీహెచ్‌సీకు తీసుకువెళ్లారు. వైద్య సిబ్బంది నెబులైజర్‌ పెట్టి 108కు ఫోన్‌ చేశారు. అంబులెన్సు వచ్చేలోపే బిడ్డ ప్రాణాలు వదిలాడు.


ఐదో బిడ్డా దక్కలేదు... పాంగి సావిత్రి

ముందు నాలుగు కాన్పులూ గడుతూరులోనే జరిగాయి.  కారణం ఏమిటో తెలియదుగానీ నెల నుంచి మూడు నెలల్లోపే అందరూ చనిపోయారు. ఈసారి సెంటిమెంట్‌గా భావించి గర్భం దాల్చిన వెంటనే పుట్టింటికి వచ్చేశాను. రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో ప్రతి నెలా తనిఖీలకు వెళ్లాను. డిసెంబరు ఒకటిన 2.5 కిలోల బరువుతో మగ శిశువు పుట్టాడు. రెండు రోజుల నుంచి బిడ్డకు బాగుండకపోవడంతో గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల వైద్య నిపుణులకు చూపించాలని నర్సీపట్నం బయలుదేరాం. కానీ విధి చిన్నచూపు చూసింది. ఐదో బిడ్డనూ మాకు దూరం చేసింది.


వైద్య సిబ్బందిపై ఆగ్రహం

పసి బిడ్డను కోల్పోయిన పాంగి సావిత్రి నుంచి వివరాలు సేకరించేందుకు హెల్త్‌ విజిటర్‌ లక్ష్మి, ఏఎన్‌ఎం విజయకుమారి, హెల్త్‌ అసిస్టెంట్‌ మహేశ్‌ బుధవారం బాలరేవుల గ్రామానికి వెళ్లారు. వీరిని చూసి సావిత్రి, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రపాలెం పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే బిడ్డ చనిపోయాడని ఆరోపించారు.

Updated Date - 2022-01-20T05:58:07+05:30 IST