హత్య కేసులో ఐదుగురికి యావజ్జీవం

ABN , First Publish Date - 2021-10-19T05:50:16+05:30 IST

ఓ హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆళ్లగడ్డ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

హత్య కేసులో ఐదుగురికి యావజ్జీవం
యావజ్జీవ కారాగార శిక్ష పడిన ముద్దాయిలతో పోలీసులు

కోవెలకుంట్ల, అక్టోబరు 18: ఓ హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆళ్లగడ్డ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. రేవనూరు ఎస్‌ఐ మహ్మద్‌ రిజ్వాన్‌ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని భీమునిపాడు గ్రామానికి చెందిన బాలసుంకిరెడ్డి 2010లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో దుత్తల నరసింహారెడ్డి ప్రధాన నిందితుడు. ఈయన 2013 మే 10వ తేదీన హత్యకు గురయ్యారు. నంద్యాలలో పని ముగించుకుని మరో వ్యక్తితో కలిసి వస్తుండగా కలుగొట్ల, జోళదరాశి గ్రామాల మధ్యలో దుండగులు కాపుకాచి హత్య చేశారు. ఈ కేసులో బాలసుంకిరెడ్డి బంధువులు, వర్గీయులు ఆరికట్ల చిన్న సుంకిరెడ్డి, ఆరికట్ల సురేంద్రనాథ్‌ రెడ్డి, ముక్కమళ్ల సురే్‌ష రెడ్డి, పసుపల బాలస్వామి, బిచ్చగాళ్ల సుబ్బరాయుడును నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో సుంకిరెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి తండ్రీకొడుకులు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో సోమవారం ఆళ్లగడ్డ కోర్టు వీరందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. శిక్ష ఖరారైన వెంటనే ముద్దాయిల కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు. పోలీసులు ముద్దాయిలను కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

Updated Date - 2021-10-19T05:50:16+05:30 IST