మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల

ABN , First Publish Date - 2022-01-28T23:00:53+05:30 IST

భారత్‌లో కొత్తగా సాంస్కృతిక జాతీయవాదం వచ్చిందని,

మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల

న్యూఢిల్లీ : భారత్‌లో కొత్తగా సాంస్కృతిక జాతీయవాదం వచ్చిందని, మతపరమైన ఆధిక్యత ముసుగులో ఎన్నికల ఆధిక్యతను ప్రదర్శించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించిన మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ, శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. అదేవిధంగా బిహార్ మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ, ముస్లింలకు భారత దేశం కన్నా ఉత్తమ దేశం మరొకటేదీ లేదన్నారు. 


అన్సారీ ఏమన్నారంటే...

ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఏఎంసీ) బుధవారం నిర్వహించిన ఆన్‌లైన్ కార్యక్రమంలో హమీద్ అన్సారీ మాట్లాడుతూ, హిందూ జాతీయవాదం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి సంవత్సరాల్లో సువ్యవస్థీకృత ఉదార జాతీయవాద సిద్ధాంతాలను వివాదాస్పదం చేసే ధోరణులు, ఆచరణలు పుట్టుకురావడాన్ని గమనిస్తున్నామన్నారు. గుత్తాధిపత్య రాజకీయ అధికారం, మతపరమైన ఆధిపత్యం ముసుగులో ఎన్నికల ఆధిక్యతను ప్రదర్శించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రజలను వారి విశ్వాసాల ప్రాతిపదికపై వేరు చేయాలని సాంస్కృతిక జాతీయవాదం కోరుకుంటోందన్నారు. అసహనాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రత్యేకంగా ఉండటాన్ని వ్యంగ్యంగా దూషిస్తోందన్నారు. ఆందోళన, అభద్రతాభావాలను పెంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


భారత్ వ్యతిరేక సంస్థ...

ఐఏఎంసీ గతంలో రోహింగ్యాల సంక్షేమం కోసం భారీగా నిధులను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (USCIRF) ద్వారా భారత దేశాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించాలనే లక్ష్యంతో లాబీయింగ్ కోసం ఈ నిధులను ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థకు పాకిస్థాన్ పరోక్ష మద్దతు ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 


ఆందోళనకరం : నఖ్వీ

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ, పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు హమీద్ అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం, భారతీయులు, భారత దేశ జాతీయవాదం, ప్రజాస్వామ్యాలపై ప్రశ్నలను లేవనెత్తడం ఆందోళనకరమన్నారు. 


ముస్లింలకు భారత్‌ను మించిన దేశం లేదు : హుస్సేన్

బిహార్ పరిశ్రమల శాఖ మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ పాట్నాలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ముస్లింలకు భారత దేశం కన్నా మెరుగైన దేశం మరొకటేదీ లేదన్నారు. నరేంద్ర మోదీ కన్నా ఉత్తమ నాయకుడు కానీ, హిందువుల కన్నా ఉత్తములైన స్నేహితులు కానీ ముస్లింలకు వేరొకరు లేరని చెప్పారు. భారత దేశ వ్యతిరేక ప్రచారానికి పెట్టింది పేరుగా ఉన్న ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్సారీ అంగీకరించి ఉండవలసింది కాదన్నారు. 


మరోవైపు నెటిజన్లు కూడా అన్సారీపై మండిపడుతున్నారు. అజిత్ దత్తా అనే ట్విటరాటీ స్పందిస్తూ, భారత దేశ ఉపరాష్ట్రపతిగా వరుసగా రెండుసార్లు ఎంపిక చేయడం వెనుక కాంగ్రెస్‌కు ఎదురైన రాజకీయ నిర్బంధాలు ఏమిటని ప్రశ్నించారు. ఇతరులెవరూ లేకపోవడం వల్లే ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారా? ఒకరైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించారు. ఇలాంటివారికి ముఖ్యమైన రాజ్యాంగ పదవులను కట్టబెట్టడితే, వారు భారత దేశం పట్ల ఎంత శ్రద్ధ చూపగలరని నిలదీశారు. 


ఇష్కరణ్ సింగ్ భండారీ ఇచ్చిన ట్వీట్‌లో, హమీద్ అన్సారీ భారత దేశ వ్యతిరేక వేదికకు ఎలా వెళ్ళారు? భారత దేశం గురించి ఆయన ఏం మాట్లాడారు? అనేది ఇక్కడ ప్రశ్న కాదని, అలాంటి మనస్తత్వంగలవారు భారత దేశంలో అత్యున్నత స్థాయి పదవులకు ఏ విధంగా చేరగలిగారనేదే నిజమైన ప్రశ్న అని అన్నారు. 


Updated Date - 2022-01-28T23:00:53+05:30 IST