యాదాద్రికి విద్యుద్దీపాల ధగధగలు

ABN , First Publish Date - 2021-11-23T06:07:52+05:30 IST

అంతర్జాతీయ పర్యాటక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నా యి. సుమారు రూ.9కోట్ల వ్యయంతో యాదాద్రిక్షేత్రంలో విద్యుద్దీపాలను అమర్చే పనులు నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్నా యి.

యాదాద్రికి విద్యుద్దీపాల ధగధగలు
విద్యుత్‌ దీపాల వెలుగులో యాదాది ఆలయం, ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై దీపాలు

రూ.9కోట్లతో పనులు

ఆలయం చుట్టూ బటర్‌ఫ్లై దీపాలు

ప్రధానాలయంలో గంటాదీపాలు

తిరువీధుల్లో బంగారు వర్ణంలో విద్యుత్‌ స్తంభాలు


యాదాద్రి టౌన్‌: అంతర్జాతీయ పర్యాటక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నా యి. సుమారు రూ.9కోట్ల వ్యయంతో యాదాద్రిక్షేత్రంలో విద్యుద్దీపాలను అమర్చే పనులు నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్నా యి. బెంగుళూరుకు చెందిన లైటింగ్‌ టెక్నాలజీ సంస్థ, యాదాద్రి దేవస్థాన ఎలక్ట్రికల్‌ విభాగం ఈ పనులు నిర్వహిస్తోంది.


అంతర్జాతీయస్థాయిలో ఆలయం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో అదే స్థాయిలో విద్యుత్‌ దీపాలంకరణ ఉండాలని సీఎం కేసీఆర్‌ వైటీడీఏకు సూచించారు. దీంతో వైటీడీఏ పలు ప్రాంతాల్లో అధ్యయనంచేసి విద్యుత్‌ దీపాల అమరికకు ప్రణాళికలు రూపొందించింది. దాని ప్రకారం ప్రధానాలయం, ఆలయ అష్టభుజి ప్రాకారాలు, సప్తరాజగోపురాలకు విద్యుత్‌ దీపాలను అమర్చిన అధికారులు పలుమార్లు ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. స్వయంభువు కొలువుదీరిన ప్రధానాలయ ముఖమండపంతో పాటు ఆలయ ప్రాకారాలు, ప్రహరీపై వివిధ ఆకృతుల్లోని సుమారు 428 విద్యుద్దీపాలను అలంకరించారు. ప్రధానాలయ ముఖమండపంలో గంటాదీపాలు, ఆలయ ప్రాకార మండపాల్లో కమలం(తామర పువ్వు) ఆకారంలో దీపాలు, హరిహరుల ఆలయాల ప్రాకారాలపై శివకేశవుల సంప్రదాయాలను తెలిపే విద్యుద్దీపాలు అమరుస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ యాదాద్రిని సందర్శించిన నేపథ్యంలో విద్యుద్దీపాల అలంకరణను స్వయంగా పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయి.


 ప్రధానాలయంలో గంటాదీపాలు

స్వయంభువు కొలువుదీరిన ప్రధానాలయంలోని ముఖమండపంలో 12 మంది ఆళ్వారు విగ్రహాలకు, మరో నాలుగు విగ్రహాలకు గంట ఆకృతిలోని 16 దీపాలను అమర్చారు. ప్రధానాలయ ముఖమండపం మధ్యలో స్లాబ్‌కు శాండిలియర్‌ను అమర్చారు. గర్భగుడి ముఖద్వారంపై ప్రహ్లాద చరిత ప్యానళ్లు, గోడపై పంచనారసింహుల విగ్రహాలు, ఉత్తర దిశలో తంజావూరు పెయింటింగ్‌ల ప్రాంతంలో ప్రత్యేక దీపాలు ఏర్పాట్లు చేశారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో నాలుగు వైపులా సుమారు 125 కమలం ఆకారంలో దీపాలను అమర్చారు. ఆలయ ప్రహరీ, విష్ణుపుష్కరిణి, శివాలయం దర్శన క్యూకాంప్లెక్స్‌ తదితర ప్రాంతాలలో ఇత్తడి లోహంతో రూపొందించిన బటర్‌ఫ్లై విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధానాలయ ప్రహరీపై వైష్ణవత్వం ఉట్టిపడేలా శంఖు, చక్ర, తిరునామాలతో రూపొందించిన 183 విద్యుద్దీపాలు, శివాలయ ప్రహరీపై శైవ సంప్రదాయాన్ని తెలిపే విధంగా త్రిశూలం, విభూది ధారణలో శివుడి మూడో కన్ను, పద్మాల ఆకృతిలోని 20 దీపాలు ఏర్పాటుచేశారు. దర్శన క్యూకాంప్లెక్స్‌పై సుమారు 30, విష్ణు పుష్కరిణి ప్రహరీపై 16 బటర్‌ఫ్లై దీపాలు, కొండకు పడమటి దిశలోని ఈవో క్యాంపు కార్యాలయం తదితర ప్రాంతాల్లో సుమారు 68 బటర్‌ఫ్లై దీపాలు అమర్చే పనులు కొనసాగుతున్నాయి.


ఆధ్యాత్మిక హంగులతో దర్శన క్యూకాంప్లెక్స్‌

యాదాద్రి క్షేత్రంలో హరిహరుల దర్శనాల కు భక్తులు వెళ్లేందుకు ఈశాన్య దిశలో నాలుగు అంతస్థుల్లో దర్శన క్యూ కాంప్లెక్స్‌ను ఆధ్యాత్మిక హంగులతో నిర్మిస్తున్నారు. సుమారు రూ.5.5కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రతీ అంతస్థులో భక్తుల మౌలిక వసతులు కల్పిస్తున్నా రు.టాయిలెట్స్‌,తాగునీరు, సేదతీరేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐరన్‌ క్యూలైన్లు, భక్తులు సేదతీరేందుకు ఐరన్‌ బెంచీలు ఏర్పాటుచేస్తున్నారు. మొదటి అంతస్థులో 900 మంది, రెం డో అంతస్థులో 800 మంది, మూడో అంతస్థులో 700మంది భక్తులు పట్టేలా క్యూ లైన్లు నిర్మిస్తున్నారు. క్యూలైన్లు, నడక దారి, ఎస్కలేటర్‌ ద్వారా వచ్చే భక్తులు నాలుగో అంతస్థులో కలుసుకొని ఇష్టదైవం దర్శనాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ అంతస్థు నుంచి ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట నిర్మించిన లోహపు దర్శన క్యూలైన్ల గుం డా స్వయంభువు దర్శనాలకు భక్తులు వెళ్తారు. క్యూకాంప్లెక్స్‌కు రెండు వైపులా శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రాన్ని తెలిపే రూపాలను ఆర్‌సీసీ విధానంలో నిర్మిస్తున్నారు.


తిరువీధుల్లో బంగారు వర్ణంలో విద్యుత్‌ స్తంభాలు

యాదాద్రి ఆలయ తిరువీధుల్లో బంగారు వర్ణంలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుచేస్తున్నారు. సుమారు 1500 కిలోల బరువు తో 20 అడుగుల ఎత్తులో 10 విద్యుద్దీప స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని చెన్నైలోని కోయంబత్తురు కార్మాగారంలో లైటింగ్‌ టెక్నాలజీ సంస్థ రూపొందించి యాదాద్రికి తరలించింది. ఒక్కో విద్యుత్‌ స్తంభానికి సుమారు 6 నుంచి 10 వరకు లైట్లు వచ్చేలా రూపొందించారు. ప్రధానాలయ ఉత్తర దిశలో మూడు, మిగిలిన ఏడు విద్యుద్దీప స్తంభాలను ఆలయ తిరుమాఢ వీధుల్లో అమర్చనున్నట్టు వైటీడీఏ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-23T06:07:52+05:30 IST