పూల వ్యాపారానికి కరోనా స్ర్టోక్‌!

ABN , First Publish Date - 2021-05-19T06:18:05+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి ప్రజల జీవితాలను తారుమారు చేస్తోంది. పూల వ్యాపారుల బతుకును దయనీయంగా మార్చింది.

పూల వ్యాపారానికి కరోనా స్ర్టోక్‌!

 శుభకార్యాలు లేక పడిపోయిన వ్యాపారాలు 

 అనుబంధ వ్యాపారాలకు దెబ్బ 

 ఇల్లు గడవక అల్లాడుతున్న కూలీలు

పాయకాపురం, మే 18 : కొవిడ్‌ మహమ్మారి ప్రజల జీవితాలను తారుమారు చేస్తోంది. పూల వ్యాపారుల బతుకును దయనీయంగా మార్చింది. మార్కెట్‌ నుంచి తీసుకువచ్చిన పూలను కర్ఫ్యూ సమయంలోపు అమ్ముకోలేక, మిగిలిని వాటిని దాచే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు చేసుకోవటానికి వెసులుబాటు ఉంది. ఈ సమయంలోపు పూలు అమ్ముడుకాకపోతే మిగిలిన వాటిని నిల్వ చేసే పరిస్థితిలేక వ్యాపారులు నష్టాలపాలవుతున్నారు. 

శుభకార్యాల వాయిదాతో నష్టపోతున్న వ్యాపారులు

 గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా పలు శుభకార్యాలను నిర్వాహకులు విరమించుకున్నారు. దీంతో పూల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. గత నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకుందాం అనుకుంటుండగానే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించింది. దీనివల్ల ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. శుభకార్యాలూ వాయిదా పడ్డాయి. పూల వ్యాపారంపై ఆధారపడిన ఫ్లవర్‌ డెకరేషన్‌, లైటింగ్‌ వంటి చేతి పనుల వారు తీవ్రంగా నష్టపోయారు.  షాపుల అద్దెలు కూడా కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నగరంలో చాలామంది బుట్టల్లోనూ, తోపుడు బండ్లపైనా పూల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి పరిస్థితి దారుణంగా ఉంది. ఉపాధి కోల్పోయి నరకయాతన అనుభవిస్తున్నారు. వీరేకాక పూల వ్యాపారస్తుల దగ్గర పూల దండలు కడుతూ పని చేస్తున్న వారిదీ ఇదే దుస్థితి. 

  జీవనం ఇబ్బందిగా ఉంది

 గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు లేక పెండింగ్‌ పడిన అద్దెలు చెల్లించాలని అనుకునేలోపే, మళ్లీ కరోనా విజృంభించింది. మార్కెట్‌ నుంచి కొద్దిగా పువ్వులు కొనుగోలు చేసి తెచ్చుకున్నా, గుడులకు వెళ్లే భక్తులు లేక పువ్వులు కొనేవారు లేక వ్యాపారాలు తగ్గిపోయాయి. శుభకార్యాలు కూడా లేవు. పువ్వులతో పాటు అరటిపళ్లు, తమలపాకులు, నిమ్మకాయుల కూడా మిగిలిపోతున్నాయి. ఉపాధి లేక బతకడం కష్టంగా ఉంది.

- జ్యోతి, పూల వ్యాపారి, ప్రకా్‌షనగర్‌



Updated Date - 2021-05-19T06:18:05+05:30 IST