వాట్సాప్‌ ‘ప్రైవసీ’పై కేంద్రం నజర్‌

ABN , First Publish Date - 2021-01-16T08:20:49+05:30 IST

దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇటీవల తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పలు వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులు..

వాట్సాప్‌ ‘ప్రైవసీ’పై కేంద్రం నజర్‌

క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న ఐటీ శాఖ

ప్రభుత్వం లేవనెత్తే ప్రశ్నలకు సమాధానమిస్తాం

వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌ విల్‌ కాథ్‌కార్ట్‌ వెల్లడి

వాట్సా్‌పపై ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం


న్యూఢిల్లీ, జనవరి 15: దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇటీవల తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పలు వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులు.. యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటారనే ఆరోపణలపై కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకు వాట్సా్‌పను ఎలాంటి వివరణ అడగకున్నా.. త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. గత వారం వాట్సాప్‌ తన కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దాన్ని ఆమోదించని యూజర్లు ఫిబ్రవరి 8 నుంచి తమ మెసేజింగ్‌ యాప్‌ను వినియోగించలేరని పేర్కొంది. దీంతో.. యూజర్లు ఏం జరుగుతుందో తెలియక.. తమ డేటాను ఫేస్‌బుక్‌ వాడుకోనుందనే ఆందోళనతో ప్రత్యామ్నాయ యాప్‌లైన సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వైపు మళ్లుతున్నారు.


ఈ నెల 5-12 మధ్యకాలంలో సిగ్నల్‌ను 1.78 కోట్ల మంది, టెలిగ్రామ్‌ను 1.57 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అదే సమయంలో అంతకు ముందు వారంతో పోలిస్తే.. వాట్సాప్‌ డౌన్‌లోడ్ల సంఖ్య 1.27 కోట్ల నుంచి 1.06 కోట్లకు పడిపోయింది. కాగా.. కొత్త ప్రైవసీ పాలసీపై భారత ప్రభుత్వం లేవనెత్తే ప్రశ్నాలకు సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌ విల్‌ కాథ్‌కార్ట్‌ తెలిపారు. యూజర్ల వ్యక్తిగత వివరాల భద్రత కోసమే తాము కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చామని ఆయన వివరించారు. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ వల్ల భారతీయుల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతోందని, దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ.. న్యాయవాది చైతన్య రోహిల్లా ఢిల్లీ హైకోర్టులో గురువారం ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.


శుక్రవారం ఆ వ్యాజ్యం జస్టిస్‌ ప్రతిభాసింగ్‌ ఏకసభ్య ధర్మాసనానికి వెళ్లగా.. ఆమె విచారణకు నిరాకరించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించొద్దంటూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తరఫున తనకు మెయిల్‌ పంపడమేంటని ఆ సంస్థల తరఫున హాజరైన కపిల్‌ సిబ్బాల్‌, ముకుంద్‌ రోహత్గీని ఆమె నిలదీశారు. దీంతో వారు బేషరతుగా ఆ మెయిల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అయినా తానీ కేసును విచారించబోనని పేర్కొన్న ప్రతిభాసింగ్‌.. మరో బెంచ్‌కు అప్పగించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

Updated Date - 2021-01-16T08:20:49+05:30 IST