Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 1 2021 @ 02:57AM

ఆహార మంత్రి ఆదేశంతోనే హామీ

 రైతులకు భరోసా ఇచ్చేందుకే ఆ ప్రకటన

 ఈ విషయమై కేసీఆర్‌తో చర్చకు సిద్ధం

అభద్రతాభావంతోనే సీఎం తిట్ల పురాణం

 యాసంగిలో వరి పండించుకోవచ్చు 

పరిశోధనలు, విత్తన మార్పిడికి

సహకరిస్తాం: కిషన్‌ రెడ్డి 


న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో వానాకాలంలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార శాఖ మంత్రి ఆదేశంతోనే ప్రకటన చేశాను. కళ్లాలు, రోడ్లు, కొనుగోలు కేంద్రాల్లో రెండు నెలలుగా ధాన్యం పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతులకు భరోసా ఇవ్వాలన్న ఆయన సూచన మేరకే ఆ విధంగా చెప్పాను’ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. యాసంగి సంగతి తర్వా త చూద్దాం కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులను గందరగోళంలో పడేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రితో మాట్లాడిన అనంతరమే చివరి బస్తా వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించానని, అంతేతప్ప కేసీఆర్‌ను విమర్శించడం కోసమో, తిట్టడం కోసమో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని, అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో బూతులు మాట్లాడకుండా ఉంటానంటే సీఎం కేసీఆర్‌తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని  చెప్పారు. ఆకాశం ఊడిపడినట్లు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోయినట్లు సీఎం కేసీఆర్‌ మాట్లాడారని, గంటకుపైగా తిట్ల పురా ణం అందుకున్నారన్నారు. కేసీఆర్‌ అభద్రతాభావంతో ఉన్నందునే అలా మాట్లాడారని విమర్శించారు.రైతులను భయపెట్టడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం సరికాదన్నారు. యాసంగిలో వరి వేయమంటారా? వద్దా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘యాసంగిలో వరి వేయవచ్చు. ప్రత్యామ్నాయ విత్తనాలు ఉన్నాయని రైతు నేతలు, మిల్లర్లు, ఇతరులు అంటున్నారు. వేడి మన రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లోనూ ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సిన విత్తనం వేయాలి. ఆంఽధ్రాలో కూడా విత్తనాన్ని మార్చుకున్నారు. రైతులను చైతన్యం చేసే కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొంటారు’ అని సమాధానమిచ్చారు. పరిశోధనలకు, విత్తన మార్పిడికి కేంద్రం సహకరిస్తుందన్నారు. రైస్‌ మిల్లులు కూడా సాంకేతికతను మార్చుకోవాలని సూచించారు. తాను కేంద్ర మంత్రి అయిన రెండున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. అనేకసార్లు ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాలేదన్నారు. తెలంగాణ బిడ్డ కేంద్రంగా మంత్రి ఉన్నాడు, సహకారం తీసుకుందామని రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ ప్రయత్నం చేయలేదని, సీఎం, సీఎస్‌ చిన్నచూపే చూశారన్నారు. అయినా తన వంతు ప్రయత్నంగా తెలంగాణ అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నానని పేర్కొన్నారు.తనను రండా అని సంబోధించినా తనకు బాధ లేదని, ఎవరు ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తాను ఎవరి పట్లా అసభ్య పదజాలాన్ని ఉపయోగించనని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశానని, గతంలో సీపీఎం ఎమ్మెల్యేతోనూ కలిసి పోరాటం చేశానని, అటువంటి తనను పిరికిపంద అన్నారని కానీ, తెలంగాణ గడ్డపై పుట్టిపెరిగిన తాను తిట్లకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించారు. దీన్ని సీఎం కేసీఆర్‌ నైతికతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు.  


40 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నా 

‘నేను కేంద్ర మంత్రి కావడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం ఉందో, లేదో?. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను. 40 ఏళ్లుగా నమ్మిన పార్టీ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాను. 1980 నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. తెలంగాణ ఉద్యమంలో 26 రోజుల పాటు పోరాట యాత్ర చేపట్టి 300పైగా సమావేశాల్లో పాల్గొన్నాను. ఢిల్లీలో రెండుసార్లు ధర్నా చేశాను. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో అన్న సందిగ్ధంలో అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసం ఏపీ భవన్‌లో నిరవధిక ఉపవాస దీక్ష చేపట్టాను. అప్పటి జేఏసీ చైర్మన్‌ కోదండరాం, కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా వచ్చి బిల్లు ఆమోదం పొందిన తర్వాత దీక్షను విరమింపజేశారు’ అని కిషన్‌రెడ్డి వివరించారు. 

Advertisement
Advertisement