కరోనా వ్యాక్సినేషన్‌కు.. 26% మందే సిద్ధం

ABN , First Publish Date - 2021-01-07T07:44:59+05:30 IST

భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేయనున్న ఆక్స్‌ఫర్డ్‌ (కొవిషీల్డ్‌) టీకాల వాడకానికి ఇప్పటికే అనుమతులు మంజూరయ్యాయి.

కరోనా వ్యాక్సినేషన్‌కు.. 26% మందే సిద్ధం

  • ఊగిసలాడుతున్న 69%  భారతీయులు 
  • పిల్లలకు టీకా వేయించేందుకు 26% మంది తల్లిదండ్రులే సానుకూలం
  • ‘లోకల్‌ సర్కిల్స్‌’ తాజా సర్వేలో వెల్లడి
  • 55%  మంది ఆరోగ్య కార్యకర్తలదీ ఇదే బాట

 

న్యూఢిల్లీ, జనవరి 6 : భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేయనున్న ఆక్స్‌ఫర్డ్‌ (కొవిషీల్డ్‌) టీకాల వాడకానికి ఇప్పటికే అనుమతులు మంజూరయ్యాయి. మరో వారం రోజుల్లోగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ కీలక తరుణంలో ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రజల మనోగతాన్ని అద్దం పట్టే సర్వే ఫలితాలను విడుదల చేసింది.


2020 అక్టోబరు నుంచి డిసెంబరు నెలాఖరు వరకు (మూడు నెలలపాటు) సేకరించిన 8,723 మంది అభిప్రాయాల విశ్లేషణ ఆధారంగా సర్వే నివేదికను రూపొందించినట్లు లోకల్‌ సర్కిల్స్‌ వెల్లడించింది. నివేదికలోని పలు వివరాలివీ.. ‘వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే వేయించుకోవడానికి మీరు సిద్ధమా ?’ అని సర్వేలో అడిగిన ఓ ప్రశ్నకు కేవలం 26ు మందే అంగీకరించారు. మరో 5ు మంది తాము ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లుగా సేవలందిస్తున్నారని..ప్రభుత్వమే తమకు టీకా అందిస్తుందని తెలిపారు. ఈలెక్కన టీకా వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్న వారే ఎక్కువ సంఖ్యలో ఉంటారని వెల్లడైంది.


అక్టోబరులో జరిగిన సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకునే విషయమై సంశయాన్ని వ్యక్తపరచగా.. నవంబరులో ఆ సంఖ్య స్వల్పంగా తగ్గి 59 శాతానికి చేరింది. ఇక డిసెంబరులో ప్రత్యేకించి ఆరోగ్య కార్యకర్తలను సర్వే చేయగా, వారిలోనూ సింహభాగం మంది (55 శాతం) వెంటనే టీకా వేయించుకునే విషయమై డోలాయమాన స్థితిలో ఉన్నట్లు తేల్చిచెప్పారు. ఇందుకు కారణమేమిటి ? అని వారిని ప్రశ్నించగా.. దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న భయం పట్టుకుందని, వ్యాక్సిన్ల ప్రభావశీలతపై పూర్తి స్పష్టత లేనప్పుడు టీకా వేసుకోవడంపై తొందరపాటుతో నిర్ణయం తీసుకోలేమని ఆరోగ్య కార్యకర్తలు స్పష్టం చేశారు.


వీరిలో సగం మందికిపైగా (60 శాతం మంది) తాము ప్రత్యేక కొవిడ్‌ వార్డుల్లో సేవలందిస్తున్నట్లు తెలిపారు. కాగా, అమెరికాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరలోనే మరింత వేగవంతమవుతుందని, ప్రతిరోజు సగటున 10లక్షల డోసులు అందించే పరిస్థితి వస్తుందని ప్రముఖ సాంక్రమిక వ్యాధి నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆశాభావం వ్యక్తంచేశారు. 



మోడెర్నా టీకాకు ఈయూ ఆమోదం

ఇప్పటికే ఫైజర్‌ టీకాకు ఆమోదం తెలిపిన యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ).. తాజాగా బుధవారం మోడెర్నా వ్యాక్సిన్‌కు కూడా పచ్చజెండా ఊపింది. దీంతో ఈయూలోని 27 దేశాలకు రెండో కరోనా టీకా సైతం అందుబాటులోకి రానుంది.  ఈయూలోని చాలాదేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన రెండు వారాల తర్వాత.. చివరగా నెదర్లాండ్స్‌ దేశం టీకాలు వేసే కార్యక్రమాన్ని బుధవారం మొదలుపెట్టింది. తొలి విడతగా నర్సింగ్‌ హోం సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. దేశ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కు సమీపంలోని వెఘెల్‌ పట్టణానికి చెందిన నర్సు సన్నా ఎల్కడిరికి తొలి డోసును అందించారు.


మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇంతకుముందు నిర్ణయించిన తేదీ కంటే రెండువారాలు ముందుకు జరిపింది. మార్చి మొదటివారం నుంచే టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్‌ హంట్‌ వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా 2.5 కోట్ల మంది దేశ ప్రజలకు టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఫైజర్‌ టీకాతో వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని, మార్చి నెలాఖరు నుంచి ఆక్స్‌ఫర్డ్‌ టీకాను కూడా వినియోగంలోకి తెస్తామని చెప్పారు.




పాఠశాలల ప్రారంభంపై ఏమన్నారంటే


డిసెంబరు-జనవరి మధ్య కాలంలో.. కరోనా వ్యాక్సిన్లకు అనుమతులిచ్చే దిశగా, వ్యాక్సినేషన్‌ కార్యక్రమ ఏర్పాట్ల దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలైనప్పటికీ సర్వే ఫలితాల్లో పెద్దగా మార్పు రాలేదు. టీకా విడుదల కాగానే, వేయించుకునేందుకు ఆసక్తి కనబరిచే వారి సంఖ్య పెరగలేదు. ఇప్పటికీ 69 శాతంగానే ఉంది. దేశంలో క్రియాశీల కేసుల సం ఖ్య రోజురోజుకు తగ్గుతుండటంతో కొం దరు ఇక టీకా అవసరం లేదనే అభిప్రాయానికి వస్తున్నట్లు పేర్కొంది.


2021 ఏప్రిల్‌ నాటికి కరోనా వ్యాక్సిన్‌ను పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తే.. మీ పిల్లలకు వేయిస్తారా? అని తల్లిదండ్రులను ప్రశ్నించగా.. ‘లోకల్‌ సర్కిల్స్‌’ ప్లాట్‌ఫామ్‌లోని 10,468 మంది స్పందించారు. ‘టీకా వేయిస్తాం’ అని 26ు మంది తల్లిదండ్రులే బదులిచ్చారు. మరో 12ు మంది పేరెంట్స్‌ ‘టీకా వేయించం’ అన్నారు. 69ు మంది తల్లిదండ్రులు.. 2021 ఏప్రిల్‌ నాటికైనా పాఠశాలలు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్లతోనూ భారత్‌లో ప్రయోగ పరీక్షలు జరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని 61ు మంది ప్రజలు పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-07T07:44:59+05:30 IST