మధుమేహాన్ని ముందుచూపుతో...
ABN , First Publish Date - 2020-09-22T18:38:09+05:30 IST
రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా, మధుమేహ నిర్థారణకు తక్కువగా ఉన్న స్థితిని ప్రి డయాబెటిక్‌గా భావించాలి. ఈ స్థితిని నిర్లక్ష్యం చేస్తే,
ఆంధ్రజ్యోతి(22-09-2020)
రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా, మధుమేహ నిర్థారణకు తక్కువగా ఉన్న స్థితిని ప్రి డయాబెటిక్‌గా భావించాలి. ఈ స్థితిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో టైప్2 డయాబెటిస్‌కు దారి తీయవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచిస్తున్న మార్గదర్శకాలు ఇవే!
ఆహారం బరువును బట్టి: అధిక బరువు ఉన్నవాళ్లు తక్కువ కేలరీలు పొందే వీలున్న ఆహారం తీసుకోవాలి. శరీరం శక్తిని ఖర్చు చేసే తీరు ఆధారంగా, ఇతరత్రా ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని మాక్రోన్యూట్రియంట్లు సరిపడా అందే ఆహారాన్ని ఎంచుకోవాలి.
ఆహారం ఇలా: పీచు, విటమిన్లు, ఖనిజలవణాలతో పాటు, చక్కెర, సోడియం, కొవ్వులు తక్కువగా ఉండే పిండిపదార్థాలతో కూడిన ఆహారం ఎంచుకోవాలి. పిండిపదార్థాలు తగ్గించడం మూలంగా గ్లైసెమిక్ ఇండెక్స్ అదుపులో ఉంటుంది. పిండిపదార్థాలు, కేలరీల పరిమాణం పెరిగిపోకుండా చక్కెరతో కూడిన పదార్థాలు అరుదుగా తీసుకోవాలి.
చేపలు, మాంసం: చేపలు, లేత మాంసం, పప్పులు, బీన్స్, నట్స్ ఎక్కువగా, రెడ్ మీట్ తక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో పాల పదార్థాలు రెండు సార్లకు మించి తీసుకోకూడదు. ప్రి డయాబెటిక్స్ వృక్షాధార మాంసకృత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శరీర బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు.
కొవ్వులు: శరీరానికి అందే మొత్తం కేలరీల్లో కొవ్వులు 30శాతం, శాచురేటెడ్ ఫ్యాట్ 10శాతం ఉండేలా జాగ్రత్తపడాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన నూనెలను పరిమితంగా వాడుకోవాలి. నూనెలో ముంచి వేయించే పద్ధతులకు బదులు గ్రిల్, బేక్ లాంటి వంట ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి.
స్నాక్స్: అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా గుప్పెడు బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తాలు ఎంచుకోవాలి.
పీచు ఎక్కువ: ఆహారంలో ఎక్కువ పీచు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతి వెయ్యి కిలో కేలరీల్లో కనీసం 20 గ్రాముల పీచు ఉండేలా పదార్థాలను (పప్పుధాన్యాలు, బీన్స్, పళ్లు) ఎంచుకోవాలి.
ఉప్పు: ఉప్పు రోజుకు 2,300 మిల్లీగ్రాములు (ఒక టీస్పూను) మించకూడదు.
చక్కెర: తీపి పానీయాలకు బదులుగా నిమ్మరసం, మజ్జిగ, జల్జీరా, తాజా నీళ్లు తాగాలి.