విజయం కోసం..!

ABN , First Publish Date - 2021-10-08T05:19:52+05:30 IST

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం జిల్లాపై దృష్టి సారించింది. ఇప్పటికే అధికార పార్టీ ఆగడాలను, అక్రమాలను పలువురు టీడీపీ నాయకులు ప్రజల్లోకి తీసికెళుతున్నారు.

విజయం కోసం..!

  1. టీడీపీ జిల్లా నాయకుల పని తీరుపై ఆరా 
  2. ఇల్లు కదలని నాయకుల వివరాల సేకరణ 
  3. కొన్ని నియోజకవర్గాల్లో మార్పు కోసం కసరత్తు
  4. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అధినాయకత్వం చర్యలు 


కర్నూలు, ఆంధ్రజ్యోతి: రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం జిల్లాపై దృష్టి సారించింది. ఇప్పటికే అధికార పార్టీ ఆగడాలను, అక్రమాలను పలువురు టీడీపీ నాయకులు ప్రజల్లోకి తీసికెళుతున్నారు. భూముల అన్యాక్రాంతం, అక్రమ మద్యం రవాణా, ఇసుక దోపిడీ వంటి వాటికి వైసీపీ నాయకులు పాల్పడడాన్ని ఎండగడుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నా ఎదురొడ్డి పోరాడుతున్నారు. దేనికైనా రెడీ అంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లోనే ఈ పరిస్థితి ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధినేత ఆదేశించినప్పుడో, జిల్లాకు వచ్చినప్పుడో తప్ప ప్రజల్లోకి కూడా వెళ్లడం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇల్లు దాటని నాయకుల పనితీరుపై పార్టీ రాష్ట్ర కార్యాలయం దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏడెనిమిది నియోజకవర్గాల్లో మార్పు చేస్తే విజయం తథ్యమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయి బంధుత్వాలు, వ్యక్తిగత వ్యవహారాలకు తలొగ్గి పార్టీని ఫణంగా పెడుతున్న నాయకుల నియోజకవర్గాల్లో మార్పు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


కేడర్‌లో అభద్రతా భావం


రాయలసీమ దత్తపుత్రుడినని ప్రకటించుకున్న ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన టీడీపీని ప్రజలు ఆదరించారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వంటి ప్రాజెక్టులు ముందుకెళ్లాయి. దీనితో పాటు పలు ప్రజోపయోగ పథకాలు చేపట్టారు. ఆనాటి నుంచి నేటికీ కార్యకర్తలే టీడీపీకి వెన్నెముకగా నిలిచారు. అలాంటి కార్యకర్తలు నేడు అభద్రతా భావంలో మునిగిపోయారు. 2019లో టీడీపీ అధికారం చేజారాక కొందరు నాయకుల వ్యవహారం కార్యకర్తలను ఆందోళన కలిగిస్తోంది. అధికార పార్టీ ద్వితీయ, దిగువ శ్రేణి నాయకుల ఆగడాలను కూడా నిలువరించలేని స్థితిలో కొందరు నాయకుల టీడీపీలో ఉండటం ఆ పార్టీ కేడర్‌కు మింగుడు పడటంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడర్‌ను బెదిరించి, భయాందోళనలకు గురి చేసినా పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నపుడు ఒకలా, లేనపుడు మరోలా ఉంటూ నాయకులు కాడి పడేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కుని ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ సమయంలో అండగా ఉండాల్సిన నాయకులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. 


పోరాడుతోంది కొందరే..


అధికార పార్టీ నియంతృత్వ పోకడను ఎండగడుతూ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి పోరాడుతున్నారు. కార్యకర్తల కోసం శ్రమిస్తున్నారు. ఆయనపై కేసులు పెట్టించి రిమాండ్‌కు తరలించినా తలొగ్గలేదు. జడ్పీ చైర్మన్‌ మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డిపై నమోదైన కేసులను బహిర్గతం చేశారు. అధికార పార్టీ ఆగడాలను ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ, నిత్యం కార్యకర్తల్లో మెలుగుతూ, ప్రజలలో మమేకమవుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో కోట్ల సుజాతమ్మ అధికార పార్టీ ఆగడాలపై పోరాడుతూనే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే అండతో ద్వితీయ శ్రేణి నాయకుల అరాచకాలను ఎదుర్కొంటున్నారు. పేకాట నిర్వహణ, భూ కబ్జా వంటి వ్యవహారాల్లో స్థానిక ఎమ్మెల్యే పాత్రను బయట పెట్టడంలో నియోజకవర్గంలో టీడీపీ చాకచక్యంగా వ్యవహరించిందనే పేరుంది. పాణ్యం నియోజకవర్గం నుంచి కూడా గౌరు చరిత ఎప్పటికపుడు సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. మరికొందరు నాయకులు అడపాదడపా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


ఎనిమిది నియోజకవర్గాల్లో మార్పులు?


జిల్లాలోని ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేయాలని టీడీపీ అధినాయకత్వం చూస్తోంది. కర్నూలు లోక్‌సభ స్థానంలోని నాలుగు నియోజకవర్గాల్లో మార్పునకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నంద్యాల లోక్‌సభ స్థానంలోని నాలుగు నియోజకవర్గాల్లో మార్పులు జరగొచ్చని సమాచారం. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పేరున్న నాయకులు కూడా అధికారం లేని సమయంలో అంటీముట్టనట్టు వ్యవహరించడాన్ని పార్టీ నాయకత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. అవకాశం వస్తే పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న నాయకుల గురించి కూడా అధి నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్టీలోనే ఉంటూ అవకాశాల కోసం అధికార పార్టీ తలుపులు తడుతున్న నాయకుల స్థానం కొత్తవారితో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేడర్‌పై నోరుజారుతున్న, అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటున్న నాయకులకు చుక్కెదురు ఖాయమని తెలుస్తోంది. స్థానిక సమస్యలపై వామపక్షాలు చూపిన చొరవ కూడా చూపలేకపోతున్న కొందరు నాయకుల తీరు అధి నాయకుల దృష్టికి వెళ్లింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే మార్పులు చేయాల్సిందేనన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవలే పలు నియోజకవర్గాల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. టీడీపీకి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా నీరసంగా వ్యవహరిస్తున్న వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేలపైనా గురిపెడుతున్నట్లుగా సమాచారం. 

Updated Date - 2021-10-08T05:19:52+05:30 IST