అఫ్ఘాన్‌ కోసం..!

ABN , First Publish Date - 2021-11-12T06:11:00+05:30 IST

అఫ్ఘానిస్థాన్ మీద విడుదలైన ‘ఢిల్లీ డిక్లరేషన్’ను తాలిబాన్ స్వాగతించింది. భద్రతాసలహాదారు దోవల్ ఆధ్వర్యంలో ఎనిమిదిదేశాలు పాల్గొన్న ఈ సదస్సు మూడు కీలకమైన అంశాలపై తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే....

అఫ్ఘాన్‌ కోసం..!

అఫ్ఘానిస్థాన్ మీద విడుదలైన ‘ఢిల్లీ డిక్లరేషన్’ను తాలిబాన్ స్వాగతించింది. భద్రతాసలహాదారు దోవల్ ఆధ్వర్యంలో ఎనిమిదిదేశాలు పాల్గొన్న ఈ సదస్సు మూడు కీలకమైన అంశాలపై తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. భారత్, రష్యా, ఇరాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్కెమినిస్థాన్, కజగిస్తాన్, కిర్గిస్థాన్‌లు పాల్గొన్న ఈ ప్రాంతీయ భద్రతాసదస్సును తాము సానుకూల పరిణామంగా చూస్తున్నామనీ, అఫ్ఘానిస్థాన్ శాంతియుతంగా ఉండటానికి దీనిని మరోముందడుగుగా భావిస్తున్నామని తాలిబాన్ వ్యాఖ్యానించింది. భద్రతా సలహాదారులంతా కలసి చేసిన తీర్మానాలన్నింటితో తనకు ఆమోదం ఉన్నదని అంటోంది.


ఈ సదస్సుకు చైనా, పాకిస్థాన్ గైర్హాజరు ఊహించిందే. ఏవో మర్యాదమాటలతో కాకుండా ఒక విధ్వంసకారుడు, శాంతిస్థాపకుడు కాలేడు అంటూ పాకిస్థాన్ భద్రతాసలహాదారు ఈ ఆహ్వానాన్ని తిప్పికొట్టారు. అఫ్ఘాన్ వ్యవహారాల్లోనూ, దాని భవిష్య నిర్మాణంలోనూ భారత్ ప్రమేయాన్ని పాకిస్థాన్ ఎంతమాత్రం సహించదు కనుక ఈ గైర్హాజరు సహజమే. ఏదో విమర్శించాలి కదా అని భారత్ పాకిస్థాన్ పైన కొన్ని వ్యాఖ్యలు చేసింది కానీ, దానితోపాటు చైనా కూడా రాదని ఊహించిందే. ఇక ఈ ఢిల్లీ ప్రకటనలో కూడా అనూహ్యమైన అంశాలేమీ లేవు. భారత్ అధ్యక్షతన మొన్న ఆగస్టులో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చేసిన తీర్మానంలో ప్రస్తావించిన అంశాల పునరుద్ఘాటనగా దీనిని అనుకోవచ్చు. ఉగ్రవాదాన్ని ఖండించడం, ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, వ్యూహాలు, ప్రణాళికలు ఇత్యాది చర్యలకు అఫ్ఘాన్ భూభాగాన్ని వాడకపోవడం వంటివి ఇందులో ప్రధానం. మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను పరిరక్షించడం, కష్టంలో ఉన్న ఆ దేశానికి సాయం చేయడం వంటి అంశాలూ ఉన్నాయి. ఢిల్లీ డిక్లరేషన్‌పై స్పందించిన సందర్భంలోనూ తాలిబాన్ ప్రతినిధి తమ దేశంలో పరిస్థితులు సజావుగా ఉన్నట్టుగానే మాట్లాడారు కానీ, క్షేత్రస్థాయి వాతావరణం పూర్తిభిన్నంగా ఉన్నది. ఢిల్లీ డిక్లరేషన్ నిజానికి ఆ దేశ వాస్తవిక స్థితికి అద్దంపడుతోంది. ఎవరి హక్కులకూ అక్కడ దిక్కులేని రీతిలో పాలన జరుగుతున్నది. గతకాలం నాటి స్థాయిలో కాకున్నా, ఊచకోతలూ, కఠిన శిక్షలూ, మరణదండనలూ అమలు జరుగుతూనే ఉన్నాయి. పాలనలో అనేక తెగలకు భాగస్వామ్యం లేకపోయింది. మిగతా ప్రపంచం కోరుతున్న సమ్మిళిత అభివృద్ధి వంటి మాటలు అక్కడ నీటిమూటలే. సదస్సులో పాకిస్థాన్, చైనాలు లేనందువల్ల చాలా అంశాలకూ, పదాలకు ఈ ప్రకటనలో స్థానం దక్కిందనీ, భద్రతామండలి తీర్మానంలో లేని మాదకద్రవ్యాల అక్రమరవాణా వంటివి ఇందులో చేర్చగలిగారని అంటారు. రెండున్నర కోట్లమంది ఆకలితో అల్లాడుతున్న అఫ్ఘానిస్థాన్‌ను అందరం కలసి ఆదుకుందామన్న సంకల్పం అత్యంత అవశ్యకమైనది. అమెరికా హఠాత్తుగా వదిలేసిపోయిన అఫ్ఘానిస్థాన్లో ఆకలినుంచి ఆయుధాలవరకూ దేనిని పట్టనట్టు వదిలేసినా అది ఆసియా మొత్తానికే ప్రమాదకరం. అఫ్ఘానిస్థాన్‌లో భారతదేశం తన పాత్రని వదులుకోలేదని ఈ ప్రాంతీయ భద్రతా సదస్సు ద్వారా ప్రపంచానికి తెలియచెప్పడానికి వీలుకలిగింది. అఫ్ఘానిస్థాన్ విషయంలో భారతదేశాన్ని అమెరికా దాదాపుగా పక్కనపెట్టేసింది. ఆ తరువాత రష్యా నేతృత్వంలో ఖతార్‌లో జరిగిన సమావేశంలో కూడా అమెరికా, చైనా, పాకిస్థాన్‌లే చక్రం తిప్పాయి. అఫ్ఘాన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఉన్నంతకాలం పునర్నిర్మాణం కోసం వేలకోట్లు వెచ్చించిన భారతదేశం చివరకు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించే కాలంలో కరివేపాకులాగా మిగిలిపోవాల్సి రావడం విచారకరం. తాలిబాన్‌తో అన్ని లెక్కలూ సరిచూసుకొని అమెరికా హఠాత్తుగా నిష్క్రమించిన తరువాత, పాకిస్థాన్, చైనా కలసికట్టుగా చక్రం తిప్పడం ఆరంభించాయి. తాలిబాన్‌తో ఆదిలోనే భారత్ సయోధ్యకు ప్రయత్నించివుంటే బాగుండేదనీ, దాని పునరాగమనాన్ని ముందే పసిగట్టలేకపోయిందని ఓ విమర్శ ఉన్నది. ఎంత  ప్రయత్నించినా తాలిబాన్ మనసులో పాకిస్థాన్‌కు ఉన్న ప్రాధాన్యం భారత్‌కు దక్కదన్నది వాస్తవం. 


అఫ్ఘానిస్థాన్ విషయంలో తాను పక్కకు జరిగిపోయేది లేదని ఈ సదస్సు ద్వారా నిరూపించాలన్న భారత్ ప్రయత్నం ఏమేరకు విజయవంతమవుతుందో చూడాలి.

Updated Date - 2021-11-12T06:11:00+05:30 IST