ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో.. ముగ్గురిపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-24T17:38:43+05:30 IST

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎ్‌ఫ)కు సంబంధించి ఫేక్‌ చెక్కుల గుట్టు రట్టు అయిన..

ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో.. ముగ్గురిపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసులు నమోదు

ప్రొద్దుటూరు(కడప): సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎ్‌ఫ)కు సంబంధించి ఫేక్‌ చెక్కుల గుట్టు రట్టు అయిన ఘటనలో ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ముగ్గురిపై బుధవారం ఫోర్జరీ, చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా.. ప్రొద్దుటూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఎస్‌బీఐ టౌన్‌ బ్యాంకు మేనేజర్‌ ఉపేంద్రకుమార్‌ ఫిర్యాదు మేరకు ఎర్రగుంట్ల మండలం మాలేపాడుకు చెందిన వారాది వినయ్‌కుమార్‌పై ఫోర్జరీ, చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. వినయక్‌కుమార్‌ ఈ ఏడాది జూలై 7న రూ.3.60 లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును బ్యాంక్‌లోని తన అకౌంట్‌ ద్వారా డ్రా చేసుకున్నాడు. బ్యాంకు అడిటింగ్‌లో ఆది ఫేక్‌ చెక్కుగా అధికారులు గుర్తించారు. అసలు చెక్కు ఈ ఏడాది మార్చి 5న సీఎంఆర్‌ఎఫ్‌ కింద తోట వరలక్ష్మి భర్త నారాయణరెడ్డి పేరిట రూ.8వేలు మంజూరు అయిందని, నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.


మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో..

స్థానిక సూపర్‌బజార్‌ రోడ్డులోని ఎస్‌బీఐ ఏడీబీ మేనేజర్‌ ఎం.మోహన్‌రాజు ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు మండలం కల్లూరుకు చెందిన మద్దిగారి శ్రీకాంత్‌పై ఫోర్జరీ, చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు మూడవ పట్టణ సీఐ గంటా సుబ్బారావు తెలిపారు. శ్రీకాంత్‌ ఈ ఏడాది జూన్‌ 16న తన ఖాతా ద్వారా సీఎంఆర్‌ఎఫ్‌ పేరిట రూ.3.40 లక్షల చెక్కును డ్రా చేసుకున్నాడు. అడిటింగ్‌లో దీనిని ఫేక్‌ చెక్కుగా అధికారులు గుర్తించారు. అసలు చెక్కు మొత్తం రూ.12వేలుగా, మనీ్‌షరెడ్డి పేరిట సీఎం రీలిఫ్‌ పండ్‌గా మంజూరు అయినట్లు తెలుసుకున్నారు.


రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో..

స్థానిక ఎస్‌బీఐ శివాలయం బ్రాంచి మేనేజర్‌ ఎన్‌.వెంకటప్రసాద్‌ ఫిర్యాదు మేరకు వైఎంఆర్‌ కాలనీకి చెందిన మహమ్మద్‌ రెహమాన్‌పై ఫోర్జరీ, చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు రెండవపట్టణ సీఐ నరసింహారెడ్డి తెలిపారు. ఇతను ఈ ఏడా ది జూన్‌ 22న తన ఖాతా ద్వారా సీఎంఆర్‌ఎ్‌ఫకు సంబంధించిన రూ.2.95లక్షల చెక్కును డ్రా చేశాడు. అధికారుల తనిఖీలో ఆది ఫేక్‌ చెక్కుగా నిర్ధారణ అయింది. అసలు చెక్కు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి బాగ్యలక్ష్మి పేరిట రూ.5,500లు మాత్రమే మంజూరైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి ఆ ప్రైవేటు పాఠశాలలో ఏవోగా పనిచేస్తున్న బి.భాస్కర్‌రెడ్డిగా సీబీఐ అధికారులు గుర్తించారు.

Updated Date - 2020-09-24T17:38:43+05:30 IST