Abn logo
Jul 8 2020 @ 05:07AM

స్థలాల పేరుతో నిలువు దోపిడీ

అనువుగాని చోట ఇళ్ల స్థలాలు 

కోర్టు ఆర్డర్లు అంటే అధికారులకు, పాలకులకు భయంలేదు 

ఎమ్మిగనూరులో పట్టాదారులకు న్యాయం జరిగే దాకా పోరాటం 

మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి 


ఎమ్మిగనూరు, జూలై 7:  రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇళ్లపట్టాల పంపిణీ పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. మంగళవారం స్వగృహాంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామని చెప్పి ఏడాది గడుస్తోందన్నారు. అయితే నేడు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇంత పెద్దఎత్తున పట్టాల పంపిణీ ఎవరూ చేయలేదని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.


మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌,  నారాచంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని లక్షల మేర పట్టాలు ఇవ్వటమే గాక ఏకంగా వేలమందికి ఇళ్ల కాలనీలు నిర్మించినట్లు గుర్తు చేశారు.  ఎమ్మిగనూరులో తన తండ్రి బీవీ మోహన్‌రెడ్డి  హయాంలో  కొన్ని వేలమంది నిరుపేదలకు స్థలాలు ఇచ్చి  ఇళ్ల నిర్మించినట్లు తెలిపారు.  ఇళ్లస్థలాల భూములను చదును చేస్తామని రూ. 1600 కోట్లు, రహదారుల పేరుతో రూ. 1560 వైసీపీ నాయకుల జేబుల్లోకి పోయాయన్నారు. ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంటే టీడీపీ నాయకులు అసూయ పడుతున్నారని ఓ మంత్రి అన్నారని, రాష్ట్రంలో వేల సంఖ్యలో తమ హయంలో ఇళ్లు నిర్మించామని మరి వాటిని ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. ఎంతోమంది ముందుగానే డీడీ రూపంలో డబ్బు చెల్లించారన్నారు. ఆ ఇళ్లను నేడు క్వారంటైన్‌కు ఇచ్చారన్నారు.


ఆ ఇళ్ల తప్ప వేరే కాలేజీలు, స్కూల్లు లేవా అని ప్రశ్నించారు. కేవలం టీడీపీ హయాంలో నిర్మించారనే అక్కసుతో క్వారంటైన్‌ చేశారని మండిపడ్డారు.  కొన్ని చోట్ల ఎందుకూ పనికిరాని భూములు రూ. లక్షలకు కొని అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నరని ఆరోపించారు. ఎమ్మిగనూరు పట్లణంలో గతంలో 64, 65 సర్వే నంబర్‌లో నిరుపేదలకు ఇచ్చిన స్థలాల్లో లబ్ధిదారులు వేసుకున్న గుడిసెలను స్థానిక  అధికారులు దౌర్జన్యంగా తొలగించారని ఆరోపించారు. రెండుసార్లు కోర్టు ఇచ్చిన ఆర్డర్‌లు ఉన్నా కూడా లెక్కచేయకుండా పేదలగుడి సెలను కూల్చి వేశారన్నారు. ఈ ప్రభుత్వానికి, అధికార పార్టీనాయకులకు కోర్టులు అంటే లెక్కలేకుండా పోయిందన్నారు. పేదలు నివాసం ఉన్నచోటే స్థలాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు స్థలం ఇవ్వాలన్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాల జోలికి వెళ్లరాదని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు రామలింగారెడ్డి, శ్రీనివాసరాజు, రంగస్వామిగౌడ్‌,  దయాసాగర్‌, మధుబాబు, పాత పట్టాదారులు పాల్గొన్నారు.


ఆదోని: ఆదోని పట్టణంలో ఇల్లు లేని లబ్ధిదారులకు, ఇల్లులేని నిరుపేదలను గుర్తించి టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయాలని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు భూపాల్‌చౌదరి అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భూపాల్‌చౌదరి మాట్లాడుతూ పట్టణంలో గత టీడీపీ హయాంలో ఆదోని నియోజకవర్గానికి దాదాపుగా 4,704 జీ ప్లస్‌ త్రీ ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అందులో 4203 మంది రూ.500 ప్రకారంగా, 156 మంది రూ.50 వేలు ప్రకారంగా, 345 మంది రూ.లక్ష ప్రకారంగా మిగతావారు చెల్లించాలని అన్నారు. 4704 మంది అర్హులైన లబ్ధిదారులు డీడీలు కట్టారన్నారు.


ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అందులో కొందరిని జాబితా నుంచి తొలగించి వారి డబ్బులకు ఎటువంటి బాధ్యత తీసుకోవట్లేదన్నారు. నిరుపేదలను గుర్తించడంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. హౌసింగ్‌ డిపార్టుమెంట్‌లో  కూడా ఇప్పటికే 1,889 మంది లబ్ధిదారుల  బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని దాదాపుగా ఏడు కోట్లు రూపాయల బిల్లులు మంజూరు చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.   మాజీ కౌన్సిలర్‌ తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, అంజినప్ప, వెంకటేశ్‌, మారుతి పాల్గొన్నారు. 


ఆదోని టౌన్‌: టీడీపీ హయాంలో పక్కా నిర్మాణాలు పూర్తి చేసుకున్న జీప్లస్‌త్రీ గృహాలను పంపిణీ చేయకపోవడంపై లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని టీడీపీ మైనార్టీ నాయకుడు అల్‌హజ్‌ గడ్డా ఫకృద్దీన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఏడాది 5 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మించాల్సి ఉండగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఒక్క గృహ నిర్మాణం  చేయలేదని అన్నారు. ఇంటి నిర్మాణానికి  పేద ప్రజలు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదనే వాగ్దానాన్ని  సీఎం జగన్‌   నిలుపుకోవాలన్నారు. టిడ్కో ఆధ్వర్యంలో పక్కా గృహాల కోసం గత ప్రభుత్వ హయాంలో పేదలు చెల్లించిన డిపాజిట్లను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డిపాజిట్లు చెల్లించినా గృహాలు మంజూరు కాక,  డబ్బు వాపసు అందక పేదలు ఇబ్బందిపడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement