రష్యా, జో బైడెన్‌లపై విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్

ABN , First Publish Date - 2022-02-27T15:46:10+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

రష్యా, జో బైడెన్‌లపై విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడం అత్యంత పాశవికమని ఆరోపించారు. ఈ దారుణాన్ని జరగనిచ్చిన జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌పై నిప్పులు చెరిగారు. 


ఫ్లోరిడాలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది మానవాళిపై దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనికి కారణం జో బైడెన్ నేతృత్వంలోని అమెరికన్ అడ్మినిస్ట్రేషనేనని ఆరోపించారు. 


‘‘ఉక్రెయిన్‌పై రష్యా దాడి అత్యంత భయానకం. ఎప్పుడూ జరగకూడనటువంటి దుశ్చర్య, దౌర్జన్యం, బలాత్కారం. ఇలా ఎన్నడూ జరగకూడదు. గర్వించదగిన ఉక్రెయిన్ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నాం’’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 


ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ధైర్యసాహసాలను ట్రంప్ ప్రశంసించారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని, తాను అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండి ఉంటే, యుద్ధం జరిగి ఉండేది కాదని అన్నారు. బైడెన్ వంటి డోలును పుతిన్ వాయిస్తున్నారన్నారు. చూడటానికి ఇది బాగుండదన్నారు. 


ఇదిలావుండగా, తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లను రష్యా గుర్తిస్తోందని వ్లదిమిర్ పుతిన్ గత సోమవారం రాత్రి టెలివైజ్డ్ స్పీచ్‌లో చెప్పారు. పుతిన్ చర్యను డొనాల్డ్ ట్రంప్ ప్రశంసిస్తూ, ఇది ‘జీనియస్’ నిర్ణయమని పేర్కొన్నారు. పుతిన్ శాంతికాముకుడని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-02-27T15:46:10+05:30 IST