అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంతలోకాలకు..

ABN , First Publish Date - 2021-10-15T06:18:38+05:30 IST

పండుగనాడు మనుమ సంతానంతో కళకళలాడాల్సిన ఆ లోగిలి విషాదంతో మసకబారింది.

అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంతలోకాలకు..
శ్రావ్యశ్రీ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి సుజని

వరాహపట్నంలో పండుగ పూట విషాదం

చెరువులో పడి నలుగురు చిన్నారుల దుర్మరణం

పుట్టింటికి వచ్చి పుట్టెడు దుఃఖంలో అక్కాచెల్లెళ్లు


కైకలూరు, అక్టోబరు 14 : పండుగనాడు మనుమ సంతానంతో కళకళలాడాల్సిన ఆ లోగిలి విషాదంతో మసకబారింది. పుట్టింట్లో సంతోషాలను పంచుకునేందుకు వచ్చిన ఆ ఇంటి ఆడపడుచులిద్దరూ తమ కన్న బిడ్డలను చెరువు పొట్టన పెట్టుకోవడంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. కొద్ది గంటల ముందు కేరింతలతో సందడిగా ఉన్న ఆ ఇల్లు రోదనలతో నిండిపోయింది. దసరా పండుగకు పుట్టింటికి వచ్చిన అక్కాచెల్లెళ్ల బిడ్డలు నలుగురు మంచినీటి చెరువులో పడి మృతి చెందారన్న వార్త విని కైకలూరు మండలం వరాహపట్నం గ్రామం  కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలను పండుగకు ఆహ్వానించారు. శీతనపల్లి గ్రామం నుంచి పెద్దకుమార్తె వీరగాని సుజిని తన కుమార్తెలు కావ్యశ్రీ(11), శ్రావ్యశ్రీ(10), కుమారుడు మణికంఠను(8)ను వెంటబెట్టుకుని ముందుగా పుట్టింటికి వచ్చింది. ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామంలో నివసిస్తున్న రెండో కుమార్తె లుక్కా స్వాతి కనకవల్లి తన కుమార్తె నిఖిత(10), కుమారుడు వీరాంజనేయులు(6)తో కలసి గురువారం మధ్యాహ్నం పుట్టింటికి చేరుకుంది. కొద్దిసేపటి తరువాత వెంకటేశ్వరమ్మ గడ్డి కోసుకువచ్చేందుకు గ్రామంలోని మంచినీటి చెరువు గట్టుకు వెళ్లింది. ఆమె వెంట తామూ వస్తామంటూ మనుమలు ఐదుగురూ వెళ్లారు. వారు ఒకపక్కన ఆడుకుంటూ ఉండగా, మరోపక్కన వెంకటేశ్వరమ్మ గడ్డి కోసుకుంటోంది. ఆడుకుంటున్న కావ్యశ్రీ, శ్రావ్యశ్రీ, వీరాంజనేయులు, నిఖిత ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారు. గట్టుపై ఉన్న మణికంఠ కేకలు విని వెంకటేశ్వరమ్మ పరుగున వెళ్లి, పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించనప్పటికీ ఫలితం లేకపోయింది. ఒక చిన్నారి మాత్రమే దొరకగా, ఒడ్డుకు చేర్చి, వెంకటేశ్వరమ్మ స్పృహ తప్పి పడిపోయింది. మణికంఠ పరుగున ఇంటికి వెళ్లి తల్లికి సమాచార మివ్వడంతో అందరూ చెరువు వద్దకు పరుగున చేరారు. గ్రామస్థులు చెరువులో గాలించగా వీరాంజనేయులు మృతదేహం దొరికింది. మరో ఇద్దరు పిల్లలను వలల సహాయంతో తీశారు. వీరిని కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎంపీపీ అడవికృష్ణ, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు వినయ్‌కుమార్‌, టీడీపీ నాయకులు పెన్మెత్స త్రినాథరాజు, నాగరాజు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. గుడివాడ డీఎస్పీ ఎన్‌.సత్యానందం, సీఐ వై.వి.వి.ఎల్‌.నాయుడు, ఎస్సై సి.హెచ్‌.కృష్ణ ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-10-15T06:18:38+05:30 IST