మార్ట్‌గేజ్‌లోని ఫ్లాట్లను అమ్మేసి రూ.కోట్లలో మోసం

ABN , First Publish Date - 2022-01-24T06:14:35+05:30 IST

తిరుపతికి చెందిన ఓ ప్రముఖ బిల్డర్స్‌ అధినేత మార్ట్‌గేజ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మించారు. మార్ట్‌గేజ్‌లో ఉన్న విషయం తెలియనీయకుండా మోసం చేసి ఫ్లాట్లను కోట్ల రూపాయలకు విక్రయించాడు.

మార్ట్‌గేజ్‌లోని ఫ్లాట్లను అమ్మేసి రూ.కోట్లలో మోసం

తిరుపతిలో రాకేష్‌ బిల్డర్స్‌ అధినేతపై కేసు నమోదు


తిరుపతి(నేరవిభాగం), జనవరి 23: తిరుపతికి చెందిన ఓ ప్రముఖ బిల్డర్స్‌ అధినేత మార్ట్‌గేజ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మించారు. మార్ట్‌గేజ్‌లో ఉన్న విషయం తెలియనీయకుండా మోసం చేసి ఫ్లాట్లను కోట్ల రూపాయలకు విక్రయించాడు. ఇది తెలిసిన బాధితులు ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన రాకేష్‌ బిల్డర్స్‌ అధినేత కొమ్ము చెంచయ్య యాదవ్‌ కొర్లగుంట మారుతీనగర్‌లో 24 ఫ్లాట్లతో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మించారు. ఇందుకుగాను సిటీ యూనియన్‌ బ్యాంక్‌ నుంచి మార్ట్‌గేజ్‌ కింద రూ.8 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఈసీల్లో మార్ట్‌గేజ్‌ చూపించనీయకుండా 13 ఫ్లాట్లను పలువురికి విక్రయించి సుమారు రూ.6.50 కోట్లు సొమ్ము చేసుకున్నారు. మార్ట్‌గేజ్‌ విషయం తెలియక పలువురు వైద్యులు, వ్యాపారులు ఈ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇది కాస్తా బ్యాంకు అధికారులకు తెలియడంతో వారు అపార్ట్‌మెంట్‌ను వేలం వేస్తున్నట్టు నోటీసులిచ్చారు. దాంతో తామో మోసపోయామంటూ కొన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


నాపై దుష్ప్రచారం

తిరుపతిలో ఇప్పటివరకు బిల్డర్‌గా 14 వెంచర్లు చేశాను. ఎక్కడా కూడా చిన్న మచ్చలేదు. కొందరు పనిగట్టుకుని నాపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు. బ్యాంకు నుంచి రూ.7.5కోట్ల లోను తీసుకుంటే రూ.3.5 కోట్లు ఇప్పటికే కట్టేయడం జరిగింది. వడ్డీతోకలిపి ఇక కట్టాల్సింది సుమారు రూ.5.25 కోట్లు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంకా వినియోగదారుల నుంచి రూ.2కోట్లు రావాలి. మరో మూడు ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. రిజిస్ర్టేషన్‌ చేసుకున్నవారు నేను ఏ బ్యాంకులో లోను తెచ్చానో, అదే బ్యాంకులో చెక్కులు ఇచ్చారు. కొందరు పూర్తి మొత్తం చెల్లించక పోవడంతో కొన్ని ఫ్లాట్లను అసంపూర్తిగా వదిలేశాం. ఇటువంటివారు కావాలనే నాపై ఫిర్యాదు చేశారు. 

- కొమ్ము చెంచయ్య యాదవ్‌

Updated Date - 2022-01-24T06:14:35+05:30 IST