ముప్పు ముంగిట్లో

ABN , First Publish Date - 2021-03-31T07:18:09+05:30 IST

దేశంలో కరోనా పరిస్థితి ఆందోళనకర స్థాయి నుంచి ప్రమాదకరస్థాయికి పెరుగుతోందని కేంద్రం హెచ్చరించింది. మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తమ్మీద..

ముప్పు ముంగిట్లో

ఆందోళనకర స్థితి నుంచి ప్రమాదకర స్థాయికి

10 జిల్లాల్లో భారీగా యాక్టివ్‌ కేసుల సంఖ్య

ఆ జిల్లాల్లో అత్యధికం మహారాష్ట్రలోనివే!

పెరిగిన పాజిటివిటీ.. మహారాష్ట్రలో 23%

దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక

కట్టడి ప్రాంతాలను ఏర్పాటు చేయండి

కాంటాక్టుల్ని గుర్తించాలని రాష్ట్రాలకు సూచన

2వ డోసు తర్వాత ముప్పుతక్కువే: హర్షవర్ధన్‌

నాగపూర్‌లో ఒక్కరోజే 55 మంది మృతి 


న్యూఢిల్లీ, మార్చి 30: దేశంలో కరోనా పరిస్థితి ఆందోళనకర స్థాయి నుంచి ప్రమాదకరస్థాయికి పెరుగుతోందని కేంద్రం హెచ్చరించింది. మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తమ్మీద.. దేశం మొత్తం ముప్పు ముంగిట్లో ఉందని.. ఎవరూ నిశ్చింతగా ఉండే పరిస్థితి లేదని పేర్కొంది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. దేశంలో వైరస్‌ పరిస్థితి గురించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వివరించారు. దేశంలో 10 జిల్లాల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని.. ఆ జిల్లాల్లో ఎక్కువభాగం మహారాష్ట్రలోనివేనని ఆయన వెల్లడించారు. పుణె (59,475 యాక్టివ్‌ కేసులు), ముంబై (46,248), నాగ్‌పూర్‌ (45,322), ఠాణే (35,264), నాసిక్‌ (26,553), ఔరంగాబాద్‌ (21,282), బెంగళూరు అర్బన్‌ (16,529), నాందేడ్‌ (15,171), ఢిల్లీ (8,032- ఢిల్లీని ఒక జిల్లాగా లెక్కిస్తే), అహ్మద్‌ నగర్‌ (7,952)లో భారీగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇక దేశంలో కరోనా పరిస్థితి తీవ్రస్థాయికి చేరిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం, ఏ జిల్లా కూడా నిశ్చింతగా ఉండే పరిస్థితి లేదన్నారు. ఆ మహమ్మారికి అడ్డుకట్ట వేసే, ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని పాల్‌ పేర్కొన్నారు.


పెరుగుతున్న పాజిటివిటీ రేటు..

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు (చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య) పెరుగుతోందని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. మహారాష్ట్రలో గత వారంలో సగటున 23ు పాజిటివిటీ రేటు నమోదైందని చెప్పారు. అంటే.. 100 మందిని పరీక్షిస్తే 23 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నమాట. మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో వరుసగా.. పంజాబ్‌ (8.82ు పాజిటివిటీ రేటు), ఛత్తీ్‌సగఢ్‌ (8.24ు), మధ్యప్రదేశ్‌ (7.82ు), తమిళనాడు (2.5ు), కర్ణాటక (2.45ు), గుజరాత్‌ (2.22ు), ఢిల్లీ (2.04ు) ఉన్నాయి. గతవారం ఈ రేటు జాతీయస్థాయిలో సగటున 5.65 శాతంగా ఉంది. దీన్ని బట్టి మహారాష్ట్రలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రాల్లోనే కాదు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య కొద్దిరోజులుగా భారీగా పెరుగుతోంది. పరీక్షల సంఖ్య కూడా ఆ స్థాయిలోనే భారీగా పెంచాల్సిన అవసరం ఉందని రాజేశ్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. చేసే టెస్టుల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల శాతం ఎక్కువగా ఉండాలని సూచించారు. 


ఇలా చేయండి..

మళ్లీ ప్రమాదకరంగా మారుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి.. నిర్దిష్టమైన కాలపరిమితులతో, బాధ్యతలతో.. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఎవరికైనా వైరస్‌ పాజిటివ్‌ వస్తే.. వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌ చేస్తే సరిపోదని.. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన 25-30 మందిని గుర్తించి (కాంటాక్ట్‌ ట్రేసింగ్‌) వారికి పరీక్షలు చేసి (టెస్టింగ్‌) చికిత్స చేయాలని (ట్రీట్‌మెంట్‌) సలహా ఇచ్చింది. అలాగే.. కేసులు ఎక్కువగా ఉన్న చోట పెద్ద ఎత్తున కట్టడి ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించింది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనే లెక్కలతో సంబంధం లేకుండా జిల్లాలస్థాయిలో పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాల సీఎ్‌సలకు లేఖలు రాశారు. పోలీస్‌ యాక్ట్‌ లేదా విపత్తు నిర్వహణ చట్టం.. ఏదైనా సరే ఉపయోగించి, కొవిడ్‌ నిబంధనలు అందరూ పాటించేలా చూడాలన్నారు. రాష్ట్రాలు టెస్టింగ్‌పై దృష్టి సారించాలని, పాజిటివిటీ రేటు, కేసుల పెరుగుదల శాతం, మరణాల రేటు, కేసులు రెట్టింపు అవుతున్న వేగం వంటివాటిని రియల్‌టైమ్‌ బేసి్‌సలో గుర్తించాలని సూచించారు. 


యాంటీజెన్‌ టెస్టుల కన్నా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు ఎక్కువగా చేయాలన్నారు. ఎక్కవ కేసులు ఉన్న జిల్లాల్లో, కేసులు వేగంగా పెరుగుతున్న చోట్ల.. ప్రాధాన్య గ్రూపులవారందరికీ (45 దాటినవారు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌) రానున్న రెండువారాల్లో సంతృప్తస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేయాలని సూచించారు. మరణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టి.. అక్కడ మరణాల రేటు ఎక్కువగా ఎందుకు ఉందో గుర్తించాలన్నారు. వైరస్‌ సోకిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించడమా? లేక ఆస్పత్రిలో ఆలస్యంగా చేరడమా? ఆస్పత్రుల్లో చేరినా.. అక్కడ సరైన చికిత్స ఇవ్వక చనిపోయారా? తదితర విషయాలను పరిశీలించి, లోపాలేవైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. 


ట్రయల్స్‌ దశలో మరో 7 టీకాలు: హర్షవర్ధన్‌ 

దేశంలో ప్రస్తుతం ఏడు టీకాల ట్రయల్స్‌ జరుగుతున్నాయని.. వాటిలో కొన్ని అడ్వాన్స్‌డ్‌ దశల్లో ఉన్నాయని, మరో రెండు డజన్ల టీకాలు ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని.. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత కరోనా బారిన పడిన కేసులు చాలా అరుదని.. అలాంటివారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రస్థాయికి చేరుకోదని ఆయన భరోసా ఇచ్చారు. 


విమానాశ్రయాల్లో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై అక్కడికక్కడే జరిమానాలు విధించాలని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) కార్యాలయం ఎయిర్‌లైన్‌ సంస్థలకు, విమానాశ్రయాలకు సూచించింది. నోరు, ముక్కు కవర్‌ కాకుండా మాస్కులు పెట్టుకొనేవారిని, సామాజిక దూరం పాటించనివారిని గుర్తించి తక్షణం జరిమానాలు విధించాలని పేర్కొంది. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులను బోర్డింగ్‌కు అనుమతించవద్దని, ఒకసారి హెచ్చరించినా పట్టించుకోకుండా మళ్లీ నిబంధనలు ఉల్లంఘించేవారిని మూన్నెల్లు విమాన ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించాలని కూడా సూచించింది. 


ఇంటింటికీ టీకా సాధ్యం కాదు: కేంద్రం

గడప గడపకూ వెళ్లి కరోనా నిరోధక టీకాలు వేయడం ఇప్పటికైతే సాధ్యపడదని కేంద్రం పేర్కొంది. టీకా వేయడంలో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయని, టీకా తీసుకున్నవారికి కొద్దిగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశం ఉందని, ఆ మేరకు వారి ఆరోగ్య పరిస్థితిని అరగంటపాటు పర్యవేక్షించాల్సి వస్తుందని ఈ కారణంగా ఒకేసారి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ వేయడం సాధ్యమయ్యేపని కాదని స్పష్టం చేసింది. ఇంటింటికి టీకాపై  మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపింది.


ప్రైవేటులో టీకా..తెలంగాణ టాప్‌

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ.. ప్రైవేటులో టీకా లు వేయించుకుంటున్నవారి సంఖ్య తెలంగాణలోనే ఎక్కువని కేంద్రం స్పష్టం చేసింది! రాష్ట్రంలో వేస్తున్న టీకాల్లో 48.39ు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేస్తున్నవేనని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. తర్వాత.. 43.11ుతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచినట్టు చెప్పారు. నిజానికి తెలంగాణలో టీకా కార్యక్రమం మొదట్నుంచీ నత్తనడకనే సాగుతోంది. వ్యాక్సినేషన్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖం డ్‌, హరియాణా, ఢిల్లీ మొదటి 16 స్థానాల్లో ఉంటే.. తెలంగాణ 17వ స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఇచ్చింది 10,04,243 టీకాలు. అందులో 48.39ు అంటే.. 4,85,953 టీకాలు ప్రైవేటు కేం ద్రాలు, ఆస్పత్రుల్లో ఇచ్చినవే. పీహెచ్‌సీల్లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు తీసుకునేవారి సంఖ్య మన రాష్ట్రంలో కేవలం 51.61ు. ఇది మిగతా రాష్ట్రాలతో పోలి స్తే చాలా తక్కువ. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా ఇస్తున్న టీకాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడమే ఇందుకు కారణమనే విమర్శలున్నాయి. కాగా, గురువారం నుంచి దేశవ్యాప్తంగా 45 ఏళ్లు దాటిన వారికి టీకా వేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి వెల్లడించింది. 

Updated Date - 2021-03-31T07:18:09+05:30 IST