బిలియనీర్లుగా రాయల్ లైఫ్ గడిపి చివరకు చిక్కుల్లో.. పూలమ్మిన చోటే కట్టెలమ్మడమంటే ఇదే..!

ABN , First Publish Date - 2021-05-06T18:35:30+05:30 IST

నాలుగు డబ్బులు సంపాదించి, ఖరీదైన జీవితానికి అలవాటు పడిన వారు దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. అందుకే ఒక స్థాయిలో సంపాదించిన వారు మరింత సంపాదించడానికి కష్టపడుతుంటారు. అయితే కొంతమందిపై విధి సీతకన్ను వేయడమో,

బిలియనీర్లుగా రాయల్ లైఫ్ గడిపి చివరకు చిక్కుల్లో.. పూలమ్మిన చోటే కట్టెలమ్మడమంటే ఇదే..!

నాలుగు డబ్బులు సంపాదించి, ఖరీదైన జీవితానికి అలవాటు పడిన వారు దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. అందుకే ఒక స్థాయిలో సంపాదించిన వారు మరింత సంపాదించడానికి కష్టపడుతుంటారు. అయితే కొంతమందిపై విధి సీతకన్ను వేయడమో, లేకపోతే మరికొందరు మరింత సంపద కోసం అడ్డదారులు తొక్కడమో వారి తలరాతను మార్చేస్తుంది. ఇలా బాగా బతికిన కొందరు బడా బిలియనీర్లు ప్రస్తుతం భయంభయంగా జీవితాలు సాగిస్తున్నారు. కొందరు ఏ దారీ లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్న కొందరు భారతీయ బిలియనీర్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే..


1. విజయ్ మాల్యా

భారత బిలియనీర్, ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ యజమానిగా రాజాలాంటి జీవినం సాగించిన విజయ్ మాల్యాను.. అతని పరిచయస్తులందరూ ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’ అని పిలిచేవారు. అయితే ప్రస్తుతం విజయ్ మాల్యా జీవితంలో ‘గుడ్ టైమ్స్’ ఏమాత్రం లేవు. అతన్ని ఎలాగైనా బ్రిటన్ నుంచి భారతదేశానికి తీసుకొచ్చి కేసులు పెట్టాలని భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 40 కంపెనీల ద్వారా భారత్‌లోని బ్యాంకుల వద్ద మాల్యా లోన్లు తీసుకున్నాడు. మాల్యా గనుక స్వదేశానికి తిరిగొస్తే అతని వద్ద నుంచి సుమారు రూ.9వేలకోట్లు వసూలు చేయడానికి 17 బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి.


2. మెహుల్ ఛోక్సీ

భారత్ నుంచి పరారై ప్రస్తుతం ద్వీపదేశం ఆంటిగ్వా అండ్ బార్బుడాలో ఉన్న మెహుల్ ఛోక్సీ.. భారత్‌లో 4వేలపైగా స్టోర్స్ ఉన్న గీతాంజలి గ్రూప్ యజమాని. ఇదో ఆభరణాల కంపెనీ. దీన్ని అడ్డుపెట్టుకున్న ఛోక్సీ.. భారతదేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 1.8 బిలియన్ డాలర్లకు టోకరా ఇచ్చాడు. బ్యాంకులోని ఇద్దరు ఉద్యోగులతో కుమ్మక్కైన ఛోక్సీ.. వారి ద్వారి అడ్డదారుల్లో బ్యాంకు లోన్లు తీసుకున్నాడు. 2018లో ప్రభుత్వం నియమించిన పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్) అధికార సంస్థ ఛోక్సీకి చెందిన 1,210 కోట్ల విలువైన 41 ఆస్తులను జప్తు చేసింది.


3. సత్యం రామలింగరాజు

90వ దశకంలో దేశంలో అత్యంత సక్సెస్‌ఫుల్ ఐటీ సంస్థల్లో సత్యం కంప్యూటర్స్ ఒకటి. అయితే 2015లో ఈ సంస్థ మూతపడింది. దీనికి ఉన్న కారణాల్లో ప్రధానమైంది సంస్థ సీఈవో, మాజీ చైర్మన్ సత్యం రామలింగరాజు. ఆయన కంపెనీకి చెందిన రూ.7,140 కోట్లను కాజేశారు. ఈ విషయాన్ని అంగీకరించిన తర్వాత సత్యం బోర్డుకు ఆయన రాజీనామా ఇచ్చారు. రెవెన్యూ, మార్జిన్లు, 5వేలకోట్ల క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్లు దొంగలెక్కలు చూపించినట్లు రామలింగరాజు ఒప్పుకున్నారు. 7వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు అంగీకరించి, 2009 జనవరి 7న సత్యం బోర్డుకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ కంపెనీని మహీంద్రా సంస్థ కొనుగోలు చేసి ‘మహీంద్రా సత్యం’గా పేరు మార్చింది.  2015 మే 11న హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు రామలింగరాజుకు, మిగతా నిందితులకు బెయిలు మంజూరు చేసింది. అయితే పూచీకత్తు కింద రామలింగరాజు, అతని సోదరుడు తలో రూ.10లక్షలకు కట్టాలని, మిగతా నిందితులు తలో రూ.50వేలు కట్టాలని ఆదేశించింది.


4. నీరవ్ మోదీ

భారత్‌లో సంచలనం సృష్టించిన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో నీరవ్ మోదీ పేరు కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ వజ్రాల వ్యాపారి భారతీయులనే కాదు, విదేశీయులను కూడా మోసం చేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి 28వేలకోట్లు కాజేసిన ఈ ఘరానా దొంగ.. కాలిఫోర్నియాకు చెందిన ఒక బిజినెస్‌మేన్‌ను కూడా మోసం చేశాడు. కస్టమ్ మేడ్ ఎంగేజ్‌మెంట్ డైమండ్స్ అంటూ 4.2 మిలియన్ డాలర్లు తీసుకొని ల్యాబ్ డైమండ్స్ అంటగట్టాడు. దీనిపై సదరు అమెరికా వ్యాపారి కేసు వేయడంతో భారత సీబీఐతోపాటు అమెరికా పోలీసులు, ఇంటర్‌పోల్ సైతం నీరవ్ మోదీని వాంటెడ్ జాబితాలో చేర్చాయి. ప్రస్తుతం అతను యూకేలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి 2020 జూన్ 8న నీరవ్ మోదీకి చెందిన 1,400 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు జప్తుచేశారు.


5. సుబ్రతా రాయ్

కొంతకాలం క్రితం భారతదేశంలో బడా కంపెనీలు, గ్రూపుల పేర్లు చెబితే దానిలో కచ్చితంగా వినిపించే పేరు సహారా ఇండియా. అయితే మార్కెట్ నింయత్రణా సంస్థ సెబితో కొన్ని వివాదాలు రావడంతో ఈ గ్రూపుపై కేసు వేయడం జరిగింది. ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరుకానందున సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్‌ను అరెస్టు చేయాలని 2014 ఫిబ్రవరి 26న కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఢిల్లీలోని తిహార్ జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించిన ఆయన.. పెరోల్ సంపాదించి మే 2016 నుంచి బయటే ఉన్నారు. అప్పటి నుంచి వివిధ కారణాలు చూపుతూ తన బెయిలును పొడించుకుంటూ వస్తున్నారు. 2019 జనవరి 31 నాటికి సహారా గ్రూపు రూ.10,261 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.


6. అనిల్ అంబానీ

అంబానీ కుటుంబంలో పుట్టిన అనిల్ అంబానీ అప్పులపాలవడం నిజంగా ఆశ్చర్యకరం. అంతకన్నా షాకింగ్ విషయం ఏంటంటే.. ఓ దశలో అన్నయ్య ముకేష్ అంబానీ గనుక సాయం చేయకపోయి ఉంటే అనిల్ జైలు జీవితం గడపాల్సి వచ్చేది. ఎరిక్‌సన్ ఏబీ సంస్థ భారతదేశ యూనిట్ చెల్లించాల్సిన 77 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించాలని, లేదంటే ఆ సంస్థకు హామీ ఇచ్చిన 60 ఏళ్ల అనిల్ అంబానీని జైల్లో వేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. అప్పటి నుంచి అప్పులవాళ్లు, కోర్టు కేసులతో అనిల్ అంబానీ జీవితం నరకప్రాయంగా మారిందనడం అతిశయోక్తి కాదు. దానికితోడు ఆయనకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థ కూడా దివాళా దిశగా సాగడం మరింత విచారకరం.


7. వి.జి. సిద్ధార్థ

భారతదేశంలో అతిపెద్ద కాఫీ చైన్ సంస్త కేఫ్ కాఫీ డే. దీని సీఈవో వి.జి. సిద్ధార్థ అప్పుల బాధ, ఇన్‌కంట్యాక్స్ అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునే ముందు తన పరిస్థితిని వివరిస్తూ సిద్దార్థ ఒక లేఖ రాశారు. 2017 సెప్టెంబరు 21న ముంబై, బెంగళూరు, చెన్నై, చిక్‌మంగళూరుల్లో సిద్దార్థకు చెందిన 20 ఆస్తులపై ఇన్‌కంట్యాక్స్ అధికారులు రెయిడ్ చేశారు. సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ చాలా మంది పోస్టులు పెట్టారు. వారిలో చాలామంది ‘ఎ లాట్ కెన్ హాపెన్ ఓవర్ కాఫీ’(కాఫీపై చాలా జరగొచ్చు) అంటూ కామెంట్లు పెట్టారు. అయితే సిద్ధార్థ మృతి తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే.. కేఫ్ కాఫీ డే భారాన్ని భుజాలకెత్తుకున్నారు. అప్పులన్నీ నిదానంగా తీరుస్తూ ఉద్యోగులను కూడా తొలగించకుండా సంస్థను నిలకడగా నడిపిస్తున్నారు.

Updated Date - 2021-05-06T18:35:30+05:30 IST