నేటి నుంచి..ఆన్‌లైన్‌ క్లాసులు

ABN , First Publish Date - 2022-01-24T05:56:30+05:30 IST

కరోనా థర్డ్‌ వేవ్‌, ఒమైక్రాన్‌ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల సెలవులను పొడిగించగా, విద్యార్థులకు మరోమారు ఆన్‌లైన్‌ తరగతులు ఈ నెల 24న ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి..ఆన్‌లైన్‌ క్లాసులు

8, 9, 10వ తరగతుల విద్యార్థులకు మాత్రమే

బడిబాటపట్టనున్న 50శాతం మంది ఉపాధ్యాయులు


భువనగిరి టౌన్‌, భూదాన్‌పోచంపల్లి, సూర్యాపేట సిటీ, నల్లగొండ : కరోనా థర్డ్‌ వేవ్‌, ఒమైక్రాన్‌ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల సెలవులను పొడిగించగా, విద్యార్థులకు మరోమారు ఆన్‌లైన్‌ తరగతులు ఈ నెల 24న ప్రారంభంకానున్నాయి. 


సంక్రాంతికి సెలవుల అనంతరం పాఠశాలలు తెరవాల్సిన సమయంలో కరోనా, ఒమైక్రాన్‌ వ్యాప్తి పేరుతో ప్రభుత్వం మరోమారు సెలవులను పొడిగించింది. సెలవుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలా? వద్దా? అనేది ప్రభుత్వం ఆ సమయంలో తేల్చలేదు. అదనంగా ఇచ్చిన 13 రోజుల సెలవుల్లో విద్యార్థులు ఏం చేయాలో స్పష్టం చేయలేదు. ఇప్పటికే కరోనా కారణంగా రెండేళ్లపాటు ఇంటికే పరిమితమైన విద్యార్థులు చదువుపై ఆసక్తిచూపక అలసత్వంతో ఉన్నారు. ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాక విద్యార్థులు గాడిలో పడుతున్న నేపథ్యంలో సెలవుల పొడిగింపు శాపంగా మారింది. సెలవుల పొడిగింపుపై తల్లిదండ్రులు, విద్యానిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో తిరిగి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.


నేటి నుంచి తరగతులు

ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 24నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రభుత్వం ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది. 17వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈనెల 30 వరకు సెలవులను పొడిగించింది. కాగా, 24వ తేదీ నుంచి నిర్వహించే ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసింది. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 715 ఉండగా, ప్రైవేట్‌ పాఠశాలలు 150కిపైగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులు 46,583 మంది, ప్రైవేట్‌ పాఠశాలల్లో సుమారు 20వేల మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 60,831 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 20వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికి టీశాట్‌, యాదగిరి చానల్‌ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు. కాగా, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే అనధికారికంగా జూమ్‌ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది 24వ తేదీ నుంచి 50శాతం మంది హాజరుకావాల్సి ఉంటుంది. హాజరైన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ పాఠాలను మానిటరింగ్‌ చేయాల్సి ఉంటుంది.


విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం : మధు, ట్రస్మా జిల్లా నాయకుడు

థియేటర్లు, పబ్బులు, మాల్స్‌, రాజకీయ సభ ల్లో రాని కరోనా, ఒమైక్రాన్‌ కేవలం స్కూళ్లలో వస్తుందని భ్రమించడం హాస్యాస్పదం. విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యాసంస్థలకు కరోనా పేరుతో ప్రభుత్వం సెలవులు ప్రకటించిం ది. ఇప్పటికైనా ఆఫ్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు అనుమతించాలి.


ఆఫ్‌లైన్‌ క్లాసులు నడిపించాలి : నక్క సంగీత, విద్యార్థి తల్లి, భూదాన్‌పోచంపల్లి

కరోనా నిబంధనలు పాటిస్తూ ఆఫ్‌లైన్‌ తరగతులు నడిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చాలా రోజులుగా సెలవులు ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతోంది. పిల్లలు సెల్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నడిపిస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించలేదు. ఇప్పటికైనా అన్ని తరగతుల విద్యార్థులకు బోధన అందించాల్సిన అవసరం ఉంది.


కొనసాగుతున్న జ్వర సర్వే

యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 8,468మందికి కొవిడ్‌ లక్షణాలు

నల్లగొండ, సూర్యాపేట మునిసిపల్‌ కార్యాలయంలో పలువురికి కరోనా


నల్లగొండ అర్బన్‌, భువనగిరి టౌన్‌, సూర్యాపేట సిటీ, జనవరి 23 : కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తం గా చేపడుతున్న జ్వర సర్వే మూడో రోజు ఆదివారం కూడా కొనసాగింది. నల్లగొండ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది 68,237 ఇళ్లను తిరిగి 2,61,904 మందిని పరీక్షించగా, అందులో 2,228 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో 7.63లక్షల జనాభా, 3,77,205 కుటుంబాలు ఉన్నాయి. 421 పంచాయతీలు, ఆరు మునిసిపాలిటీల్లో 1352బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఆదివారం  56,638 కుటుంబాల్లో సర్వే నిర్వహించగా 2,687 మందికి జ్వర లక్షణా లు ఉన్నట్లు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో 32,524 ఇళ్లను సర్వే నిర్వహించగా, 181 మందికి లక్షణాలు ఉన్నాయి. మూడు రోజుల్లో నల్లగొండ జిల్లాలో 1,98,748 ఇళ్లను సర్వే చేయగా, మొత్తం 6,746 మందికి లక్షణాలను గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో 1,51,290 ఇళ్లను సర్వే చేయగా, 1,083 మందికి లక్షణాలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 1,62,574 ఇళ్లను సర్వే చేయగా, అత్యధికంగా 8,468మందికి లక్షణాలు గుర్తించారు.

నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌కు పాజిటివ్‌

రామగిరి, సూర్యాపేటటౌన్‌, దేవరకొండ : నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌ కె.వి.రమణాచారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదేవిధంగా కార్యాలయంలో పనిచేస్తున్న డీఈ వెంకన్న, ఏ ఈ ఝాన్సీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గడ్డం శ్రీను, శశిధర్‌, ఏసీపీ నాగిరెడ్డి తో పాటు పలువురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. వీరంతా హోంక్వారంటైన్‌లో చికిత్సపొందుతున్నారు. సూర్యాపేట మునిసిపల్‌ కార్యాలయంలో ఏడుగురు బిల్‌కలెక్టర్లు, ఒక మెప్మా సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరితోపాటు మరికొంతమందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్న ట్లు తెలిసింది. దేవరకొండ డివిజన్‌లో ఆదివారం 637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 48 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేవరకొండలో 24మందికి, చం దంపేట, చింతపల్లి మండలా ల్లో ఒకరి చొప్పు న, డిండిలో 8 మందికి, గుడిపల్లిలో ముగ్గురికి, గుర్రంపోడులో నలుగురికి, బొడ్డుపల్లిలో ఇద్దరికి, పీఏపల్లిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.



జ్వర సర్వే ఇలా...

జిల్లా తేదీ సర్వే చేసిన జ్వర లక్షణాలు

కుటుంబాలు ఉన్నవారు

నల్లగొండ 21న 58,400 2,040

22న 72,111 2,478

23న 68,237 2,228

యాదాద్రి 21న 43,758 2,551

22న 62,178 3,230

23న 56,638 2,687

సూర్యాపేట 21న 86,267 512

22న 32,499 390

23న 32,524 181

మొత్తం 5,12,612 16,297

Updated Date - 2022-01-24T05:56:30+05:30 IST