పోటెత్తిన సింహగిరి

ABN , First Publish Date - 2021-01-17T05:44:06+05:30 IST

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు.

పోటెత్తిన సింహగిరి
అప్పన్న స్వామి దర్శనం కోసం రాజగోపురం వద్ద బారులుతీరిన భక్తులు

రికార్డు స్థాయిలో ఒక్కరోజులో రూ.29 లక్షల ఆదాయం

సింహాచల దేవస్థానం చరిత్రలో ఇదే ప్రథమం

సింహాచలం, జనవరి 16: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో రూ.29 లక్షల ఆదాయం దేవస్థానానికి సమకూరింది. రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనం కంటే ప్రసాదాల కొనుగోళ్ల కోసమే భక్తులు గంటలకొద్దీ క్యూలో వేచివుండాల్సి వచ్చింది. ప్రసాదాలను రెండు కౌంటర్ల వద్దే విక్రయించడంతో ఈ సమస్య తలెత్తింది. ప్రసాదాల అరకొర సరఫరా సమస్యను అధిగమించినట్టు అధికారులు ప్రకటించినా భక్తులకు కావాల్సిన సంఖ్యలో ప్రసాదాల విక్రయాలు జరగడం లేదు. అయితే ప్రసాదాల తయారీ జరిగినా విక్రయాల కౌంటర్లలో పనిచేసేందుకు సిబ్బంది కొరత వేధిస్తోందని ఏఈవో రాఘవకుమార్‌ తెలిపారు. కాగా ఎక్కువ మంది భక్తులు రూ.300 అతిశ్రీఘ్రదర్శనం టికెట్లు కొనుగోలు చేయడంతో ఒకానొక దశలో ప్రధాన రాజగోపురం నుంచి విచారణ కేంద్రం వరకు క్యూ లైన్‌ పెరిగింది. 

వరుస సెలవుల నేపథ్యంలో దేవస్థానానికి రూ.100, రూ.300 టికెట్ల విక్రయాల ద్వారా సుమారు రూ.16 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.4.1 లక్షలు, తలనీలాల ద్వారా రూ.లక్ష, టోల్‌గేట్‌ వాహనాల టికెట్లు, సింహగిరి ట్రాన్స్‌పోర్టు బస్సు టికెట్ల విక్రయాల ద్వారా మొత్తం సుమారు రూ.29 లక్షల ఆదాయం దేవస్థానం ఖజానాకు రావడం ఆలయ చరిత్రలోనే ఇదే ప్రథమమని గణాంకాలు చెబుతున్నాయి.



Updated Date - 2021-01-17T05:44:06+05:30 IST