పారితోషికం మాయం!

ABN , First Publish Date - 2020-06-05T09:46:20+05:30 IST

అనంత సర్వజనాస్పత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సల పారితోషికం మాయమైంది. వైద్యులు, నర్సుల ఖాతాల్లోకి సొమ్యు ..

పారితోషికం మాయం!

ఆరోగ్యశ్రీ నిధుల పంపిణీలో గోల్‌మాల్‌..

రెండేళ్లుగా టెక్నీషియన్లకు అందని సొమ్ము..

డాక్టర్లు, నర్సుల ఖాతాల్లోకి జమ..

బిల్లులు పెట్టినా టెక్నీషియన్లకు జమకాని వైనం..

సర్వజనాస్పత్రిలో విచిత్రం..


అనంతపురం వైద్యం, జూన్‌4: అనంత సర్వజనాస్పత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సల పారితోషికం మాయమైంది. వైద్యులు, నర్సుల ఖాతాల్లోకి సొమ్యు జమయినా.. టెక్నీషియన్లకు మాత్రం అందలేదు. రెండేళ్లుగా ఇదే తంతు. తమకు న్యాయం చేయాలని టెక్నీషియన్లు వేడుకుంటున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.


ప్రభుత్వాస్పత్రుల్లో చేసే శస్త్ర చికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం పారితోషికం అందిస్తుంది. ఆయా కేసులకు సంబంధించి వచ్చే సొమ్ములో 45 శాతం శస్త్ర చికిత్సకు అవసరమైన పరికరాలు ఇతరత్రా వసతుల కల్పనకు అందిస్తారు. 35 శాతం నిధులు శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యులు, నర్సులు ఇతర విభాగాల టెక్నీషియన్లకు చెల్లిస్తారు. మిగిలిన 20 శాతం ప్రభుత్వం వద్దనే ఉంటాయి. జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో ఆ నిధులను ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగిస్తారు. జిల్లా సర్వజనాస్పత్రిలో ఆరోగ్యశ్రీ పారితోషికం పంపిణీలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలో పాల్గొన్న టెక్నీషియన్లకు రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ పారితోషికం అందకపోవటమే నిదర్శనం.


జిల్లా వైద్యకళాశాల పరిధిలో పెథాలజీ (రక్త పరీక్షల విభాగం)లో నలుగురు, మైక్రోబయాలజీలో 8 మంది, బయోకెమిస్ర్తీలో ముగ్గురు టెక్నీషియన్లున్నారు. రేడియాలజీ విభాగంలో 17 మంది వరకూ పనిచేస్తున్నారు. శస్త్ర చికిత్సల సమయంలో ఈ విభాగాల టెక్నీషియన్ల పాత్ర కీలకం. అందుకే ఆరోగ్యశ్రీ పారితోషికం సొమ్మును ఆయా విభాగాలకు కేటాయిస్తారు. ఆ సొమ్మును కేటగిరీల వారీగా వైద్యులు, నర్సులు, ఇతర టెక్నీషియన్లు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా సర్వజనాస్పత్రిలో మాత్రం అలా చేయట్లేదు. 2018 నుంచి ఇప్పటి వరకూ టెక్నీషియన్లకు పైసా కూడా పారితోషికం ఇవ్వలేదు. ఇప్పటికే నాలుగుసార్లు పారితోషికం సొమ్ము విడుదలైంది. ఆ సొమ్మును ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం ఆయా విభాగాలకు పంపారు. హెచ్‌ఓడీలు, వైద్యులు, నర్సులు పారితోషికం సొమ్మును తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నారు. ల్యాబ్‌, ఎక్స్‌రే, స్కానింగ్‌ విభాగాల టెక్నీషియన్లకు మాత్రం ఇవ్వలేదు. పెథాలజీ విభాగంలో మొత్తం 13 మందికి ఆరోగ్యశ్రీ పారితోషికం మంజూరైంది. అందులో హెచ్‌ఓడీలతోపాటు 8 మంది వైద్యులకు కేటగిరీల వారీగా వచ్చిన సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో నలుగురు టెక్నీషియన్ల పేర్లున్నాయి.


వారికి ఎంత పారితోషికం వచ్చిందో హెచ్‌ఓడీ చూస్తూ వారి బ్యాంకు ఖాతా నెంబర్లను బిల్లుతోపాటు పంపారు. ఒక్కో విడతలో రూ.15,117, మూడోసారి రూ.16160 వచ్చినట్లు చూపించారు. ఆ సొమ్ము మాత్రం టెక్నీషియన్ల ఖాతాల్లోకి జమకాలేదు. ఇలా ఒక్కొక్కరికి మూడు విడతల్లో కలిపి, రూ.45 వేలకుపైగా పారితోషికం సొమ్ము అందాల్సి ఉంది. రెండేళ్లుగా అడుగుతున్నా.. వారికి పైసా కూడా జమ చేయలేదు. ఆ సొమ్ము ఉందా.. పక్కదారి పట్టిందా అనే దానిపై ఆస్పత్రిలో చర్చ సాగుతోంది. కొన్ని నెలలుగా ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్లను కలిసి, గోడు వెల్లబోసుకుంటున్నా టెక్నీషియన్లపై ఎవరూ కనికరించట్లేదు. ఇటీవల పెథాలజీ విభాగ టెక్నీషియన్లు ఓబుళప్రసాద్‌, దేవేంద్రప్రసాద్‌, ప్రభాకర్‌, రవికుమార్‌.. సూపరింటెండెంట్‌ను కలిసి, న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. రేడియాలజీ విభాగ టెక్నీషియన్లకు కూడా రెండేళ్లలో ఒకసారి మాత్రమే పారితోషికం ఇచ్చారు. ఆ తర్వాత పైసా కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఇలా జిల్లా సర్వజనాస్పత్రిలో ఆరోగ్యశ్రీ పారితోషికం సొమ్ము మాయమవటం చర్చనీయాంశంగా మారింది.


పనిచేసిన వారి పేర్లు హెచ్‌ఓడీలు పంపాలి.. రామస్వామి నాయక్‌, సూపరింటెండెంట్‌

శస్త్రచికిత్సల సమయంలో పనిచేసిన వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పారితోషికం వస్తుంది. పనిచేసిన వారి పేర్లను హెచ్‌ఓడీలు పంపాల్సి ఉంటుంది. ఆ మేరకు పారితోషికం సొమ్ము కేటాయిస్తాం. టెక్నీషియన్లకు రెండేళ్లుగా పారితోషికం అందలేదంటున్నారు. బిల్లుల్లో చూపుతున్నారని చెబుతున్నారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. టెక్నీషియన్లకు సొమ్ము వచ్చి ఉంటే అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-06-05T09:46:20+05:30 IST