గామన్‌ బ్రిడ్జి పక్కనే ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2021-01-17T06:26:54+05:30 IST

గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌ చేయకూడదు. అది పర్యావరణానికి తీవ్ర నష్టం. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఏ అనుమతి లేకుండా సుమారు 15 డ్రెడ్జింగ్‌ యంత్రాలతో గోదావరిలోంచి ఇసుక తోడేసి, రేవుల్లో యంత్రాలతో లారీలకు ఎగుమతి చేసి రూ.కోట్లు దోచేస్తున్న వైనమిది.

గామన్‌ బ్రిడ్జి పక్కనే ఇసుక దోపిడీ

 కాతేరులో యథేచ్ఛగా తవ్వకాలు

రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనం

 రేవుల్లోనే లారీల్లోకి యంత్రాలతో ఎగుమతి

 ఏడీఎస్‌లూ చేతివాటం ప్రదర్శన

 స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏమైందో? 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌ చేయకూడదు. అది పర్యావరణానికి తీవ్ర నష్టం. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఏ అనుమతి లేకుండా సుమారు 15 డ్రెడ్జింగ్‌ యంత్రాలతో గోదావరిలోంచి ఇసుక తోడేసి, రేవుల్లో యంత్రాలతో లారీలకు ఎగుమతి చేసి రూ.కోట్లు దోచేస్తున్న వైనమిది. దివాన్‌చెరువు మీద నుంచి కొవ్వూరు వైపు వెళ్లే గామన్‌ బ్రిడ్జి మీద నుంచి వెళ్లే వేలాదిమంది కళ్లెదుటే ఈ దారుణం జరిగిపోతోంది. రాజమహేంద్రవరంలో ఇసుక అక్రమాలు అరికట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉన్నప్పటికీ, ఈ అధికారుల దృష్టిలో సదరు ఇసుక అక్రమాలు పడకపోవడం విశేషం. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పరిధిలో కాతేరు గ్రామ పరిధిలోకి వచ్చే గామన్‌బ్రిడ్జి సమీపం నుంచి వెంకటనగరం వైపు గోదావరిలో ఏకంగా గామన్‌ బ్రిడ్జికి అతి సమీపంలోనే ఈ డ్రెడ్జింగ్‌ జరుగుతోంది. వాస్తవానికి ఇక్కడ పడవల మీద ఇసుక తీసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. ఇక్కడ కాతేరు -1,2,3 అనే మూడు ర్యాం పులు ఉన్నాయి. ఈ ర్యాంపులను దక్కించుకున్న వ్యక్తులు ఏకంగా సుమారు 15 డ్రెడ్జింగ్‌ యంత్రాలను గోదావరిలో ఏర్పాటు చేసి, వాటి ద్వారా పెద్ద పడవలోకి ఇసుక తోడేస్తున్నారు. కొన్ని గంటల్లోనే లారీల కొద్దీ ఇసుకను తోడేస్తున్నారు. గోదావరిలో ఇసుకతోపాటు, ఇటీవల ఏర్ప డిన లంకలను కూడా తవ్వేస్తున్నారు. అంతేకాక డ్రెడ్జింగ్‌ యంత్రాలు బిగించిన పడవలలోకి ఇసుక లోడ్‌ చేసి, వాటిని  ఒడ్డుకు చేసి, ర్యాంపు లోని యంత్రాలతో లారీలకు ఎగుమతి చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ పడవల మీద ఇసుక తీసుకుని, కాతేరు గ్రామ పరిధిలో నిల్వ చేసి అక్కడ నుంచి అమ్మాలి. కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో  అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై తెగ దోచేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ బాగోతం జరుగుతున్నట్టు స్థానికుల కథనం. ఇప్పటికే ఈ ఇసుక డ్రెడ్జింగ్‌ ద్వారా రూ.కోట్లు దోచేసినట్టు అంచనా. ఇక్కడ వ్యాపా రులు, అధికారులు గుడారాలు వేసుకుని కూర్జుని దర్జాగా దోపిడీ కాని స్తున్నారు. 18 టన్నుల ఇసుకను ఏకంగా రూ.8 వేలకు ఇక్కడ విక్రయి స్తున్నారు. రవాణాచార్జీలతో కలుపుకుని బయటకు వెళ్లేసరికి దూరమైతే రూ.20 వేల నుంచి రూ.30 వేలు దాటేస్తోంది. వాస్తవానికి పెద్ద లారీల్లో 18 టన్నుల ఇసుక మాత్రమే ఎగుమతి చేయాలి. ఇక్కడ ఏకంగా 25 టన్నుల వరకూ లోడ్‌ చేసేస్తున్నారు. దానికి మరింత అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.  మనుషులతో అయితే ఒక పడవ ఇసుక తీయడానికి కొన్ని గంటలు పడుతుంది. కానీ డ్రెడ్జింగ్‌ యంత్రాలతో క్షణాల్లోనే పడవలు నింపేస్తున్నారు. అంతే వేగంగా యంత్రాలతో లారీలకు ఎగుమతి చేస్తున్నారు. నిజానికి ‘ఇంటింటికీ ఇసుక సరఫరా’ అనే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఇంకా అదే అమలులో ఉంది. వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకుంటారు. అతనికి ఇచ్చిన రశీదు మీద, ర్యాంపు నిర్వాహకులు నాలుగైదు లారీలను తప్పించేస్తున్నారు. ఇవేమీ ప్రభుత్వ లెక్కల్లో ఉండవు. అసలు నిబంధనలకు విరుద్ధంగా తవ్వడం,  యంత్రాలతో ఎగుమతి చేయడం, ఒక రశీదుపై నాలుగైదు లారీల ఇసుకను తప్పించడం వెనుక అధికారుల హస్తమూ ఉంది. ముఖ్యంగా అసిస్టెంట్‌ ఇసుక అధికారులు (ఏడీఎస్‌)లు కూడా ఇసుక లావాదేవీల్లో ఆరితేరారు. ఇంటింటికి డోర్‌ డెలివరీ పేరుతో బుక్‌ చేసిన వినియోగదారుల రశీదులు మార్చేసి మరీ దోపిడీ చేస్తున్నారు. ఒక వినియోగదారుడు ఒక ర్యాంపు నుంచి ఇసుక సరఫరా చేయమని కోరి, దానికి సరిపడ డబ్బు చెల్లిస్తాడు. కానీ ఈ ఏడీఎస్‌లు అక్కడ ఇసుక లోడు కావడం లేదనే కారణం చూపి,  ఆ ర్యాంపును రద్దు చేసినట్టు చూపి, ఈ వినియోగదారుడికి మరింత దగ్గరయ్యే ర్యాంపులో ఇసుక బుక్‌  చేసి నట్టు చెబుతారు. కానీ ఇక్కడ వినియోగదారుడు అదనంగా చెల్లించిన రవాణా చార్జీలను కాజేస్తారు. ఇది వినియోగదారుడికి తెలియదు. ఇలా చాలా దోపిడీ జరుగుతోంది. ఇక ఇసుక అక్రమాలు ఆపడానికి ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరంలో ఒక ఆఫీసు, దానికి అధికారులు ఉన్నారు. కానీ గోదావరి నాల్గవ బ్రిడ్జి (గామన్‌ బ్రిడ్జి) దగ్గరే ఇసుక డ్రెడ్జింగ్‌ జరుగుతుంటే ఈ అధికార్లకు తెలియకపోవడం గమనార్హం. ఇటీవల ఈ అధికారుల మీద కూడా ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. ధవళేశ్వరం ఇరిగేషన్‌ కార్యాలయంలో సోమవారం ఏసీబీ సోదాలు, ఒక ఉద్యోగిని అరెస్టు చేయడం వెనుక కూడా ఇసుక వ్యవహారం ఉన్నట్టు సమాచారం. ఉభయగోదావరి జిల్లాలో ఒత్తిడికి, డబ్బుకు లొంగి 30 ర్యాంపుల వరకూ అనుమతి ఇచ్చినట్టు ఆరోపణ ఉంది.  ఇటీవల  కోనసీమలోని పి.గన్నవరంలో కూడా డ్రెడ్జింగ్‌లో దోపిడీ చేస్తే, చాలారోజులకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్పందించడం గమనార్హం.  



Updated Date - 2021-01-17T06:26:54+05:30 IST