Abn logo
Dec 1 2020 @ 01:58AM

సంగ్రామ.. సరంజామా

నేడే గ్రేటర్‌ వార్‌

ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం

సాయంత్రం 6 గంటలకు ముగింపు

పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు

ఉదయం 6 గంటలకు మాక్‌ పోలింగ్‌

మాస్క్‌ ధరించి రావాల్సిందే.. ఓటర్‌దే బాధ్యత అంటున్న అధికారులు

పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతులు కరువు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి) :

పాలకులు ఎవరో..? పరాజితులు ఎవరో..? అనేది నేడు ఓటర్లు తేల్చనున్నారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో గ్రేటర్‌ ఓటర్‌ తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. డీఆర్‌సీ కేంద్రాల నుంచి 9,101 పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు సోమవారం తరలించారు. గ్రేటర్‌లోని 150 డివిజన్లకు 1,122 మంది పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌-150, బీజేపీ-149, కాంగ్రెస్‌- 146, టీడీపీ- 106, ఎంఐఎం-51, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీలు-76, స్వతంత్రులు - 415 మంది బరిలో ఉన్నారు. అత్యధికంగా జంగమ్మెట్‌లో 20 మంది పోటీ చేస్తున్నారు. ఉదయం 6 గంటల వరకే పోలింగ్‌ ఏజెంట్లు కేంద్రానికి చేరుకోవాలని గ్రేటర్‌ ఎన్నికల అధికారి డీఎస్‌ లోకేష్‌కుమార్‌ సూచించారు. ఏజెంట్ల సమక్షంలో ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించి.. 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ మొదలు పెడతారు. గ్రేటర్‌లో 74.44 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రతి 1000 మందికో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. గతంలో 1400 మంది ఓటర్లకో పోలింగ్‌ బూత్‌ ఉండేది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 21 గుర్తింపు కార్డుల్లో ఏది చూపైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కరోనా పాజిటివ్‌ కేసులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించారు. ఇటీవల కరోనా సోకి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోని వారి కోసం ప్రత్యేక లైన్లు ఉంటాయని లోకేష్‌కుమార్‌ చెప్పారు. సాయంత్రం 6 గంటలలోపు లైనులో ఉన్న వారికి  ఆ తరువాత కూడా ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. 


పోలింగ్‌ కేంద్రాలకు బాక్సులు...

బ్యాలెట్‌ బాక్సులు పోలింగ్‌ కేంద్రాలకు చేరాయి. సిబ్బంది గైర్హాజరు నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి వరకు బ్యాలెట్‌ బాక్సుల అప్పగింత, తరలింపు ప్రక్రియ సాగింది. గ్రేటర్‌లోని 30 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల విధుల్లో 36,404 మంది పాల్గొంటున్నారు. బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సిబ్బందిని తీసుకెళ్లేందుకు బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు. రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన డీఆర్‌సీ కేంద్రం వద్ద సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. బ్యాలెట్‌ బాక్సులను వాహనాల్లో వేసేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో లేరని, భోజనం సరిగా లేదని పీఓ, ఏపీఓలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబ్బంది అందుబాటులో లేరు.. సహకరించాలని రిటర్నింగ్‌ అధికారులు కోరడంతో సిబ్బంది శాంతించారు. 


మాస్క్‌ ధరించి రావాల్సిందే...

కొవిడ్‌- 19 వ్యాప్తి నేపథ్యంలో ఓటర్లు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి రావాలని జీహెచ్‌ఎంసీ కోరింది. శానిటైజర్లు మాత్రమే తాము అందుబాటులో ఉంచుతున్నామని, మాస్క్‌లు మాత్రం పౌరులే తీసుకొని రావాలని సూచించారు.


వసతులు కరువు...

పలు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతులు సరిగా లేవు. అల్లాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా పలు ప్రాంతాల్లో మార్కింగ్‌ చేయలేదు. మాదాపూర్‌, హఫీజ్‌పేటల్లోనూ అదే పరిస్థితి. వివేకానందనగర్‌ కాలనీలో టెంట్‌ ఏర్పాటుచేసి.. మార్కింగ్‌ చేసినా.. సర్కిళ్ల వద్ద దూరం తక్కువగా ఉంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతుల లేమితో ఓటర్లే కాకుండా.. పోలింగ్‌ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. సుభాష్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో 30 మంది పోలింగ్‌ సిబ్బంది ఉండగా.. మహిళలు, పురుషులకు ఒకే మరుగుదొడ్డి ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


Advertisement
Advertisement