Abn logo
Jun 1 2020 @ 14:32PM

ఆమె కోసమే ప్రత్యేకంగా పడవ.. కేరళలో హాట్‌టాపిక్‌గా మారిన ఘటన

అలప్పూజ(కేరళ): కేవలం ఓ స్కూలు విద్యార్థిని కోసం మూడేళ్లపాటు ఓ రిమోట్ రైల్వే స్టేషన్‌ను జపాన్ ప్రభుత్వం నడిపిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇటీవల కేరళలో జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని కోసం రెండు రోజుల పాటు కేరళ రాష్ట్ర నీటి సరఫరా సంస్థ(ఎస్‌డబ్ల్యూటీడీ) 70మంది కూర్చొనే ఓ పడవను నడిపింది. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుండడంతో ఎస్‌డబ్ల్యూటీడీ ప్రశంసలందుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలప్పూజ జిల్లా ఎమ్ఎన్ బ్లాక్ ప్రాంతానికి చెందిన సాండ్రా అనే ఓ పదహేడేళ్ల అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపుల కారణంగా వాయిదా పడిన ఇంటర్ పరీక్షల కోసం తాజాగా తేదీలు విడుదలయ్యాయి. కానీ తన స్కూలుకు వెళ్లడానికి సాండ్రాకు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. రోజూ పనికి వెళ్లనిదే.. పూట గడవని పరిస్థితి సాండ్రా కుటుంబానిది. 


పరీక్షలు ఎలాగైనా రాయాలని నిశ్చయించుకున్న సాండ్రా కేరళ రాష్ట్ర నీటి సరఫరా సంస్థను సంప్రదించింది. వారికి తన దుస్థితి గురించి వివరించింది. సాండ్రా అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ఎస్‌డబ్ల్యూటీడీ ఆమె కోసం ప్రత్యేకంగా ఓ పడవను ఏర్పాటు చేసింది. ప్యాసింజర్ ఒకరే అయినా.. నిర్వహణ పట్ల ఎస్‌డబ్ల్యూటీడీ అధికారులు నిర్లక్ష్యం వహించలేదు. ఎప్పటిలాగే పడవ నిర్వహణకు అవసరమయ్యే ఐదుగురు సిబ్బంది(డ్రైవర్, నావిగేటర్, బోట్ మాస్టర్, ఇద్దరు సహాయకులు)ని పంపించింది. శుక్రవారం, శనివారం జరిగిన పరీక్షల కోసం సాండ్రాను ఎమ్ఎన్ బ్లాక్ నుంచి కొట్టాయంలోని కంజిరామ్ వరకు తీసుకెళ్లి.. ఆమె పరీక్ష అయిపోయేంత వరకు అక్కడే ఉండి.. తిరిగి ఇంటికి తీసుకొచ్చేవారు. 


‘నేను పరీక్షలు రాయలేననుకున్నాను. స్కూలుకు వెళ్లాలంటే నాకు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. పరీక్షలు ఎలాగైనా రాయాలనుకుని.. ఎస్‌డబ్ల్యూటీడీను సంప్రదించాను. వారికి నా పరిస్థితి వివరించడంతో.. వారు సానుకూలంగా స్పందించారు. వారి స్పందనతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నా సంతోషాన్ని ఇతరులతో ఎలా పంచుకోవాలో కూడా తెలియడం లేదు’అని సాండ్రా తెలిపింది.


ప్రశంసలందుకుంటోన్న నీటి సరఫరా సంస్థ

ఉదయం 11.30 గంటలకు సాండ్రా నివాస ప్రాంతం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఆమె చదివే ఎస్ఎన్‌డీపీ హయ్యర్ సెకండరీ స్కూలు ఉండే ప్రాంతానికి చేరేవారు. సాండ్రా పరీక్ష అయిపోయేంత వరకు అక్కడే ఉండి.. తిరిగి సాయంత్రం 4గంటలకు ఆమెను ఇంటికి చేర్చేవారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి అందరికీ తెలియడంతో ఎస్‌డబ్ల్యూటీడీ ప్రశంసలందుకుంటోంది. ‘సాండ్రా మమ్మల్ని సంప్రదించిన వెంటనే... మేము మరో ప్రత్యామ్నాయ మార్గం గురించి ఆలోచించలేదు.. ఆమె పరీక్ష రాసేందుకు మేం సాయం చేయాలని నిర్ణయించుకున్నాం.. ఎందుకంటే నా కూతురు కూడా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. కాబట్టి ఆమె పరిస్థితి నాకు వెంటనే అర్థమయిపోయింది. సాండ్రాకు పడవను ఏర్పాటు చేయడంలో మా రాష్ట్ర మంత్రి కూడా సహాయం చేశారు. పడవ నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది రాకుండా 5మంది సిబ్బందిని పంపగలిగాము’అని ఎస్‌డబ్ల్యూటీడీ డైరెక్టర్ షాజీ వీ నాయర్ తెలిపారు. 


కేఏ సంతోష్ కుమార్ అనే అధికారి మాట్లాడుతూ మేము ఏర్పాటు చేసిన పడవను ఓ సింగిల్ ట్రిప్ నడిపితే రూ.4వేలు వసూలు చేస్తాము.. కానీ సాండ్రా పరిస్థితి అర్థం చేసుకుని సింగిల్ ట్రిప్‌కు రూ.9 మాత్రమే తీసుకుని, ఒకరోజుకు మొత్తం రూ.18 వసూలు చేశామన్నారు. 
Advertisement
Advertisement