వంటైనా చేస్తాం.. ఉద్యోగం ఇవ్వండి మహాప్రభో!

ABN , First Publish Date - 2021-07-29T06:29:48+05:30 IST

వసతిగృహాల్లో విద్యార్థులకు వంట చేసి పెట్టే కుక్‌ ఉద్యోగం అది. జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఐదు కుక్‌పోస్టులను భర్తీ చేయనున్నారు.

వంటైనా చేస్తాం.. ఉద్యోగం ఇవ్వండి మహాప్రభో!
దరఖాస్తు హార్డ్‌ కాపీలు ఇచ్చేందుకు ఒంగోలు ప్రగతి భవన్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులు

కుక్‌ పోస్టు కోసం ఇంజనీరింగ్‌, పీజీల దరఖాస్తు

బ్యాక్‌లాగ్‌ పోస్టుల కోసం వేల దరఖాస్తులు

ఒంగోలు నగరం, జూలై 28: వసతిగృహాల్లో విద్యార్థులకు వంట చేసి పెట్టే కుక్‌ ఉద్యోగం అది. జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఐదు కుక్‌పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఐదింట్లో ఎస్సీలకు మూడు,  ఎస్టీలకు రెండు పోస్టులను కేటాయించారు. వీటితో పాటు 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసి ఈనెల 25 తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో వంటమనిషి పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి చదవటం, రాయటం వచ్చి ఉంటే చాలు.. ఎలాంటి విద్యార్హత అవసరం లేదని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఏకంగా ఇంజనీరింగ్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, డిగ్రీ చదివిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత పదవుల్లో స్థిరపడాలని ఇంజనీరింగ్‌ చదువులు చదివిన వారు కూడా ఈ కుక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. కుక్‌ పోస్టుకు 12మంది ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారు, తొమ్మిది మంది పీజీ పూర్తి చేసిన వారు, 83మంది డిగ్రీ పూర్తిచేసిన వారు, హోటల్‌ మేనేజ్‌మెంటు చేసిన వారు ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ డిప్లమో చదివిన 8 మంది, ఐటీఐ టెక్నికల్‌ కోర్సు చేసిన వారు 17మంది, ఇంటర్‌ 181 మంది, టెన్త్‌ 597 మంది, ఏడవ తరగతి చదివిన వారు 317మంది, ఐదవ తరగతి చదివిన వారు 147మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఐదు కుక్‌ పోస్టులకు అధికారులకు 1,374 దరఖాస్తులు అందాయి. అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న మొత్తం 59 పోస్టులకు 13,326 దరఖాస్తులు అందాయి.  వీటిలో మహిళా డ్రైవర్‌ పోస్టులకు మాత్రమే పోటీ తక్కువగా ఉంది. 



Updated Date - 2021-07-29T06:29:48+05:30 IST