లక్ష మెజారిటీ ఇవ్వండి

ABN , First Publish Date - 2020-09-19T10:07:57+05:30 IST

దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు లక్ష ఓట్ల మెజారిటీ అందిస్తే దుబ్బాక అభివృద్ధికి తానే బాధ్యత వహిస్తానని మంత్రి

లక్ష మెజారిటీ ఇవ్వండి

కేసీఆర్‌కు దండం పెట్టి నిధులు తెస్తా 

దుబ్బాక అభివృద్ధి భరోసా నాదే 

రెండో స్థానం కోసమే కాంగ్రెస్‌, బీజేపీ పోటీ 

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


మిరుదొడ్డి, సెప్టెంబరు 18: దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు లక్ష ఓట్ల మెజారిటీ అందిస్తే దుబ్బాక అభివృద్ధికి తానే బాధ్యత వహిస్తానని మంత్రి తన్నీరు హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సెన్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మిరుదొడ్డిలో పార్టీ విద్యార్థి, యువత, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి తాగునీరు అందించామని, ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ విజయం ఎప్పుడో ఖాయమైందని, రెండో స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీలు కొట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలకు భవిష్యత్తులో డిపాజిట్‌లు వస్తాయోలేదో తెలుసుకోవడానికే ఉపఎన్నికలు ఉపయోగపడతాయన్నారు. దుబ్బాక అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందన్నారు.


కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్‌ను నింపి, నియోజకవర్గానికి లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరును అందిస్తున్నట్లు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. కేంద్రప్రభుత్వం రైతుల నడ్డివిరిచే విధంగా బోరుబావుల వద్ద మీటర్లను ఏర్పాటు చేసిందన్నారు. దాన్ని వ్యతిరేస్తున్న టీఆర్‌ఎ్‌సకు ఓటేసి బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమే పెన్షన్లు ఇస్తున్నదని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో 56 వేల 906 పెన్షన్లు ఉన్నాయని, ఇటీవల కొత్తగా 5,877 పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో వచ్చే నాయకులకు దుబ్బాకపై ప్రేమ ఉండదని, తాము ప్రజల సంక్షేమాన్ని దష్టిలో పెట్టుకుని పనిచేస్తామని గుర్తు చేశారు. అనంతరం  ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ పారూఖ్‌హుస్సేన్‌ మాట్లాడుతూ.. దుబ్బాకను మంత్రి హరీశ్‌రావు అన్ని తానై అభివృద్ధి చేస్తారని చెప్పారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు.  


అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

అక్బర్‌పేట గ్రామంలో పంచాయతీరాజ్‌ అతిథి గృహాన్ని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. రెండు 108  అంబులెన్స్‌లను ప్రారంభించారు. అంతకుముందు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మండలంలోని అల్మా్‌సపూర్‌, బేగంపేట, లింగుపల్లి, కూడవెళ్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాగా అక్బర్‌పేట గ్రామాన్ని మండలకేంద్రంగా ఏర్పాటు చేయాలని మంత్రికి గ్రామస్థులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ సాయిలు, జడ్పీటీసీ లక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షుడు రాజులు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్‌రాజు, ఎంపీటీసీల ఫోరం అఽధ్యక్షుడు బాలమల్లేశం, మాజీ ఎంపీపీ భాస్కరచారి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ బాపురెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌రెడ్డి బీమసేనా, దుబ్బరాజం, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


బోనాలు, మంగళహారతులతో స్వాగతం 

రాయపోల్: మండలంలోని వీరారెడ్డిపల్లి, ముంగాజ్‌పల్లి, సయ్యద్‌నగర్‌ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శుక్రవారం మంత్రి హరీశ్‌రావు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. గొల్లపల్లి, ఉదయపూర్‌ గ్రామాల్లో టీఆర్‌ఎ్‌సకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి మంత్రికి అందజేశారు. పలువురు టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఉదయపూర్‌లో బోనాలు, మంగళహార తులతో మంత్రికి స్వాగతం పలికారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎ్‌సతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. వర్షంలోనూ మంత్రి కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


రోడ్ల నిర్మాణాలకు రూ.12 కోట్లు 

దౌల్తాబాద్‌ : దుబ్బాక నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణాలకు రూ.12 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు  మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ.3 కోట్ల వ్యయంతో మిరుదొడ్డి మండలం ధర్మారం నుంచి తొగుట మండలం వెంకట్రావుపేట, రూ.2 కోట్లతో తొగుట మండలం మెట్టు నుంచి దౌల్తాబాద్‌, రూ.కోటితో దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లి నుంచి వర్గల్‌ మండలం నాచారం, రూ 2.5కోట్లతో భూంపల్లి నుంచి దౌల్తాబాద్‌ మండలం దొమ్మాట, రూ.30లక్షలతో ఇనగుర్తి బ్రాంచ్‌రోడ్‌, రూ1.2కోట్లతో భూంపల్లి నుంచి లింగుపల్లి, రూ.60 లక్షలతో మెట్టు నుంచి దౌల్తాబాద్‌ తిమ్మాపూర్‌ వయా పద్మనాభునిపల్లి, రూ.60లక్షలతో రుద్రారం నుంచి ఖాజీపూర్‌ కల్వకుంట, రూ.80 లక్షలతో దౌల్తాబాద్‌ మండలం మొండి చింత నుంచి బేగంపేట్‌కు తారు రోడ్డుల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.


అనంతరం దౌల్తాబాద్‌ మండలం గువ్వలేగి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోవిందాపూర్‌లో రూ.7 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న గోదామును మంత్రి హరీశ్‌రావు, ఏంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి ప్రారంభించారు. డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ.8 లక్షలు అదనంగా నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. కోనాయపల్లిలో రూ.20 లక్షల నిధులతో పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన స్థాపన చేశారు. ఇందుప్రియాల్‌లో రూ.75 లక్షల వ్యయంతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.15 లక్షల వ్యయంతో మత్స్యకారుల కార్మిక భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. గువ్వలేగి గ్రామంలో ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌ పార్టీకే అంటూ చేసిన ఏకగ్రీవ తీర్మాన ప్రతులను మంత్రికి అందించారు. గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో చేప్టనున్న బీడీ కార్మికుల ఖార్కనా భవనానికి ఏంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. 

Updated Date - 2020-09-19T10:07:57+05:30 IST