వైభవంగా ఎరువాక పున్నమి

ABN , First Publish Date - 2021-06-25T06:05:04+05:30 IST

పల్లెల్లో పండుగ సందడి నెలకొంది. ఏరువాక పున్నమితో శోభాయమానంగా మారాయి. గురువారం రైతులు ఎద్దులకు స్నానం చేయించి రంగులు, పువ్వులతో అలంకరించారు.

వైభవంగా ఎరువాక పున్నమి
హొళగుందలో ఎద్దులు ఆపే ఆట ఆడుతున్న దృశ్యం

పల్లెల్లో పండుగ సందడి నెలకొంది. ఏరువాక పున్నమితో శోభాయమానంగా మారాయి. గురువారం రైతులు ఎద్దులకు స్నానం చేయించి రంగులు, పువ్వులతో అలంకరించారు. దేవాలయాలకు తోలుకెళ్లి పూజలు నిర్వహించారు. రుచికరమైన పిండి వంటలు ఎద్దులకు తినిపించారు. జిల్లా అంతటా సేద్యపు వేడుకలు జరిగాయి. 


ఎమ్మిగనూరు, జూన్‌24: ఎమ్మిగనూరు మండలం లోని గ్రామాల్లో గురువారం ఏరువాక పౌర్ణమిని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని గుడికల్లు, కందనాతి, కడివెళ్ల, కడిమెట్ట, రాళ్లదోడ్డి, పార్లపల్లి, దైవందిన్నే, కే తిమ్మాపురం, కలుగొట్ల, సోగనూరు, కొటేకల్లు, బనవాసి, దేవిబెట్ట, మల్కాపురం గ్రామాల్లో ఏరువాక పౌర్ణమిని ప్రజలు జరుపుకున్నారు. 


గోనెగండ్ల:  గోనెగండ్ల, మండలంలోని ఇతర పల్లెల్లో గురువారం ఎరువాక పున్నమి వేడుకలు రైతులు  ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే రైతులు ఎద్దులను అలంకరించి పూజలు చేశారు. పిండి వంటలు చేసి వృషభాలకు నైవేద్యం పెట్టారు. ఎద్దుల ఊరేగింపు చేసి గ్రామ చావిడిల దగ్గర తోరణాలు తెంపే పందెం నిర్వహించారు. వీరశైవ మఠం పీఠాధిపతి శివయ్యస్వామి వృషాభాలకు ప్రత్యేక పూజలు చేశారు.  ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెఇ్డ ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.


కోసిగి: కోసిగి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతులు  పొలాలకు వెళ్లి పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. అనంతరం ఎద్దులను ముస్తాబు చేసి.. ర్యాలీగా డప్పు వాయిద్యాల మధ్య గ్రామాల్లో ఊరేగించారు. సాయంత్రం ఎద్దుల పరుగు పందెం నిర్వహించారు.


హొళగుంద: ఏరువాక పౌర్ణమిని రైతులు గురువారం పండుగలా నిర్వహించారు. హొళగుందలో ఉదయమే ఎద్దులకు స్నానాలు చేయించి రంగులు అద్ది పూలతో ప్రత్యేకంగా అలంకరించి, గుడికి తీసుకొని వెళ్లి పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామ వాకిలి వద్ద ఎద్దులు పారే  ఆట నిర్వహించి, అనంతరం ఊరేగింపు నిర్వహించారు. 


పెద్దకడబూరు: మండలంలోని అన్ని గ్రామాల్లో ఏరువాక పున్నమి వేడుకలు పండుగలా జరుపుకున్నారు. ఎద్దులకు స్నానాలు చేయించి రంగులతో ముస్తాబు చేశారు. వ్యవసాయ పనిముట్లుకు పూజలు చేసి పొలం పనులు జరుపుకున్నారు. సాయంత్రం ఎద్దులను ఊరేగించారు. పుష్కలంగా వర్షాలు కురవాలని ఏరువాక పున్నమి నిర్వహించడం ఆనవాయితీ. 


నందవరం: మండలంలో ఎరువాక పండుగను గురువారం వైభవంగా జరి పారు. ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజ లు చేశారు. సాయంత్రం ఎద్దుల పారువేట నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో గెలిచిన ముగతి గ్రామంలోని కోటేశ్వరరావు  ఎద్దులు  ఊరేగింపుగా వెళ్లి గ్రామ చావిడి  దగ్గర ఎద్దుల బల ప్రదర్శనలో పాల్గొన్నాయి.  సర్పంచ్‌ విరుపా క్షిరెడ్డి, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, రాఘవరెడ్డి, తారక రామారావు, జయరాముడు, ఉసేని, ఉరుకుందు, రాజు పాల్గొన్నారు. 


ఆదోని రూరల్‌: మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు ఏరువాక పౌర్ణమిను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ఎద్దులను రంగులు, తోరణాలతో ముస్తాబు చేశారు. మరికొంత మంది రైతులు తమ వృషభాలను పార్టీ జెండాలతో ఆకర్షణీయంగా అలంకరించారు.  సాయంత్రం గ్రామాల నడిబొడ్డున ఎద్దుల పోటీలు నిర్వహించారు. 


 ఏరువాకలో ఘర్షణ


 మండలంలోని నారాయణపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి ఎద్దుల పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్‌ సరళమ్మ భర్త ఎద్దుల పోటీల్లో గెలిచిన ఎద్దులకు రూ.5 వేలు బహుమానం ఇస్తామని ముందు గానే ప్రకటించారు.  ఈ పోటీల్లో గ్రామానికి చెందిన ఖజ్జి రమేష్‌ ఎద్దు గెలిచింది. అయితే ఆ ఎద్దు పోటీ మధ్యలో  పాల్గొందని మళ్లీ  పోటీ నిర్వహించాలని ఆలం రామచంద్రారెడ్డి  వర్గీయులు వాదనకు దిగారు. ఇది ఘర్షణగా మారి  రాళ్లు విసురుకున్నారు. ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి సిబ్బందితో గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

Updated Date - 2021-06-25T06:05:04+05:30 IST