Abn logo
Oct 27 2021 @ 02:00AM

గోల్డ్‌ గ్యాంబ్లింగ్‌!

గోల్డ్‌ గ్యాంబ్లింగ్‌!

పోలీసుల అదుపులో బంగారు పిచ్చుక!

మళ్లీ మొదటికి వచ్చిన చౌకబంగారం కేసు

రాజకీయ రంగు పులుముకుంటున్న వైనం 

కొందరిని విచారిస్తున్నామని పోలీసుల ధ్రువీకరణ

చీరాల, అక్టోబరు 26 : చీరాలలో సంచల నం సృష్టించిన చౌక బంగారం కేసు మరలా మొదటికొచ్చింది. అందులో పాత్రధారులు, సూత్రధారుల మధ్య జరిగిన ప్రైవేటు పంచాయితీ ఒక కొలిక్కి రాకపోవటం అందుకు కారణమైంది. ఈ నేపఽథ్యంలో బాధితుల్లో ఒకరైన చైతన్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రధాన నిందితుడితో భాగస్వామి అయిన ఆర్యవైశ్య యువనేత అనిల్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కొందరు, పరారీలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. రెండురోజుల నుంచి అతని దుకాణం తెరవకపోవటం పుకార్లకు బలాన్నిస్తోంది. మరోపక్క ఈ కేసు రాజకీయరంగు పులుముకుంటోంది. పాలక, ప్రతిపక్షాల నేతలతో రాయబేరాలు నడిపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను బయటపడేందుకు అవి ఉపయోగపడతాయని అనిల్‌ తన సన్నిహితులు దగ్గర చెప్తున్నాడని తెలిసింది.


అసలేం జరిగింది ...

చీరాలకు చెందిన రవితేజకు తెనాలికి చెందిన ఓ వ్యక్తితో బంగారు బిస్కెట్ల విక్రయాలకు సంబంధించి పరిచయం ఏర్పడింది. దీంతో రవితేజ తాను కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నానని స్థానికంగా పలువురిని నమ్మించాడు. ఈక్ర మంలో అనిల్‌, సాయిచంద్ర, అవినాష్‌ తదితరులు రవితేజతో జత కలిశారు.


ఆ తర్వాత ఏం జరిగింది...

రవితేజ ఒక్కో బంగారం బిస్కెట్‌ (100గ్రాములు)ను మార్కెట్‌ ధరకన్నా రూ.12,000 తక్కువకు ఇచ్చేవాడు. దీంతో అనిల్‌, సాయిచంద్రలు డబ్బు పెట్టుబడి పెడుతూ, కొంతమేర బిస్కెట్లు తీసుకుంటూ, మరికొంతకు వడ్డీగా లెక్కలు కడుతూ వ్యాపారం సాగించారు. ఈక్రమంలో రవితేజ విలాసాలకు తన దగ్గరకు వస్తున్న డబ్బును వెచ్చించటం ప్రారంభించాడు. ఆ దశలో తెనాలిలో రవితేజకు బంగారు బిస్కెట్లు ఇచ్చే వ్యక్తి చనిపోయాడు. దీంతో అతని సహచరునితో రవితేజ లావాదేవీలు ప్రారంభించాడు. కొద్దిరోజులకు బిస్కెట్లు సరఫరా ఆగిపోయింది. దీంతో రవితేజకు డబ్బుచ్చిన వారు ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అతను పరారయ్యాడు.


ఆంధ్రజ్యోతి కథనంతో  వెలుగులోకి ..

ఆంధ్రజ్యోతి మినీలో చౌకబంగారం..! శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఒక్కొక్కరుగా బాధితులు, వాటాదారులు బయటకు వచ్చారు. సాయిచంద్ర అనే వ్యక్తి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రవితేజపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది.  నిందితులు, వాటాదారులు, బాధితుల మధ్యలో పూచీ వ్యవహారం బయటపడింది. తర్వాత రవితేజ బెయిల్‌పై విడుదలయ్యాడు.


తక్కువ ధరకు ఎలా విక్రయిస్తారు...

ప్రతి బిస్కెట్‌కు ధరపై 3శాతం జీఎస్టీ చెల్లించాలి.  తెనాలి వ్యక్తికి బిస్కెట్‌కు రూ.3వేలు కమీషన్‌ చెల్లిస్తారు. ఇక్కడ బిస్కెట్‌ ధరకన్నా రూ.12వేలు తక్కువ విక్రయిస్తారు. మొత్తం మీద ఒక్కో బిస్కెట్‌ను రూ.15వేలు తక్కువకు(జీఎస్టీకాక) రవితేజ అండ్‌కో విక్రయిస్తారు. ఇదెలా సాధ్యమనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 


నంబరు ఉంటే ఎలా... నంబరు లేకుంటే ఎలా...

అన్ని అనుమతులు ఉన్న స్టాండర్డ్‌ బంగారం బిస్కెట్‌కు వీబీసీ (విశాఖ బులియన్‌ కార్పొరేషన్‌) గుర్తింపు ఉంటుంది. దీనిపై వారి సంకేతంగా నిర్ణీత కోడ్‌ నెంబరు ఉంటుంది. చీరాల, గుంటూరు, తెనాలి, ఒంగోలు తదితర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసేందుకు వీబీసీని ప్రామాణికంగా తీసుకుంటారు.  అయితే కస్టమ్స్‌లో పట్టుబడ్డ బంగారం(అనుమతులు లేని ది) తక్కువ ధరకు వస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో మాత్ర మే సాధ్యం. దీనిపై ఎలాంటి నంబర్లు ఉండవు. అయితే రవితేజ ఇచ్చే బంగారం బి స్కెట్లపై నంబరు ఉంటోంది. ఆ బిస్కెట్లు తక్కువకు ఎలా ఇస్తున్నాడని ఒక్కసారి ఆలోచిస్తే గ్యాంబ్లింగ్‌ ఉందన్న విషయం అర్థమవుతుందని  పోలీసులు అంటున్నారు. 


వికటించిన ప్రైవేటు పంచాయితీ

రవితేజ అరెస్టు అనంతరం కొద్దిరోజుల క్రితం ఈ వ్యవహారంలో   కొందరు పెద్దమ నుషులు ప్రైవేటు పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ చౌక బంగారం దందాలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిలో ఒక వ్యక్తి గతంలో చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ వారికి పట్టుబడ్డారు. అతను తనకు రాజకీయ అండ ఉందని, ఎవరూ తన విషయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశాడు. దీంతో ప్రైవేటు పంచాయితీ ఒక కొలిక్కి రాలేదు. దీంతో మరలా కేసు మొదటికి వచ్చినట్లయింది.