నిరుద్యోగులకు శుభవార్త

ABN , First Publish Date - 2021-08-30T04:02:18+05:30 IST

నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ విద్యుత్‌ లైన్‌మెన్‌(గ్రేడ్‌-2) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీచేసింది. తూర్పు పంపిణీ విద్యుత్‌ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలో 398 పోస్టులను భర్తీ చేయనుంది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ ఐదు జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.

నిరుద్యోగులకు శుభవార్త

- గ్రేడ్‌-2 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

- ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో 398 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్‌

- నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 

- పదో తరగతి మార్కుల ప్రామాణికంపై అభ్యర్థుల్లో ఆందోళన

- గతంలో ఇదే విధానంతో వేలాదిమందికి అందని హాల్‌టిక్కెట్లు

- ఈసారి అందరినీ ఎంపికకు పిలవాలని అభ్యర్థన

(టెక్కలి)

నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ విద్యుత్‌ లైన్‌మెన్‌(గ్రేడ్‌-2) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీచేసింది. తూర్పు పంపిణీ విద్యుత్‌ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలో 398 పోస్టులను భర్తీ చేయనుంది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ ఐదు జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. ఐటీఐ ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్‌ ట్రేడ్‌ పూర్తిచేసిన వారిని అర్హులుగా ప్రకటించింది. ఇంటర్‌ ఒకేషనల్‌, ఎలక్ట్రీషియన్‌ అనుబంధ కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశం కల్పించింది. 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారికి ఐదేళ్ల మినహాయింపు ఇచ్చింది. సబ్‌స్టేషన్‌లో షిప్ట్‌ ఆపరేటర్లకు గ్రేడ్‌ పాయింట్లు కల్పించనుంది. జిల్లాలో 835 గ్రామ, 95 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో  సచివాలయానికి ఒకరు చొప్పున గ్రేడ్‌-2 లైన్‌మెన్‌లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. 2019లో తొలిసారిగా గ్రేడ్‌-2 లైన్‌మెన్‌ పోస్టులను భర్తీచేశారు. అప్పట్లో కేవలం 679 మందిని మాత్రమే నియమించారు. అందులో వార్డు సచివాలయాలకు 592మంది, గ్రామ సచివాలయాలకు 87మంది ఎంపికయ్యారు. చాలాచోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో నియామక ప్రక్రియ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పదో తరగతి మార్కులను ప్రామాణికంగా తీసుకోవడంతో వేలాదిమంది ఎంపిక ప్రక్రియకు హాజరుకాలేకపోయారు. కనీసం వారికి హాల్‌టిక్కెట్లు సైతం పంపించలేదు. అప్పట్లో జిల్లావ్యాప్తంగా మూడువేల మంది సచివాలయ గ్రేడ్‌-2 లైన్‌మెన్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ పదో తరగతిలో 58శాతం మార్కుల వరకూ కటాఫ్‌గా నిర్ణయించారు. 1,200 మంది అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు పంపించారు. మిగతా 1,800మందికి మొండిచేయి చూపారు. అప్పట్లో తమకు హాల్‌టిక్కెట్లు ఎందుకు రాలేదో తెలియక వేలాదిమంది అభ్యర్థులు ఆందోళన చెందారు. తీరా పదో తరగతి మార్కులు తక్కువగా వచ్చాయని సాకుగా చూపారని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేక వందలాది మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఐటీఐ విద్యార్హత అన్నప్పుడు.. పదో తరగతిని ప్రామాణికంగా తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.


గాలిలో భద్రత

సచివాలయ గ్రేడ్‌-2 లైన్‌మెన్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే వారికి సచివాలయాల వారీగా నియమించారు. కానీ ఎటువంటి నైపుణ్య శిక్షణ అందించలేదు. మూడురోజుల పాటు ప్రాథమిక స్థాయిలో శిక్షణనిచ్చి చేతులు దులుపుకొన్నారు. విద్యుత్‌ మరమ్మత్తు పనుల్లో భద్రతా చర్యలు ఎలా తీసుకోవాలి అన్నదానిపై అవగాహన కల్పించలేదు. దీంతో గత రెండేళ్లలో ఎంతోమంది గ్రేడ్‌-2 లైన్‌మెన్లు ప్రమాదాల బారిన పడ్డారు. నలుగురి వరకు దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం వీరు లైన్‌ఇన్‌స్పెక్టర్‌, లైన్‌మెన్‌  అండర్‌లో పని చేస్తున్నారు. చాలాచోట్ల వీరితోనే ప్రమాదకర పనులు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు భద్రతా చర్యలు కల్పించాల్సిన అవసరముంది. ఈ విషయమై ట్రాన్స్‌కో డీఈఈ జీఎన్‌ ప్రసాద్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, గతంలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు. 

Updated Date - 2021-08-30T04:02:18+05:30 IST