Abn logo
Sep 18 2021 @ 00:10AM

రాష్ట్రంలో గూండా రాజ్యం

కడపలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

చంద్రబాబుపై దాడి పిరికిపంద చర్య

మీ బూతుల మంత్రిని ఏమిటితో కొట్టాలి

టీడీపీ నేతల ఆగ్రహం

కడప(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 17: ‘‘రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పాలించడం లేదు. గూండా రాజ్యం నెలకొంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటి పైనే సాక్షాత్తు ఎమ్మెల్యే జ్యోగిరమేష్‌ తన అనుచరులతో దాడి చేశారు. ఇది రాష్ట్రంలో చీకటిరోజు. దమ్ము, ధైర్యం ఉంటే.. సమయం చెప్పి వస్తే మీరో మేమో తేల్చుకుందాం’’ అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి సవాల్‌ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి నిరసనగా శుక్రవారం రాత్రి కడపలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వారిద్దరి ఆఽధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రామ్‌ప్రసాద్‌, సుధాకర్‌యాదవ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. కమలాపురంలోని నాలుగురోడ్ల కూడలిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాఽథ్‌శర్మ నేతృత్వంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు ఇంటిపై దాడికి రావాలంటూ వైసీపీ శ్రేణులు వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించి వందల సంఖ్యలో వాహనాల్లో బైలుదేరుతుంటే ఎందుకు పోలీసులు అడ్డుకోలేదని ప్రశ్నించారు. హత్యాచారాలకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళితే అనుమతి లేదంటూ 144 సెక్షన్‌తో అడ్డుకుంటున్నారన్నారు. పోలీసులు పూర్తిగా వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని హిట్లర్‌ పాలన సాగుతోందంటూ మండిపడ్డారు. మీ మంత్రులు దిగజారి దిగజారి మాట్లాడుతున్నారు. సన్నబియ్యం గురించి మాట్లాడితే మీ అమ్మమొగుడు చెప్పాడా అంటూ ఓ మంత్రి మాట్లాడాడు. అతడిని ఏమిటితో కొట్టాలని ప్రశ్నించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటల్లో తప్పులేదన్నారు. ‘‘చెత్తపై, మరుగుదొడ్లపై పన్నులు ఏంటి, కరెంట్‌ బిల్లులు.. అన్ని బిల్లులు పెంచేశారు. నిజంగా ఇది చెత్త ప్రభుత్వమే. బ్రిటీ్‌ష పాలనలో కూడా ఇంత నిర్బంధం లేదు’’ అన్నారు. రాయచోటిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, రైల్వేకోడూరులో విశ్వనాథనాయుడు, బద్వేలులో ఓబలాపురం రాజశేఖర్‌, కడపలో అమీర్‌బాబు తదితరులు వైపీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరుమామిళ్లలో టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 


చంద్రబాబు నివాసంపై దాడిని ఖండిస్తున్నాం

- ఆర్‌.శ్రీనివాసరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు

ప్రతిపక్ష నేత, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబునాయుడు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన అనుచరులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో శాంతిభద్రతలకు వైసీపీ విఘాతం కల్పిస్తూ కుట్రలు ప్రేరేపిస్తూ ప్రతిపక్షంపై ఘర్షణకు పాల్పడుతుంటే, అసలు పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉందా లేక నిద్రపోతోందా..? వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. మా కార్యకర్తలకు చిన్న హాని తలపెట్టినా సహించేది లేదు. చంద్రబాబునాయుడు నివాసంపై దాడికి పాల్పడిన వైసీపీ గుండాలను కఠినంగా శిక్షించాలి.


దాడి చేయడం వైసీపీ దుర్మార్గపు చర్య

- బత్యాల చెంగల్రాయులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నారా చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు గుండాగిరి చేసి రాక్షసత్వంగా కర్రలు, రాళ్లతో దాడి చేయడం దుర్మార్గపు చర్య. చెత్తపై పన్ను వేసే నాయకులను చెత్తపాలకులు అని కాకుండా ఇంకేమనాలి. చెత్త పనులు చేస్తూ చెత్త రాజకీయాలు చేస్తూ చెత్త కూతలు కూసేవారిని చెత్తనాయకులు అనడంలో తప్పేమీ లేదు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైన మారణాయుధాలతో దాడి చేసే సంస్కృతికి రాష్ట్రంలో తెరలేపడం దారుణం. రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితికి ఈ సంఘటన అద్ధం పడుతోంది. రాష్ట్రం రోజుకో సంఘటనతో రావణకాష్టంలా రగిలిపోతుంటే డీజీపీ ఏం చేస్తున్నారు?

కమలాపురంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు