Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజాప్రతినిధులకే అవగాహన లేకపోతే ఎలా?

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై 

గొల్లప్రోలు పరిషత్‌ సమావేశంలో సభ్యుల ఆగ్రహం

గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 5: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులకే అవగాహన లేకుం టే రైతులకు ఏం చెబుతారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లప్రోలు మండల పరిషత్‌ తొలి సాధారణ సమావేశం ఆదివారం ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ అధ్యక్షతన జరిగింది. జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజుతో పాటు పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారు, ధాన్యం ఎలా కొంటున్నారు, మిషన్‌ కోత ధాన్యం కొనుగోలుకు ఉన్న ఇబ్బందులు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీనిపై వ్యవసాయాధికారి నవీన మాట్లాడుతూ వ్యవసాయ అడ్వయిజరీ బోర్డు సమావేశంలో చెబుతున్నామన్నారు. అందులో స్థానిక ప్రజాప్రతినిధులు సభ్యులుగా లేరని సభ్యులు తెలిపారు. కేంద్రాల్లో టీఐలుగా ఎవరిని నియమిస్తున్నారని కొడవలి సర్పంచ్‌ బుర్రా నాగరామచంద్ర ప్రశ్నించారు. దుర్గాడ-3 ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ 250 ఎకరాల్లో ఉల్లిపంటకు నష్టం జరగగా ఇ క్రాప్‌లో నమోదు కాలేదంటూ కేవలం 50ఎకరాలకు మాత్రమే నష్టం నమోదు చేశారని తెలిపారు. మిగిలిన వారికి నష్టపరిహారం ఎవ్వరు ఇస్తారని అధికారులను నిలదీశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇ క్రాప్‌ సక్రమంగా నమోదు కాలేదని తెలిపారు. 


నీరు కలుషితంపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆర్‌ఆర్‌బీ చెరువు ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అటువంటి నీరు కలుషితమవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిషరీస్‌ డెవల్‌పమెంట్‌ అధికారి శ్రీరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువును చేపల పెంపకానికి లీజుకి తీసుకున్న సొసైటీ సబ్‌లీజుకు ఇవ్వడంతో వారు అందులో మాంసం, ఇతర వ్యర్థాలు వేస్తున్నారని అక్కడి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశా రు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకూ సంబంధిత సొసైటీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెందుర్తి ఎంపీటీసీ బత్తిన మంగ మాట్లాడుతూ మధ్యాహ్న బోజనం నాణ్యత సరిగా ఉండటం లేదని, దీంతో విద్యార్థులు భోజనాలు చేయడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విషయంలో తనకు పలు ఫిర్యాదులు అందాయని, ప్రజాప్రతినిధులు అందరూ పాఠశాలలు సందర్శించి నాణ్యతను పరిశీలించాలన్నారు. ఏజెన్సీల నిర్వహణ సక్రమంగా లేకుంటే చర్యలు తీసుకోవాలని ఎంఈవోను ఆదేశించారు. ఎంపీపీ భర్త అరిగెల రామయ్యదొరను సమావేశానికి శాశ్వత ఆహ్వానితుడిగా నిర్ణయిస్తూ సమావేశం తీర్మానించడం గమనార్హం. ఎంపీడీవో హరిప్రియ, తహశీల్దార్‌ వి.అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement