కష్టాల్లో గోవాడ షుగర్స్‌

ABN , First Publish Date - 2020-11-29T05:59:00+05:30 IST

ఒకప్పుడు రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలిచిన గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ...ప్రస్తుతం ఆర్థిక సమస్య లతో సతమతమవుతోంది. కనీసం కార్మికులకు సకాలంలో వేతనాలను కూడా చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది.

కష్టాల్లో గోవాడ షుగర్స్‌

ఆర్థిక సమస్యలతో సతమతం

కార్మికుల జీతాల చెల్లింపునకు కూడా కటకట

క్వింటా ఉత్పత్తికి ఫ్యాక్టరీపై రూ.200 వరకూ భారం

పౌర సరఫరాల శాఖ నుంచివిడుదల కాని బకాయిలు

ఆప్కాబ్‌కు రూ.110 కోట్లు బాకీ

నెలకు వడ్డీయే రూ.1.1 కోట్లు

పంచదార టోకున ఒకేసారి అమ్ముకుని బాకీ తీర్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలనే డిమాండ్‌


చోడవరం, నవంబరు 28:

ఒకప్పుడు రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలిచిన గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ...ప్రస్తుతం ఆర్థిక సమస్య లతో సతమతమవుతోంది. కనీసం కార్మికులకు సకాలంలో వేతనాలను కూడా చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కార్మికుల వేతనాల తో పాటు, ఫ్యాక్టరీ నిర్వహణ కోసం ‘ఆప్కాబ్‌’ వైపు చూడాల్సి వస్తోంది. పంచదార ధర కొన్నే ళ్లుగా పెంచకపోవడం, ఒకేసారి విక్రయించుకు నేందుకు వెసులుబాటు లేకపోవడం, పౌర సరఫరాల శాఖకు సరఫరా చేసిన పంచదారకు సంబంధించి బకాయిలు విడుదల చేయకపోవడం ఇందుకు ఫ్యాక్టరీ ప్రస్తుత స్థితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.


పెరగని పంచదార ధర

ఫ్యాక్టరీలో పంచదార బస్తా ఉత్పత్తికి రైతుకు ఇచ్చే మద్దతు ధరతో కలిపితే క్వింటాకు రూ.3500 వరకూ ఖర్చవుతుంటే, మార్కెట్‌లో ధర రూ.3300కి మించడం లేదు. ఈ పరిస్థితుల్లో బస్తా పంచదారపై ఫ్యాక్టరీ రూ.200 వరకూ భారం మోయాల్సిన పరిస్థితి ఉంది. గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ ధరలో మార్పు వుండడం లేదు. ఈ పరిస్థితుల్లో పంచదార ధర పెంపుపై ఫ్యాక్టరీ చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నది. 


పౌర సరఫరాల శాఖ బకాయిలు రూ.15 కోట్లు?

ఈ ఏడాది మార్చి నుంచి గోవాడ షుగర్స్‌ యాజమాన్యం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పౌర సరఫరాల శాఖకు రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ చేసేందుకు పంచదార సరఫరా చేస్తున్నది. ఇందుకు సంబంధించి ఫ్యాక్టరీకి సుమారు 34 కోట్ల రూపాయలు రావలసి ఉంది. అయితే ఇప్పటివరకూ రూ.19 కోట్లు మాత్రమే అందినట్టు సమాచారం. ఇంకా సుమారు రూ.15 కోట్లు వరకూ  రావలసి ఉందని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి.  


ఆప్కాబ్‌ బాకీ రూ.110 కోట్లు

గోవాడ ఫ్యాక్టరీకి ‘ఆప్కాబ్‌’ అప్పు భారంగా మారింది. వివిధ అవసరాల కోసం చేసిన అప్పు 110 కోట్ల రూపాయల వరకూ ఉంది. ఈ అప్పుకు ప్రతి నెల సుమారు కోటి 10 లక్షల రూపాయల వరకూ వడ్డీగా చెల్లించవలసిన పరిస్థితి. ఏటా ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసిన పంచదారపై వచ్చే సొమ్ములు ఆప్కాబ్‌ అప్పు తీర్చడానికి సరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి చేసిన పంచదారను టోకున ఒకేసారి విక్రయించి ఆప్కాబ్‌ బాకీ చెల్లించినట్టయితే ప్రతి నెలా కోటి రూపాయలు మిగిలే అవకాశం ఉంది. అయితే పంచదార విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో పరిమితంగా మాత్రమే విక్రయించవలసిన పరిస్థితి నెలకింది. దీంతో ప్రతి నెలా ఇండెంట్‌ మేరకు పంచదారను విక్రయించగా వచ్చే డబ్బులు ఆప్కాబ్‌ నుంచి తీసుకున్న రుణంపై వడ్డీ తీర్చడానికి సరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహకార ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయిన పంచదారను టోకున ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వమైన కొనుగోలు చేసినట్టయితే ఫ్యాక్టరీ ఆర్థికంగా గట్టెక్కడానికి అవకాశం ఉంది. గోవాడ షుగర్స్‌ను ఆర్థికంగా గట్టెక్కించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే...ఫ్యాక్టరీ నష్టాల ఊబిలో కూరుకుపోతుందని రైతులు, కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2020-11-29T05:59:00+05:30 IST