Advertisement
Advertisement
Abn logo
Advertisement

Online క్లాసులకు దూరంగా సర్కారు స్కూళ్ల విద్యార్థులు..!

  • సాధనాలు లేవు.. పాఠాలు ఎలా?
  • ఈ ఏడాది 6,109 మంది ఇళ్లలో ఉపకరణాలు లేని పరిస్థితి 
  • తోటి పిల్లలతో కలిపి కూర్చోబెడుతున్నామంటున్న టీచర్లు
  • కరోనా భయంతో ఇంటికి రాకుండా తల్లిదండ్రుల చర్యలు
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పట్టించుకోని అధికారులు

హైదరాబాద్‌ సిటీ : అధికారుల పట్టింపులేని తనం.. నిరుపేద విద్యార్థులకు శాపంగా మారింది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ క్లాసులు సర్కారు బడుల్లో చదువుతున్న కొంతమంది పిల్లలకు అందని ద్రాక్షగా మారాయి. ఫలితంగా ఏడాదిన్నర కాలంగా వారు సాంకేతిక పాఠాలకు దూరంగా ఉంటున్నారు. ఆన్‌లైన్‌ ఉపకరణాలు లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గతేడాది కంటే  ప్రస్తుతం సాంకేతిక సాధనాలు లేని పిల్లల సంఖ్య పెరిగిపోవడమే నిదర్శనంగా నిలుస్తోంది. కరోనా రెండో దశ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రారంభించిన క్లాస్‌రూమ్‌ బోధనలను మార్చి 23 నుంచి అర్ధాంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే అన్ని తరగతులకు చెందిన విద్యార్థులను పాస్‌ చేస్తూ పై క్లాసుకు ప్రమోట్‌ చేశారు.

6,109 మందికి ఉపకరణాలు లేవు..

 ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సర్కారు బడుల్లోని 3 నుంచి 10 తరగతుల పిల్లలకు టీ-శాట్‌, దూరదర్శన్‌ చానళ్ల ద్వారా సాంకేతిక పాఠాలు చెబుతున్నారు. వాస్తవంగా ఆన్‌లైన్‌ క్లాసులు వినాలంటే ఇళ్లలో టీవీ, స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌లో ఏదైనా ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది. అయితే జిల్లాలోని 681 ప్రభుత్వ, ఎయిడెడ్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది ఆయా క్లాసుల్లో చదువుతున్న 1,17,947 మందిలో 6,109 ఇళ్లలో ఎలాంటి ఉపకరణాలు లేవని విద్యాశాఖ అధికారులు ఇటీవల గుర్తించారు. కాగా, 2020-21లో ఈ సంఖ్య 3,326 ఉండగా, ఈసారి పెరిగింది. దీంతో చాలామంది పేద పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.


ఆన్‌లైన్‌ క్లాసుల వివరాలు...

మొత్తం పాఠశాలలు : 681

3 నుంచి 10 విద్యార్థులు : 1,17,947

ఈ ఏడాది ఎలాంటి ఉపకరణాలు లేని పిల్లలు : 6,109

తోటి విద్యార్థులతో కలిసి వింటున్న వారు :  2,632

గతేడాది విద్యార్థుల సంఖ్య : 83,774

ఉపకరణాలు లేని సంఖ్య : 3,326

తోటి విద్యార్థులతో కలిసి విన్న విద్యార్థులు : 1,634

టీవీలు ఏర్పాటు చేయాలి 

కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్న ప్రభుత్వం అన్నివర్గాలకు ఆన్‌లైన్‌ పాఠాలు చేరే విధంగా చూడాలి. కొన్ని మురికివాడలు, వలస కార్మికుల ఇళ్లలో ఇప్పటికీ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పిల్లలను గుర్తించి వారి నివాస ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లలో 10నుంచి 20 మంది చొప్పున భౌతిక దూరంతో కూర్చోబెట్టి ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పించాలి. లేకుంటే రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా తయారయ్యే ప్రమాదం ఉంది. - గడ్డం శ్యామ్‌, పీడీఎస్‌యూ, గ్రేటర్‌ ప్రధాన కార్యదర్శి

పట్టింపులేని అధికారులు, టీచర్లు..

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెబుతున్న అధికారులు ఆచరణలో శ్రద్ధ వహించడం లేదని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆన్‌లైన్‌ తరగతులను జిల్లాలో ఎంత మంది పిల్లలు వినడం లేదని గుర్తించిన అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఉపాధి నిమిత్తం నగరానికి వలసవచ్చిన కార్మికులు, మురికివాడల పిల్లలు ఆన్‌లైన్‌ కాసులకు దూరంగా ఉంటున్నప్పటికీ వారిని పట్టించుకోవడం లేదని సమాచారం. 


టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని పిల్లలను తోటి విద్యార్థులతో కలిపి బోధనలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కాగితాలపై లెక్కలు చూపిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వారికి సాంకేతిక పాఠాలు అందని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 6,109 పిల్లల ఇళ్లలో సాంకేతిక  ఉపకరణాలు లేవని గుర్తించిన అధికారులు వారిని 2,632 మంది సహచర విద్యార్థులతో కలిపి పాఠాలు అందిస్తున్నామని తెలిపారు. అయితే కరోనా భయంతో ఇందులో సుమారు 1,400 మంది పిల్లలను తోటి విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఇళ్లలోకి రాకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా తరగతుల్లో అధికారికంగా పేర్లు ఉంటున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement